ఏబీఎన్ ఎఫెక్ట్.. ఏపీ ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-04-17T18:56:37+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారని...

ఏబీఎన్ ఎఫెక్ట్.. ఏపీ ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు

అమరావతి : తిరుపతి ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారని, ఓ మంత్రి ఏకంగా.. వాహనాల్లో ఇతర జిల్లాల నుంచి జనాలను తరలిస్తున్నట్లు ఇవాళ ఉదయం నుంచి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో వార్తలు ప్రసారం చేసిన విషయం విదితమే. ఈ వార్తలపై ఉదయం నుంచి స్పందించని ఎన్నికల కమిషన్.. ఏబీఎన్ వరుస కథనాలతో ఎట్టకేలకు మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయనంద్ స్పందించి ఓ ప్రకటనను విడుదల చేశారు.


కీలక ఆదేశాలు..

తిరుపతి ఉప ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోనివ్వద్దని.. పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల అధికారులకు విజయానంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నడుమ ఉప ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను విజయానంద్ ఆదేశించారు.


దొంగ ఓట్లు అనేవి అపోహ..

తిరుపతి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు వచ్చారనే ఆరోపణలపై ఎన్నికల అధికారి చక్రధర్ బాబు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. దొంగ ఓట్లు అనేవి అపోహ. గుర్తింపుకార్డు, ఓటర్ స్లిప్ ఉన్నవారికే ఓటు వేసే హక్కు ఉంటుంది. 48 గంటల ముందు నుంచి పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు పహారా నిర్వహిస్తున్నారు. అలా బయట వ్యక్తులు వచ్చే అవకాశం లేదు. వాలంటీర్ల మీద ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవం. చిత్తూరు జిల్లాలో పది మందిని తొలగించాం అని చక్రధర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో బయట వ్యక్తులు ఎవరూ లేరని.. ఇక్కడ ఓటు హక్కు ఉన్న వారిని నిశితంగా పరిశీలించి మరీ పోలింగ్ కేంద్రంలోకి సిబ్బంది పంపుతున్నారని తెలిపారు.


ఓటమి భయంతోనే..

దొంగ ఓట్ల ఆరోపణలు, వాహనాల్లో దొంగ ఓటర్లను తరలిస్తున్నారనే ప్రతిపక్షాల సంచలన ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో ప్లాన్‌ ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం.. చాలా ప్రైవేటు బస్సులు వస్తుంటాయి. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అడ్డుకుంటున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోంది. ప్రజల్లో బలంలేక టీడీపీ నాటకాలు ఆడుతోంది. చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారుఅని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-04-17T18:56:37+05:30 IST