ఒక్కసారిగా ఇంట్లో ఒంటరినైపోయా!

ABN , First Publish Date - 2020-08-16T05:30:00+05:30 IST

కరోనా విజృంభణ... లాక్‌డౌన్ల పరంపర... కొందరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ‘దృఢం’గా మారుతున్నారు. ఆ కొందరిలో ముందుంటారు నటి ఇలియానా...

ఒక్కసారిగా ఇంట్లో ఒంటరినైపోయా!

కరోనా విజృంభణ... లాక్‌డౌన్ల పరంపర... కొందరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ‘దృఢం’గా మారుతున్నారు. ఆ కొందరిలో ముందుంటారు నటి ఇలియానా. వ్యాయామాన్ని వ్యసనంగా మార్చుకున్న ఈ గోవా బ్యూటీ ‘లాక్‌డౌన్‌’ కబుర్లు చెప్పిందిలా...


నేనూ అందరిలానే లాక్‌డౌన్‌ అంటే కొన్ని రోజులకే పరిమితమని అనుకున్నాను! ఇన్ని నెలల బ్రేక్‌ అస్సలు ఊహించలేదు. అమ్మావాళ్లు అమెరికాలో ఉన్నారు. కుటుంబంతో నాకు అనుబంధం ఎక్కువ. సమయం దొరికితే వాళ్లతోనే గడుపుతాను. అలాంటిది ఒక్కసారిగా ఇంట్లో ఒంటరినైపోయాను. కానీ పరిస్థితిని అర్థం చేసుకున్నా. ఏంచేద్దామని ఆలోచిస్తుంటే ఎప్పుడో వదిలేసిన బేకింగ్‌ గుర్తుకు వచ్చింది. నాకు చాలా ఇష్టమైనది కూడా! చాలా కాలం తరువాత బ్రెడ్‌ తయారు చేశా. అయినా బాగా రుచిగా వచ్చింది. కేక్‌లనూ ఓ పట్టు పట్టా. 

రోజులు వారాలవుతున్నాయి. వారాలు నెలలుగా మారుతున్నాయి. ఏదీ అనుకున్నట్టు జరగడంలేదు. అప్పుడు అనుకున్నా... ‘కేక్‌లు, బ్రెడ్లూ తింటూ కూర్చొంటే... లాక్‌డౌన్‌ ఎత్తేసే సరికి పెద్ద బంతిలా తయారవుతా’నని! వెంటనే రోజువారీ మెనూలో నుంచి బ్రెడ్‌, షుగర్‌, ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌ కట్‌ చేశా. తక్కువ మోతాదులో పిండి పదార్థాలుండే వంటకాలతో ప్రయోగాలు మొదలుపెట్టా. 


80 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌... 

నా వర్కవుట్‌ రొటీన్‌ను క్రమం తప్పకుండా కొనసాగించాలనుకున్నా. దాని కోసం 80 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ స్వీకరించి, మరింత సమయం కేటాయించా. వ్యాయామాలతో రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు. కానీ దానివల్ల మొదటి రోజు నుంచే మనం చురుగ్గా ఉంటాం. ఉత్సాహంగా పనిచేస్తాం. అందుకే రోజూ ఉదయం ఓ గంట వర్కవుట్స్‌ చేస్తున్నా. తరువాత అల్పాహారం తీసుకొంటా. 


నేను నేనులా... 

క్రమం తప్పని వ్యాయామం నన్ను నాలా ఉంచింది. లాక్‌డౌన్‌లో అతిపెద్ద సమస్య మానసిక ఒత్తిడి. నేనూ ఇబ్బంది పడ్డాను. కుటుంబ సభ్యులకు దూరంగా, ఒంటరిగా గడపడమంటే చాలా కష్టం. తొలి వారం రోజులు ఎంతో భారంగా గడిచాయి. కూర్చున్నా... నిల్చున్నా... ఏంచేసినా ఏడుపొచ్చేసేది. నిదానంగా వాస్తవంలోకి వచ్చాను. ఆ సమయంలో నా మనసు ఎటూ పరుగులు పెట్టకుండా, ఆందోళనలోకి వెళ్లకుండా, ప్రశాంతతంగా ఉన్నానంటే అందుకు వర్కవుట్లే కారణం. 

కరోనాకు ముందు పర్సనల్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో జిమ్‌లో వ్యాయామం చేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో కదా..! జిమ్‌లో లాగా అంత సౌకర్యవంతంగా, అటు ఇటు కదిలేంత ఖాళీ ఇంట్లో ఉంటుందా అని మొదట్లో అనిపించింది. అయితే ఒక్కసారి మొదలెట్టాక అన్నీ అవే చక్కగా కుదిరిపోయాయంతే! 




రెండు రోజులు బ్రేక్‌... 

ఉన్నట్టుండి ఒక రోజు ఆరోగ్యం దెబ్బతింది. అలాగని పెద్ద సమస్యేం కాదు.. జ్వరం వచ్చినట్టు అనిపించింది. కడుపులో మంట. బాగా ఇబ్బంది పడ్డాను. దాంతో రెండు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకున్నా. కానీ వర్కవుట్స్‌ చేయకుండా ఉండలేకపోయా. వెంటనే మళ్లీ మొదలుపెట్టేశాను. వ్యాయామం నాకు వ్యసనంలా మారింది. 


కాన్వాస్‌పై రంగులు... 

ఇక మిగిలిన సమయంలో బట్టలు ఉతుకుతున్నా. గిన్నెలు కడుగుతున్నా. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి రకరకాల వంటలు చేస్తున్నా. ఇల్లంతా సర్దుతున్నా. నచ్చని వస్తువులు మార్చేస్తున్నా. నాన్న ఉండుంటే ఈ పని ఆయనే చూసుకొనేవారు. ఇవి కాకుండా నా అభిరుచులను ఆస్వాదిస్తున్నా. వాటికి ఇంత కంటే మంచి సమయం ఎప్పుడు దొరుకుతుంది! కాన్వాస్‌పై రంగులద్దుతున్నా. పెయింటింగ్‌ అంటే నాకు ఇష్టం. అయితే ఇప్పుడే వాటిని ఎవరికీ చూపించదలుచుకోలేదు. బొమ్మ బాగా వస్తే అప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెడతా. స్పందన బాగుంటే, ఎగ్జిబిషన్‌ గురించి ఆలోచిస్తా. 


ఫస్ట్‌ ఫ్లయిట్‌లో అమెరికాకు... 

సాధారణ పరిస్థితులు రాగానే... ఫస్ట్‌ ఫ్లయిట్‌లో అమెరికాకు ఎగిరిపోతా. అక్కడికి వెళ్లిన తరువాత క్వారంటైన్‌లో ఉండాలని తెలుసు. కానీ ఆ తరువాతైనా మావాళ్లను కలుస్తా కదా! అమ్మను కౌగిలించుకుంటా. కుటుంబానికి దూరంగా ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. నిజంగా ఈ సమయం చాలా కష్టంగా, భారంగా గడుస్తోంది. ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌తో ‘ద బిగ్‌ బుల్‌’ సినిమా చేస్తున్నా. ఆయన ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం బానే ఉన్నానని ఆయన నాకు చెప్పారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నా.


Updated Date - 2020-08-16T05:30:00+05:30 IST