అదానీ మదిలో ‘సౌదీ’!

ABN , First Publish Date - 2022-03-19T12:58:24+05:30 IST

ఆసియాలో రెండో అతిపెద్ద కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌.. సౌదీ అరేబియాతో భాగస్వామ్య యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

అదానీ మదిలో ‘సౌదీ’!

సౌదీ అరామ్కోలో స్వల్ప వాటా కొనుగోలుతో పాటు ఉమ్మడి పెట్టుబడుల యోచనలో అదానీ గ్రూప్‌ 

ఇరువర్గాల మధ్య ప్రాథమిక చర్చలు 

న్యూఢిల్లీ: ఆసియాలో రెండో అతిపెద్ద కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌.. సౌదీ అరేబియాతో భాగస్వామ్య యత్నాల్లో ఉన్నట్లు  సమాచారం. పరస్పర సహకారంతోపాటు సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన సౌదీ అరామ్కో, పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (పీఐఎ్‌ఫ)తో కలిసి పెట్టుబడులు పెట్టే దిశగా ఇరువర్గాల మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలిసింది. అంతేకాదు, సౌదీ అరామ్కోలో పీఐఎ్‌ఫకున్న వాటాలో కొంత అదానీ కొనుగోలు చేసే ఆలోచన కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అరామ్కోలో ఈక్విటీ వాటా కోసం అదానీ ఇప్పటికిప్పుడు వందల కోట్ల డాలర్లు వెచ్చించకపోవచ్చు. ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టడం లేదా ఆస్తుల పరస్పర బదిలీ వంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలెక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంట రసాయనాలు విభాగాల్లో సౌదీ అరామ్కో లేదా దాని అనుబంధ విభాగమైన సాబిక్‌తో అదానీ జట్టుకట్టే వీలుంది. గత నెలలో సౌదీ ప్రభుత్వం అరామ్కోలోని 4 శాతం వాటాను పీఐఎ్‌ఫకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ వాటా విలువే 8,900 కోట్ల డాలర్లు. అంటే, గౌతమ్‌ అదానీ కుటుంబ ఆస్తికి దాదాపు సమానం. 

Updated Date - 2022-03-19T12:58:24+05:30 IST