బీసీల గొంతు నొక్కడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-02-22T09:22:42+05:30 IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన వార్తా కథనాలని వైసీపీ చేస్తున్న విష ప్రచారం అంటూ తెలుగుదేశం మండిపడింది. వైసీపీ ప్రభుత్వ విధానాలను

బీసీల గొంతు నొక్కడమే లక్ష్యం

అమరావతి, మంగళగిరి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన వార్తా కథనాలని వైసీపీ చేస్తున్న విష ప్రచారం అంటూ తెలుగుదేశం మండిపడింది. వైసీపీ ప్రభుత్వ విధానాలను, బీసీలను మోసం చేస్తున్న తీరును అచ్చెన్న ఎండగడుతున్నందునే కక్ష కట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బీసీలంటే జగన్‌కు చిన్నచూపు. బీసీ నాయకులు ఎదగడడాన్ని సహించలేడు. టీడీపీలో బీసీ నేతలకు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ బురద జల్లుతోంది. బీసీల గొంతు నొక్కాలన్నదే జగన్‌ లక్ష్యం’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ బీసీ నేతలను వైసీపీ టార్గెట్‌ చేయడం హేయమన్నారు. అచ్చెన్నాయుడు, గణేశ్‌లపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు చంద్రబాబు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీల గొంతు నొక్కేందుకే జగన్‌ కౌన్సిల్‌ రద్దుపై తీర్మానం పెట్టారన్నారు. 20 మంది బీసీలు, ఇద్దరిద్దరు ఎస్టీ, ఎస్సీలు, ముగ్గురు మైనార్టీలు కౌన్సిల్‌లో ఉండడం జగన్‌కు కడుపుమంట అని ఆరోపించారు. బీసీలపై ద్వేషంతోనే ఆదరణ పథకం రద్దు చేశారని, కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించి స్వాహా చేశారని మండిపడ్డారు. వాటిని ప్రశ్నించారనే టీడీపీ బీసీ నేతలు అచ్చెన్నాయుడు, గణేశ్‌లపై ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. జగన్‌ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ధ్వజమెత్తారు. ఆయన బురదను తమ బీసీ నేతలకు అంటించి అణిచివేయాలని చూస్తే వారు అంతకంతకు ఎదుగుతారని హెచ్చరించారు. అబద్ధాల జగన్‌ మీడియాలో అచ్చెన్నపై తప్పుడు కథనాలు రాయడం హాస్యాస్పదమని చంద్రబాబు విమర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీలను మాయచేసి, మోసం చేస్తున్న వైనాన్ని బీసీల ప్రతినిధిగా అచ్చెన్నాయుడు బట్టబయలుచేస్తూ ప్రశ్నిస్తున్నారు. అందుకే అచ్చెన్నాయుడుకు అవినీతి మరకలను అంటించి, అక్రమ కేసులను పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీసీ నేతల గొంతు నొక్కే కుట్ర ఇది’’ అని రవీంద్ర విమర్శించారు. అన్ని రాష్ర్టాలలో టెలీ హెల్త్‌ సర్వీసె్‌సను ఆమలు చేయాలంటూ 2016లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అప్పటికే తెలంగాణలో ఇది అమలువుతున్న నేపథ్యంలో ఆ నమూనానే తీసుకోవాలని అచ్చెన్న సూచించారన్నారు. దీనిని వక్రీకరించిన వైసీపీ అసత్యప్రచారానికి పాల్పడుతోందని రవీంద్ర విమర్శించారు.


జగన్‌, పెద్దిరెడ్డి తప్పు  ఒప్పుకుంటారా?: వర్ల 

ఇదే అంశంపై టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రకటన చేశారు. హైకోర్టు తప్పు పట్టినా, రూ.1400 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులేసి, గ్రామ సచివాలయాలపై బొమ్మలేయించుకున్న సీఎం జగన్‌, పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి తప్పు చేసినట్లు అంగీకరిస్తారా? అని వర్ల ప్రశ్నించారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేసే టీడీపీ బీసీ నేత అచ్చెన్నాయుడు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తారా? అని మండిపడ్డారు. విజిలెన్స్‌ రిపోర్టులో ఈసీజీ, టోల్‌ ఫ్రీ సర్వీసె్‌సకు రూ.7.96 కోట్లు మాత్రమే నామినేషన్‌ కింద కేటాయించినట్లు ఉందన్నారు. వాస్తవానికి భిన్నంగా జగన్‌ మీడియా ఈఎ్‌సఐలో అక్రమాలంటూ కథనాలు వండివార్చిందంటూ వర్ల విమర్శించారు. 

Updated Date - 2020-02-22T09:22:42+05:30 IST