80 ఏళ్ళ సమ్మోహనుడు

ABN , First Publish Date - 2021-05-23T05:30:00+05:30 IST

యాభై ఏళ్లుగా తెలుగు సినిమాతో స్నేహం చేస్తున్న నటుడు చంద్రమోహన్‌. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఇంతవరకూ దాదాపు 930 చిత్రాల్లో నటించారు. ఇందులో 175 చిత్రాల్లో హీరోగా నటించారు. ఐదు తమిళ చిత్రాల్లో, మలయాళ, కన్నడ భాషల్లో ఒక్కో సినిమాలో

80 ఏళ్ళ సమ్మోహనుడు

యాభై ఏళ్లుగా తెలుగు సినిమాతో స్నేహం చేస్తున్న నటుడు చంద్రమోహన్‌. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు.  ఇంతవరకూ  దాదాపు 930 చిత్రాల్లో నటించారు. ఇందులో 175 చిత్రాల్లో హీరోగా నటించారు. ఐదు తమిళ చిత్రాల్లో, మలయాళ, కన్నడ భాషల్లో ఒక్కో సినిమాలో ఆయన నటించారు. 81వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చంద్రమోహన్‌ సుదీర్ఘమైన తన నట జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఎన్నో జ్ఞాపకాలను నవ్యతో  పంచుకొన్నారు.


ఇది మీకు 81వ పుట్టిన రోజు. బర్త్‌డేను జరుపుకొనే అలవాటు ఉందా?

పెద్ద కుటుంబాల్లో ఉండడం వల్ల పుట్టినరోజు అని ప్రత్యేకంగా సెలబ్రేషన్స్‌ ఏవీ ఉండేవి కావు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మా సినిమా ఫ్యామిలీ చాలాసార్లు, చాలా ఏళ్లు పుట్టినరోజుని ఘనంగా సెలబ్రేట్‌ చేసేది. ఒకవేళ ఎప్పుడైనా ఇంట్లో ఉండే సందర్భం వస్తే మా కుటుంబ సభ్యుల మధ్య   ఆనందంగా జరుపుకొనేవాణ్ణి. దానికి ముఖ్య కారణం నా సతీమణి, పిల్లలు, మనవరాళ్లు, ఇప్పుడు  మేనలుళ్లు, వారి కుటుంబాలు. గత రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. లాస్టియర్‌ ఇక్కడే ఉంటున్న  మా చెల్లెలు వాళ్లు మా ఇంటికి వచ్చారు. ఈసారి లాక్‌డౌన్‌ అమలులో ఉంది కనుక ఎటువంటి హడావిడీ లేదు. వాట్సప్‌ వీడియో శుభాకాంక్షలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 


ఈ మధ్య సినిమాల సంఖ్య తగ్గించుకోవడానికి కారణం?

ఆరోగ్యమే. దాదాపు 50 ఏళ్లు నిర్విరామంగా పనిచేశాను. ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ రాత్రింబవళ్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. ఎవరైనా హెచ్చరిస్తే ‘ఇనుముకు చెదలు పడతాయా’ అని వెటకారంగా మాట్లాడేవాణ్ణి. కానీ నా నిర్లక్ష్యం నన్ను దెబ్బతీసింది. ‘రాఖీ’ చిత్రంలో ఎమోషనల్‌ సీన్‌ చేసిన వెంటనే గుండెపోటు వచ్చి షూటింగ్‌ స్పాట్‌ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. నా అనారోగ్యం కారణంగానే ‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్‌ వాయిదా వేయాల్సి వచ్చింది.  నా వల్ల నిర్మాతలు ఇబ్బంది పడడం ఇష్టం లేదు. అందుకే రిటైర్‌ కావాలని నిర్ణయించుకున్నాను. అయినా టీవీ, యూట్యూబ్‌.. ఇలా ఏదో ఒక రూపంలో నన్ను ప్రేక్షకులు చూస్తునే ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు అభిమానులు ఎక్కువయ్యారు. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తోంది.


