దేశం కోసమే ఏబీవీపీ తపన

ABN , First Publish Date - 2020-07-09T06:09:44+05:30 IST

అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) 1949 జూలై 9న ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం జూలై 9ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకొంటుంది. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణం జరుగుతుందని...

దేశం కోసమే ఏబీవీపీ తపన

ఏబీవీపీ పెరుగుదల సహించలేని వామపక్ష, విచ్ఛిన్నకర సంస్థల దౌష్ట్యాలకు దేశవ్యాప్తంగా జాతీయవాదులైన విద్యార్థులు ఎందరో బలయ్యారు. దేశం కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలను కోల్పోయిన సంస్థ బహుశా చరిత్రలో ఏబీవీపీలా మరొకటి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) 1949 జూలై 9న ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం జూలై 9ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకొంటుంది. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి పునర్నిర్మాణం జరుగుతుందని, దానికి తరగతి గది నాలుగు గోడలమద్యే బీజం పడాలని కోరుకొనే అతి పెద్ద జాతీయవాద విద్యార్థి సంస్థ ఏబీవీపీ. విద్యారంగ సమస్యల మీద రాజీలేని పోరాటాలకు వేదికగా ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కాకుండా భారతీయ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని రగిలించే సంస్థగా విద్యార్థిపరిషత్ పనిచేస్తున్నది. ఏబీవీపీలో పనిచేయడం అంటే దేశం కోసం పరితపించునట్లుగా భావించడమే. ఏబీవీపీ పెరుగుదల సహించలేని వామపక్ష, విచ్చిన్నకర సంస్థల దౌష్ట్యాలకు కశ్మీర్ నుండి కన్యాకుమారి, అటక్ నుండి కటక్ వరకు వందలాదిమంది.. సామా జగన్మోహన్ రెడ్డి, రామన్న, మెరెడ్డి చంద్రారెడ్డి లాంటి జాతీయవాదులు బలయ్యారు. ప్రపంచంలో దేశం కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలను కోల్పోయిన సంస్థ బహుశా చరిత్రలో ఏబీవీపీలా మరొకటి లేదు. ఏబీవీపీ లాంటి జాతీయవాద సంస్థ లేకపోయి ఉంటే,  తుకడే, తుకడే గ్యాంగులతో ఈ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి పెను ప్రమాదం వాటిల్లేది. నేను విద్యార్థి దశలో జాతీయ భావాలకు ఆకర్షితుడయిన నేపథ్యంలో క్రమేణా నాలో లాఠీలను, తుపాకులను లెక్క చెయ్యని ఆత్మస్థైర్యాన్ని, పోరాడే తత్వాన్ని విద్యార్థి పరిషత్ నేర్పింది. దానికి ఒక ఉదాహరణగా ఒక ఉద్యమ నేపథ్యం పరిచయం చేయదలచుకొన్నాను.


వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలనీ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ చలో హైదరాబాద్ పిలుపు ఇచ్చింది. ఈ ర్యాలీ సమయంలో నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జిగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉన్నాను. కడప జిల్లా, చిత్తూరు జిల్లాలలో పర్యటించి విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించేందుకు నాకు బాధ్యత ఇచ్చారు. విద్యార్థులు ఏబీవీపీ పిలుపు మేరకు పెద్దఎత్తున తరలివచ్చారు. 2005 ఆగస్టు 31 తిరుపతిలో రైలు ఎక్కి బయలుదేరాము. మరుసటి ఉదయాన్నే కాచిగూడలో దిగి కాలకృత్యాలు తీర్చుకొనేందుకు ఏర్పాటు చేసిన చోట సూర్యస్నానం చేసి ర్యాలీకి ఉపక్రమిస్తున్న సమయంలో నాకు, కేశవ్ మెమోరియల్ స్కూల్ నుంచి ప్రత్యేక పిలుపు వచ్చింది.. నేను వెళ్ళేటప్పటికే రాష్ట్ర సహ సంఘటన మంత్రి గుంట లక్ష్మణ్, విభాగ్ సంఘటన కార్యదర్శి, నరేంద్ర, రాజారెడ్డి, బాలకృష్ణ, అరుణ్ కుమార్, విజయవాడ నుండి సురేంద్ర మోహన్ అక్కడ వున్నారు. అపుడే తెలిసింది ముఖ్యనాయకులకు ఏవో సూచనలు, పని విభజన సమావేశం అని. దానిలో రాయలసీమ నుండి నాకు 25మంది మెరికల్లాంటి కార్యకర్తలను ఇచ్చి దానికి నన్ను ‘‘జట్టు నాయకుడు’’గా నియమించారు.


