బుద్ధితోనే సిద్ధి!

ABN , First Publish Date - 2020-08-21T06:03:43+05:30 IST

జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడమే వినాయకచవితి మొదటి తత్త్వం.

బుద్ధితోనే సిద్ధి!

జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడమే వినాయకచవితి మొదటి తత్త్వం. వినాయకుడుకి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటితో పూజ చేయాలి.


శ్రీమహావిష్ణువుకు తులసిమాల వేస్తారు. శివుడిని మారేడు దళాలతో పూజిస్తారు. అమ్మవారికి కడిమిపూలు పట్టుకొచ్చి వేస్తారు. గణనాథుడికి గడ్డిపరకలు వేస్తారు. ఆ ఏకదంతుడికి  అవే ఇష్టం. వినాయకుడికి పూజాధికాలు చేసే సమయంలో అన్నీ కాయలే కడతారు. ఎందుకంటే భాద్రపద మాసంలో అన్నీ కాయలే లభిస్తాయి. పండ్లు కావు. కాబట్టి పచ్చి వెలక్కాయలు, పచ్చి జామకాయలు పెడతారు.


అంటే ప్రకృతిని ఎలా ఉంటే అలాగే అస్వాదించాలి. జీవితాన్ని కూడా ఎలా ఉంటే అలా ఆస్వాదించాలి. వినాయకుడు ఆటంకాలను సైతం అలాగే జయించాడు. 


గంటమున్‌ కూలిన వేళ... దంతమున్‌ చివ్వున లాగి

భారతము అశేషము రాసెనెవ్వండు


వ్యాసమహర్షి లక్షా ఏడు వందల శ్లోకాలతో భారతాన్ని ఆశువుగా చెబుతుంటే వినాయకుడు రాశాడు. అలా వ్యాసమహర్షి శ్లోకాలు చెబుతుంటే, లంబోదరుడు రాస్తుండగా గంటం విరిగిపోయింది. వ్యాసుడుకి, వినాయకుడికి మధ్య పందెం ఏమిటంటే ఆగకుండా వ్యాసుడు చెప్పాలి, ఆపకుండా వినాయకుడు రాయాలి. మరి గంటం విరిగిపోతే గణనాథుడు ఏం చేశాడో తెలుసా! తన దంతాన్ని ఊడ బెరికి దాంతో ఆ రోజు రాయాల్సిన శ్లోకాలను పూర్తి చేశాడు. అందుకే ఏకదంతుడు అయ్యాడు.అంతేకాని గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు దంతం విరగలేదు.


విద్యార్థులందరికీ ఆదర్శం వినాయకుడు. పెన్ను లేదని, ‘కంప్యూటర్‌ నాట్‌ వర్కింగ్‌’ అని తప్పించుకోవడం అసమర్థత. అప్పగించిన పనిని అన్ని ఆటంకాలూ జయించి పూర్తి చేయడం సమర్థత. నీకు ఉన్న వాటితో ఏదో రకంగా పూర్తి చేయాలి. వినాయకుడి తత్త్వం ద్వారా అది నేర్చుకోవాలి.  బుద్ధి ఉపయోగిస్తే సిద్ధి కలుగుతుంది. ఆ విషయంలో స్వామి వారే ఆదర్శం.

 గరికిపాటి నరసింహారావు




 అమ్మ సంకల్పమే!

వినాయకుడి ఆవిర్భావం గురించిన కథ అందరికీ తెలిసిందే. పార్వతీదేవి నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసిందని పురాణాల్లో చదువుకున్నాం. జగత్తు అంతా పార్వతీదేవిదే. అలాంటి ఆమెకు నలుగుపిండితో బొమ్మను చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా ఆమె ప్రాణం పోసిన బాలుడు శివుడుని గుర్తుపట్టలేడా? చిన్నపిల్లాడు గుర్తుపట్టలేదని అనుకుందాం! ‘పార్వతీ దేవి ప్రాణం పోసిన బాలుడు’ అని శివుడికి తెలియదా? వాస్తవమైన కథ అది కాదు. ఇక్కడే లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ కథకు సమాధానం దేవీ భాగవతంలో ఉంటుంది.


దేవతాస్త్రీలు గర్భం ధరించరు. ఇక్కడ పార్వతీదేవి మానవ స్త్రీలా ఆలోచించింది. మమకారానికి లోనై ‘ఒక కుమారుడిని నవమాసాలు మోస్తే బాగుండు’ అనుకుంది. శివుడిని అడిగింది. ఆ విషయం దేవీ భాగవతంలో ఉంది.


శివపార్వతులు కైలాసంలో ఏకాంతంలో ఉండగా దేవేంద్రుడికి అసూయ కలిగింది. శివపార్వతులకు పుట్టే సంతానంతో తన పీఠానికి ముప్పు కలుగుతుందని అనుకున్నాడు. దేవతలను తీసుకు వెళ్లి శివపార్వతుల ఏకాంతానికి భంగం కలిగించాడు. ‘గజాసురుడి వల్ల ఇబ్బందులు పడుతున్నాం’ అని మొరపెట్టుకొని, రక్షించమని వేడుకున్నారు. దాంతో శివుడు వారి వెంట వెళ్ళి గజాసురుణ్ణి సంహరించాడు.


కానీ అమ్మవారి సంకల్పంలో మమకారం ఉంది. కథను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వినాయకుడి ఆవిర్భావం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని జీవుల్లోనూ ఎక్కువ మమకారం కలిగిన జీవి ఏనుగు. అమ్మవారికి సంకల్పం ఉంది. బొమ్మను చేసి ప్రాణం పోసింది. శివుడు వచ్చి ఆ బాలుడిని చూశాడు. మమకారం పోవాలంటే శిరస్సును ఖండించాలి. అందుకే బాలుడి శిరస్సును ఖండించాడు. అప్పటికే  గజాసురుణ్ణి సంహరించాడు. ఆ తలను బాలుడికి అతికించాడు. మమకారపూర్వకమైన ఆకారాన్ని పార్వతీదేవి సంకల్ప ప్రకారమే గణాధిపతి ధరించాడు. అదీ గణనాథుని ఆవిర్భావ కథ.


Updated Date - 2020-08-21T06:03:43+05:30 IST