ఈ కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

నా కన్నా మా ఇంట్లో వాళ్లు నా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఎందుకో స్వేచ్చ పోయినట్లు అనిపిస్తోంది. కానీ తప్పదు. మన వల్ల మరొకరికి ఇబ్బంది కలగకూడదు. వీలైనంతవరకూ జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండడం అందరికీ క్షేమం.


మీ తొలి చిత్రం రంగులరాట్నం తర్వాత ఎదుర్కొన్న సమస్యలు గుర్తున్నాయా?

(నవ్వుతూ) చాలా బాగా గుర్తున్నాయి. ‘రంగులరాట్నం’  1966లో విడుదలయింది. నా నటనకు మంచి పేరు వచ్చింది. నంది అవార్డు కూడా అందుకొన్నాను. కానీ ఆరునెలల వరకూ మరో సినిమా లేదు. ఆ తర్వాత  ‘మరుపురాని కథ’, ‘బంగారు పిచ్చుక’ చిత్రాల్లో నటించాను. అటుపైన రెండున్నర ఏళ్లవరకూ వేషాలే లేవు. మా గురువు బి.ఎన్‌.రెడ్డిగారు నన్ను హీరోగా తప్ప చేయవద్దన్నారు. అందుకే మొదట్లో చిన్న చిన్న వేషాలు వచ్చినా ఒప్పుకోలేదు. ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడానికి మొహమాటం. మద్రాసు వెంకటనారాయణ రోడ్డులో ఉన్న పార్కులో పస్తులతో పడుకున్న రోజుల్ని ఇప్పటికీ  మరిచిపోలేను. ఒకదశలో మద్రాసు వదిలి వెళ్లిపోదామనే అనుకున్నాను. కానీ పట్టుదల పెరిగి అక్కడే ఉండి తేల్చుకుందామని నిర్ణయించుకున్నాను. నన్ను నేను పోషించుకోవాలి. ప్రేక్షకులు నన్ను మరిచిపోకూడదు. అందుకే హీరోగానే నటించాలనే నా పట్టుదలను సడలించుకోవడంతో  ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాను. 


ప్రారంభంలో చిన్న చిన్న వేషాలు చాలా వేశారు కదూ

అవునండి. ఒక్క షాట్‌లో మాత్రమే కనిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. కాలేజ్‌ స్టూడెంట్‌గా ప్రారంభించి, కమెడియన్‌, హీరో తమ్ముడు, హీరోయిన్‌ మరిది... ఇలా చాలా పాత్రలు చేశాను. ఈ ప్రవాహంలో ఎటు కొట్టుకుపోతున్నానో ఆలోచించే తీరిక కూడా ఉండేది కాదు. ఏ వేషం వేసినా నా పరిధిలో బాగా చేయడానికే ప్రయత్నించేవాణ్ణి. అయితే ఒకటి మాత్రం నిజం.  హీరో పాత్రలే కావాలనుకుని ఉంటే 50 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేవాణ్ణే కాదు.


‘సిరిసిరి మువ్వ’ చిత్రంతో మళ్లీ మీకు హీరోగా బ్రేక్‌ వచ్చింది కదూ

నాకు హీరో  వేషం ఇచ్చి నిలబెడదామని కొంతమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు కానీ ఇంతకుముందు నేను పోషించిన పాత్రల ప్రభావం వ్యాపార పరంగా అడ్డుపడింది. దాంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. చివరకు మా అన్నయ్య కె.విశ్వనాథ్‌ దైఽర్యం చేసి ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. హీరో జీవితానికి ఈ చిత్రం తిరిగి నాంది పలికింది. ఇక అప్పటినుంచి సింగిల్‌ కాల్షీటు పాత్రలు అంగీకరించకుండా జాగ్రత్త పడ్డాను. అప్పుడే ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో అవకాశం  రావడంతో హీరోగా నా స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాను.


మీరు హీరో అయిన తొలి రోజుల్లో చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు కదా... 