లక్ష్మణ్ గారు, జీపులో మా ముఖ్యనాయకులను ఎక్కించుకొని సెక్రటేరియట్ వద్దకు పోతూ తెలుగుతల్లి వంతెన దగ్గర నేను రాయలసీమ కార్యకర్తలతో వేచి ఉండాల్సిన జాగా చూపించారు. మేము ఏమిచెయ్యాలి అని లక్ష్మణ్ గారిని అడిగాను, హైదరాబాద్ ఓయూ కార్యకర్తలు మొదటగా సెక్రటేరియట్ గేట్ వద్ద ధర్నా చేస్తారు, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే తెలుగుతల్లి వంతెన నుండి వెంటనే ఉద్యమంలోకి రావాలి. నిన్ను అదుపులోకి తీసుకున్న వెంటనే ఎన్.టి.ఆర్‌ సమాధి పక్కన ఉన్న ఇతరులు ఉద్యమిస్తారని చెప్పారు. మధ్యలో నేను కలుగజేసుకొని సెక్రటేరియట్ గేట్ లోపలికి నేను పోతాను అన్నాను. అది కష్టమని ఆయన అన్నారు. మనం ఎక్కువ సేపు ధర్నా చేయగలిగితే చాలు, అదే సంచలనం, దానివల్ల ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు. ఉదయం 11 గంటలు అయ్యింది. మొదటి సారిగా ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, హైదరాబాద్ కార్యకర్తలు సెక్రటేరియట్ గేట్ వద్దకు చేరుకోలేకపోయారు. అంతే, మా రాయలసీమ వంతు వచ్చింది నేరుగా వెళ్లి ధర్నా కాకుండా పొట్టేలు కొండను ఢీ కొట్టినట్లు, లంఘించి గేట్ల వద్దకు చేరుకున్నాము. వెంటనే తేరుకున్న పోలీసులు గేట్లకు అడ్డంగా నిలబడగా మా వేగానికి గేట్లు వేరు అయ్యాయి, అక్కడే వున్న ఎస్సై తుపాకీ గురిపెట్టారు కలిస్తే కాల్చుకో అన్నట్లు అప్పటివరకు వ్యూహాత్మకంగా మా జేబుల్లో వున్న ఏబీవీపీ జెండాలు బయటికి తీసి నేరుగా దౌడు తీసాము.


ఈ సందర్భంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఏబీవీపీ స్థానంలో మావోయిస్టులు వచ్చినట్లయితే పరిస్థితి ఉహించుకోలేమని చర్చ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తవయ్యాయి. ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యల కొరకు కమిటి వేస్తూ సుమారు 10 కోట్ల రూపాయలు నిధులు కూడా సెక్రటేరియట్ రక్షణ కొరకు వెంటనే విడుదల చేసారు. ఆ కమిటీ తరువాత సోలార్ ఫెన్సింగ్ వెయ్యాలని, విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి డ్యూటీ మార్పు చేర్పుల సమయంలో ఎలా వ్యవహరించాలన్న శిక్షణ, ముఖద్వారం భద్రత, సందర్శకులకు అనుమతి పత్రాలు, ప్రత్యేక వేళలు లాంటివి అమలులోనికి వచ్చాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ నాయకులు ఆర్. కృష్ణయ్య లాంటి వారు, రాజకీయ నాయకుల భద్రత కొరకు వెనువెంటనే 10కోట్లు మంజూరు చేసిన చేతులు విద్యార్థులు ఉపకార వేతనాలు ఎందుకు విడుదల చెయ్యలేదు అని ప్రభుత్వం మీద విమర్శలు దాడి పెంచారు. ఒత్తిడి తట్టుకోలేక కొద్దిరోజులకు నిధులు విడుదల చేశారు.

నాగోతు రమేష్ నాయుడు

బి జె వై ఎం రాష్ట్ర అధ్యక్షుడు 

(నేడు ఏబీవీపీ సంస్థాపన దినోత్సవం)

Updated Date - 2020-07-09T06:09:44+05:30 IST