ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ చెక్ పెడుతున్నారా?

ABN , First Publish Date - 2021-12-26T16:59:36+05:30 IST

విశాఖలోనే కాకుండా ఏపీలో ఎక్కడ ఏం జరిగినా స్పందించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన మాటల్లో ఘాటు, పదును కూడా కనిపించకపోవడం దేనికి సంకేతం?

ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం జగన్ చెక్ పెడుతున్నారా?

విశాఖలోనే కాకుండా ఏపీలో ఎక్కడ ఏం జరిగినా స్పందించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన మాటల్లో ఘాటు, పదును కూడా కనిపించకపోవడం దేనికి సంకేతం? విజయసాయిరెడ్డికి కత్తెర వేశారా? లేక ఆయనే.. మనకెందుకులే అని మౌనముద్ర దాల్చారా? అసలు విశాఖ వైసీపీలో ఏం జరుగుతోంది? ఏబీఎన్-ఇన్‌సైడ్ స్టోరీలో తెలుసుకుందాం...


ఏపీలో అధికార వైసీపీలో జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత స్థానం ఎవరిదంటే.. విజయసాయిరెడ్డిదే అంటారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్‌ అయితే, ఉత్తరాంధ్రకు  మాత్రం విజయసాయిరెడ్డే సీఎం అని కూడా అంటారు. ఆయనకు తెలియకుండా ఉత్తరాంధ్రలో చీమ కూడా కుట్టదని విపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తుంటాయి. ఉత్తరాంధ్రలో పార్టీ సీనియర్‌ నేతలు తప్ప.. చాలా మంది ఎంపీ విజయసాయిరెడ్డి వెంటే తిరుగుతారు. అధికారులు కూడా ఆయన చెప్పింది చేయాల్సిందే! ఇలా ఉత్తరాంధ్ర వైసీపీలో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ఉన్నట్లుండి సైలెంట్‌ అయ్యారు. ఆయన విమర్శల్లో వేడి తగ్గించారా? లేక ఆయనకు జగన్‌ కత్తెర వేశారా? అదీ కాకుండా.. తనకు ఎందుకొచ్చిన గోల అని సాయిరెడ్డి సైలెంట్‌ అయ్యారా? అని సాగరతీర నగరంలో జోరుగా చర్చ జరుగుతోంది. 


ఇటీవల విశాఖలో భూ అక్రమాలు, అరాచకాలు అధికమయ్యాయి. కొందరు భూబకాసురులు అమాయకుల నుంచి భూములను బెదిరించి లాక్కుంటున్నారు. భూమాఫియా ఆగడాలు శ్రుతి మీరాయి. వీటన్నింటిని విజయసాయిరెడ్డే చేయిస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. మరోవైపు సాయిరెడ్డి విశాఖలో ఉన్నప్పటికీ.. తనను కలుసుకోవడానికి వచ్చే సామాన్య కార్యకర్తలు, నాయకులకు ఆయన అవకాశం ఇవ్వడం లేదనీ, తమ సమస్యలు పట్టించుకోవడం లేదనీ వారు జగన్‌కు ఫిర్యాదు చేశారట. దీనికితోడు విశాఖ వైసీపీలోనే సాయిరెడ్డి ఆధిపత్యం గిట్టని వర్గం వారు.. ఇక్కడ సాయిరెడ్డికి వ్యతిరేకంగా ఏం జరిగినా వెంటనే బయటకు పొక్కేలా చేస్తున్నారట. ఆయన లోగుట్లు బయట పెటేస్తున్నారట. ముందే రాష్ట్రంలో వైసీపీ సర్కారుపై వ్యతిరేకత అధికమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో "మన పని మనం చేసుకుంటే పోలా.." అని విజయసాయిరెడ్డి కూడా పార్టీని చక్కదిద్దుకునే పనుల్లో నిమగ్నమయ్యారని భోగట్టా. 


గతంలో విజయసాయిరెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడైనా మీడియాతో మాట్లాడినా.. ప్రతిపక్ష నేతపై ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన రాజకీయ విమర్శలను తగ్గించుకున్నారు. తన ట్విట్టర్‌లోనూ కేవలం ప్రభుత్వం అభివృద్ధి పథకాలు, పార్లమెంటులో లేవనెత్తిన సమస్యలపై మాత్రమే ఎక్కువగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో విశాఖ నుంచే పార్లమెంటుకి విజయసాయిరెడ్డి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలతో.. తనకు వ్యక్తిగత డ్యామేజ్‌ జరుగుతోందని సాయిరెడ్డి గ్రహించారట. అందుకే ఆయన వెనక్కి తగ్గారని తెలుస్తోంది.


మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌.. ఎంపీ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుండి తప్పించి.. వేరొకరిని ఇక్కడకు తీసుకువస్తారని పార్టీలో మరో ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్‌.. సాయిరెడ్డినే నేరుగా తన వద్దకు పిలిపించుకున్నారనీ, ఉత్తరాంధ్రలో ఉన్న నేతలు సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వస్తున్నారనీ, అలాగే మీ మీద ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయనీ చెప్పారట. మీ పేరును చాలా వాడుకుంటున్నారనీ, వీటన్నింటి మీద దృష్టి పెట్టాలని విజయసాయిరెడ్డికి సీఎం సూచించారనీ విశాఖ వైసీపీలో నేతలు అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. అందుకే ఆయన బయట పనులు వదిలేసి.. పార్టీని చక్కబెట్టే పనిలో ఉన్నారని గుసగుసలాడుకుంటున్నారు.


ఇక విజయసాయిరెడ్డిపై వరుసగా వస్తున్న ఆరోపణలకు.. ఆయన వెంట కీలకంగా ఉన్న వ్యక్తులే కారకులని విశాఖ వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన.. అలాంటి వారందరినీ పక్కన పెట్టారనీ, ఎవరైనా తన పేరుతో ఏదైనా చేసినా, చెప్పినా నమ్మవద్దని చెప్పుకునే పరిస్థితి విజయసాయిరెడ్డికి వచ్చిందట. వీటన్నింటి నుంచి బయటపడాలంటే.. ప్రస్తుతానికి తన పని తాను చూసుకుంటే పోలే.. అని విజయసాయిరెడ్డి భావించారట. అందుకే ఘాటు వ్యాఖ్యలు, రాజకీయ విమర్శలు తగ్గించుకున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో సాయిరెడ్డి వ్యక్తిగత కార్యక్రమాలు, ఢిల్లీ పర్యటన వంటి కారణాలతో విశాఖపై శ్రద్ధ తగ్గించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-12-26T16:59:36+05:30 IST