పరుగు పందెంలో ఉండడం ముఖ్యం. అందుకే మరో రకంగా ఆలోచించడానికి టైమ్‌ ఉండేది కాదు. అయితే ఒక  విషయం ఆ సమయంలో నేను ఎదుర్కొన్న  సమస్యల పరిష్కారం కోసం ఎవరి సాయం తీసుకోలేదు. నా ఆలోచనే నన్ను ముందుకు నడిపించింది. ఆల్‌రౌండర్‌గా నాకు పేరు రావడంతో చేతినిండా సినిమాలు ఉండేవి. 


మీరు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినవి ఏమిటి?

చాలా ఉన్నాయి. సక్సెస్‌ అయిన చిత్రాలు మీకందరికీ తెలిసినవే. అపజయం పొందిన వాటిల్లో  ‘నాగమల్లి’, ‘సువర్ణసుందరి’ వంటి మంచి చిత్రాలు  కొన్ని ఉన్నాయి. హిందీ చిత్రం ‘నవరంగ్‌’ ప్రేరణతో బీరం మస్తానరావు స్వీయ దర్శకత్వంలో ‘సువర్ణసుందరి’ చిత్రం నిర్మించారు. 70 రోజుల పాటు ఆ చిత్రానికి కష్టపడి  పనిచేశాను. మంచి పాటలు ఉన్నాయి. కానీ బాడ్‌లక్‌. ఆ సినిమా ఆడలేదు. 


శోభన్‌బాబుతో మీకున్న స్నేహాన్ని వివరించండి

అతను నాకు మంచి ఫ్రెండ్‌, గైడ్‌ కూడా. అతని పద్ధతులు నాకు చాలా నచ్చేవి. సినిమా ఇండస్ట్రీలో నాకు అత్యంత ఆత్మీయుడు. మేమిద్దరం ఏరా అంటే ఏరా అని పిలుచుకొనేవాళ్లం. నా చెయ్యి మంచిదని ఆస్తి కొన్న ప్రతిసారీ నా దగ్గర పదివేలు తీసుకొనేవాడు. అతని మరణం నా జీవితంలో తీరని లోటు. అలాగే హీరో కృష్ణ కూడా నాకు మంచి స్నేహితుడే.


కృష్ణ, విజయనిర్మల పెళ్లి మీ సారథ్యంలోనే జరిగింది కదూ

అవును. పెళ్లి విషయంలో కృష్ణకు సపోర్ట్‌ చేయడం ముఖ్యం అనుకున్నాను. మిగిలిన విషయాలు ఆలోచించే మెచ్యూరిటీ నాకు అప్పుడు లేదు. వాళ్లిద్దరికీ నేను సన్నిహితుణ్ణి కావడంతో ఆ పెళ్లి జరిపించే బాధ్యత నా మీద పెట్టారు. నేను, మేకప్‌మ్యాన్‌ మాధవరావు, నిర్మాత రాఘవ, జర్నలిస్టు మోహన్‌కుమార్‌ తిరుమలలో వారి పెళ్లి జరిపించాం. మేం వద్దన్నా వాళ్లు వెనక్కి తగ్గేవారు కాదేమో (నవ్వు)


మీ పక్కన నటించిన ప్రతి కొత్త హీరోయిన్‌ స్టార్‌గా ఎదిగారు కదా. ఎలా అనిపిస్తుంటుంది?

(నవ్వుతూ) యాదృచ్చికమే అయినా నా పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో అత్యధికులు అగ్ర స్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ... ఇలా ఎంతమందికో నేను తొలి హీరోను. అయితే అందులో నా ప్రతిభ ఏమీ లేదు. అది వారి అదృష్టం, ప్రతిభ. ‘చంద్రమోహన్‌ పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ’ అనే సెంటిమెంట్‌ వ్యాపించేలా చేశారు.  


మీ ఎదుగుదలకు సహకరించిన దర్శకుల గురించి చెప్పండి

నాలో నాకే తెలియని టాలెంట్‌ ఉందని బి.ఎన్‌.రెడ్డిగారు, బాలచందర్‌గారు, ఎస్వీ రంగారావుగారు అంటుండేవారు. దర్శకులు ఎంత తీసుకోగలిగితే అంత ప్రతిభ ఇతనిలో ఉంది అన్న పెద్దల ఆశీస్సులకు న్యాయం చేసే పాత్రల కోసం ఎదురుచూసేవాణ్ణి. బిఎన్‌గారు వేసిన పునాది నన్ను ఈనాటి వరకూ నిలబెట్టింది. అలాగే మా అన్నయ్య విశ్వనాథ్‌గారు, బాపుగారు, బాలచందర్‌గారు, రాఘవేంద్రరావు, వాసు, రేలంగి నరసింహారావు వంటి ప్రముఖుల దగ్గర పనిచేశాను. ముఖ్యంగా విశ్వనాథ్‌గారు నన్ను ఎంతో తీర్చిదిద్దారు. ‘ఇది నేనేనా’ అనిపించే విధంగా ఆయన నన్ను మౌల్డ్‌ చేశారు. నేనే కాదు ఆయన విషయంలో చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇలాగే ఫీలయ్యేవారు.


మీ ప్రతిభకు తగిన గుర్తింపు అవార్డుల పరంగా రాలేదని అసంతృప్తి ఉందా?

లేనేలేదు. ప్రజాభిమానమే నాకు అవార్డ్‌. రివార్డ్‌. అయినా నా సీనియర్స్‌ సావిత్రి,  కన్నాంబ, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం.. వీరంతా గొప్ప గొప్ప అవార్డులకు అర్హులు. వారికి ఇచ్చి ఉంటే నిజంగా అవార్డులకు గౌరవం వచ్చేది. నాకంటే ఎంతో ప్రతిభ కలిగిన వారికే పద్మశ్రీ వంటి పురస్కారాలు దక్కలేదు. అందుకే వాటి మీద నాకు ఆసక్తి లేదు.


దర్శకుడిగా మారాలని ఎప్పుడూ అనిపించలేదా?

లేదు. అది చాలా గొప్ప అర్హత కలిగిన  వృత్తి. అనుకున్నంత సులభం కాదు. అలాగే నిర్మాత కావాలని కూడా నేనెప్పుడూ అనుకోలేదు. నేనే కాదు నా బంధువుల్లో ఎవరు సినిమా తీస్తానంటూ వచ్చినా ఎంకరేజ్‌ చేసేవాణ్ణి కాదు. మా మేనల్లుడు శివలెంక కృష్ణప్రసాద్‌కి కూడా వద్దనే చెప్పాను. కానీ  నా మాట వినలేదు.  సినిమా అంటే ఉన్న అభిరుచితో నిర్మాతగా మారి శ్రీదేవి మూవీస్‌ బేనరుపై చాలా సినిమాలే తీశాడు.


మీకూ రాజేంద్రప్రసాద్‌కు ఒక దశలో పడేది కాదని అంటారు!

చాలా ఏళ్ల క్రితం సంగతి అది. కానీ అదంత గుర్తు పెట్టుకొనే విషయం కాదు. అతను, నేను చాలా సినిమాలు చేశాం. మంచి పంచ్‌ ఉన్న నటుడు. అప్పుడప్పుడు చిన్నచిన్న మనస్పర్ధలు వచ్చినా మేమిద్దరం  కలిసి ఉండేవాళ్లం. ఈ మధ్య రమాప్రభగారి పుట్టిన రోజున రాజేంద్రప్రసాద్‌ దంపతులు  వెళ్లి ఆమెను సన్మానించిన వీడియో చూసి చాలా ఆనందించా. గాడ్‌ బ్లెస్‌ హిమ్‌.


వినాయకరావు


ఎన్టీఆర్‌తో అనుబంధం

నేను కాలేజీలో ఉండగానే  ఆయన అభిమానిని. ఆయనంత అందగాడు ఏ సినీ ఇండస్ట్రీలో ఉండడు అని నా అభిప్రాయం. ఆయన పోషించిన కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఈ జన్మలో అలాంటి వేషాలు నేను వెయ్యలేను. అందుకే ఆ అభిమానం మరింత పెరిగిందేమో. అవకాశాలను బట్టి ఆయనతో కలసి కొన్ని సినిమాలు చేశాను. అయితే రామారావుగారితో కంటే నాగేశ్వరరావుగారితోనే ఎక్కువ చిత్రాలు పనిచేశాను. రామారావుగారి డిసిప్లిన్‌ అంటే నాకు చాలా గౌరవం. ఆయనలా ఉండాలని ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు.




పర్సనాలిటీ వల్ల ఇబ్బందులు... 

అయితే అడుగు ఎత్తు ఎక్కువుంటే నన్ను దాటి వెళ్లిపోయేవాడివయ్యా అని ఏయన్నాఆర్‌ అంటూ ఉండేవారు. అలా మరో అడుగు ఎత్తు ఉండుంటే ఇన్ని సినిమాలు చేసేవాడినా అనేది సందేహమే. రామారావుగారిలా పౌరాణిక వేషాలు వేయాలి, పద్యాలు పాడాలని కోరిక నాకు ఉండేది. కానీ అప్పుడు నిజంగా పర్సనాలిటీ అడ్డం పడింది. నా పక్కన నటించిన హీరోయిన్స్‌తో కూడా హైట్‌ పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ‘యశోదాకృష్ణ’ చిత్రంలో నటించేటప్పుడు శ్రీదేవి చాలా చిన్న పిల్ల. షూటింగ్‌ అయ్యాక మద్రాసు తిరిగి వస్తున్నప్పుడు ఒళ్లో పడుకుని నిద్ర పోయేది. ఆమె నా మొదట్లో నా పక్కన హీరోయిన్‌గా నటించింది కానీ నా కంటే పొడుగు పెరిగిపోయింది. ‘మీ పక్కన  మళ్లీ ఎప్పుడు హీరోయిన్‌గా చేస్తాను?’ అనేది కానీ అది జరగలేదు. ఇలా కొన్ని సందర్భాల్లో పర్సనాలిటీ వల్ల ఇబ్బందులు పడ్డాను. 


మీ పక్కన నటించిన హీరోయిన్లలో మీకు ఫేవరెట్‌ ఎవరు?

జయసుధ అని చెప్పాలి. మేమిద్దరం 34 చిత్రాల్లో జంటగా నటించాం. అలాగే లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి.... ఇలా చాలా మంది హీరోయిన్లతో నటించాను. ఒక్కో  హీరోయిన్‌తో పది, పదిహేను చిత్రాలు కూడా చేశాను.


మీరు నమ్మిన దైవం ఎవరు?

మేం లింగధారులం. శివుడు మాకు ఇష్టదైవం. ప్రతిరోజూ పంచాక్షరి, మృత్యుంజయ మంత్రం పఠిస్తుంటాను.


మిమిక్రీ ఆర్టిస్ట్‌ అనుకరించలేని నటుడు మీరు. ఎలా ఫీలవుతుంటారు?

నిజమే. ఈ విషయం చాలా మంది అన్నారు. ఓ మూసలో ఇమడని నా లాంటి ఆర్టిస్టులను ఇమిటేట్‌ చేయడం కష్టమేమో!


నటన అనేది ఓ పరుగు పందెం అంటారు. మీరేమంటారు?

(నవ్వుతూ) నటన మాత్రమే కాదు జీవితమే ఓ పరుగు పందెం. అయితే దాటిన మైలు రాయి దగ్గకు మళ్లీ వెళ్లలేం. అలాగే ఏ పాత్ర ప్రత్యేకత దానిదే. ఒక ‘రంగులరాట్నం’, ఓ ‘సీతామహాలక్ష్మి’, ఒక పదహారేళ్ల వయసు మళ్లీ రిపీట్‌ అవవు. అలాగే జీవితంలో కూడా. నటించనంత కాలం జీవితం ప్రశాంతంగానే ఉంటుంది.



మీ కుటుంబం గురించి చెప్పండి

నా భార్య జలంధర, రచయిత్రి. డాక్టర్‌ గాలి బాలసుందరరావుగారి ఏకైక కూతురు ఆమె. మాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి మధుర మీనాక్షి. అల్లుడితో కలసి  అమెరికాలో ఉంటోంది. వారికి పిల్లలు లేరు. రెండో అమ్మాయి మాధవి. చెన్నైలో ఉంటోంది. వారికి ఇద్దరు  ఆడపిల్లలు.


సినిమా జీవితం మీకు ఏమి నేర్పించింది?

చాలా నేర్పింది. పేరు, డబ్బు, రిలేషన్స్‌.. ఏవీ శాశ్వతం కాదు అని నేర్పింది. ఆర్ధికంగా జాగ్రత్త పడకపోతే వచ్చే దైన్యం  దుర్భరంగా ఉంటుందని  తెలియబర్చింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని చెప్పింది. ఎప్పటికీ చెప్పుకోలేని చేదు నిజాలు గుండెల్లో ఎలా దాచుకోవాలో నేర్పింది.


పారితోషికం గురించి పట్టింపు లేని నటుడు చంద్రమోహన్‌ అంటారు. నిజమేనా?

(నవ్వి)నిజానికి నేను డబ్బు మనిషిని. పిసినిగొట్టును అన్న పేరు కూడా ఉంది. డబ్బు విషయంలో నాకు చాలా అపనమ్మకాలు ఉన్నాయి. కానీ పారితోషికం విషయంలో మాత్రం నాకు పట్టు కన్నా విడుపే ఎక్కువ. నేను ఎప్పుడూ ఏ నిర్మాతను డబ్బు కోసం ఇబ్బంది పెట్టడమో, షూటింగ్‌ ఎగ్గొట్టడమో చేయలేదు. నేను ఆర్టిస్ట్‌గా చాలా బిజీగా ఉండే రోజుల్లో నిర్మాతలు ఇచ్చిన చెల్లని చెక్కులు మా ఇంట్లో చాలా ఉండేవి. వాటిని భద్రంగా ఆల్బం రూపంలో చాలా కాలం దాచాను. నటుడిగా నాకు వచ్చిన పేరు, ప్రేక్షకుల అభిమానం.. వీటికంటే డబ్బు ముఖ్యం కాదు.


ఒక కొడుకు ఉంటే హీరోగా పరిచయం చేసేవాడిని కదా అని ఎప్పుడన్నా అనిపించిందా?

సినిమా ఇండస్ట్రీలో హీరో కొడుకు అనే ఏకైక క్వాలిఫికేషన్‌ వల్ల ఎవరూ నిలదొక్కుకోలేరు. దానికి టాలెంట్‌తో పాటు చాలా కావాలి. ఈ విషయంలో నాకు శోభన్‌బాబు ఆదర్శం. ఒకవేళ కొడుకు ఉంటే, శోభన్‌బాబు కొడుకులాగా తయారు చేసేవాడినేమో!


నాలుగు తరాల హీరోలతో నటించారు. ఎలా అనిపిస్తుంటుంది?

చాలా అదృష్టంగా భావిస్తుంటాను. మేం మా సీనియర్స్‌ను గౌరవించేవాళ్లం. అలాగే ఇప్పటి హీరోలు కూడా నాలాంటి సీనియర్‌ ఆర్టిస్టులను గౌరవిస్తుంటారు. కొంతమంది మా అనుభవాలు అడిగి తెలుసుకుంటారు. ఆ కాలంలో జరిగిన సంఘటనలు చెప్పమని అడుగుతుంటారు. తరాలు మారుతున్నా ఆర్టిస్టులందరిదీ ఒకే కుటుంబం. ఆ అనుబంధం అలాగే కొనసాగుతుంటుంది.

Updated Date - 2021-05-23T05:30:00+05:30 IST