Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనాపై పోరులో భారత్‌కు ఏఏపీఐ వైద్యుల చేయూత

అట్లాంటా: కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు యావత్ ప్రపంచం ముందుకు వస్తోంది. కరోనాపై పోరులో భారత్‌కు 40కి పైగా దేశాలు అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే భారత్‌కు భారీ సాయం అందిస్తోంది. అటు అమెరికాలోని భారతీయులు సైతం కరోనాపై పోరాడుతున్న మాతృదేశానికి తమకు తోచిన సాయం చేస్తున్నారు. దీనిలో భాగంగా అక్కడి ఏఏపీఐ(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) భారతీయ అమెరికన్ వైద్యుల ఆర్గనైజేషన్.. కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు సహాయం చేసే విషయమై పలు కార్యక్రమాలతో ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏఏపీఐ ప్రతినిధులు తాజాగా అట్లాంటాలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు సుధాకర్ జోన్నలగడ్డ, ఉపాధ్యక్షుడు డా. రవి కొల్లి, ట్రెజరర్ డా. మాల్తీ మెహతా, రిజినల్ డైరెక్టర్(సౌత్) డా. శ్రీని గంగాసానితో పాటు మాజీ బోర్డు ట్రస్టీలు, జీఏపీఐ అధ్యక్షురాలు చందన ప్రభుదేవ్ కూడా హాజరయ్యారు. 


ఈ సందర్భంగా కరోనా కారణంగా భారత్‌లో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల పరిష్కారం దిశగా ఏఏపీఐ, జీఏపీఐ సభ్యులు తమవంతు సాయంగా చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. ఏఏపీఐ సభ్యులు భారత ప్రభుత్వాధికారులతో సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దాంతో మెడికల్ పరంగా ప్రస్తుతం దేశానికి కావాల్సిన అవసరాల గురించి తెలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దీనికోసం యూఎస్ అధికారులు సహాయం కూడా తీసుకోనున్నట్లు వారు పేర్కొన్నారు. కరోనా రోగులకు ఆన్‌లైన్(టెలికమ్యూనికేషన్) ద్వారా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇది కూడా తమ ప్రణాళికలో భాగమేనని ఏఏపీఐ పేర్కొంది. ఇప్పటికే 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపించగా, వాటిని 'సేవా ఇంటర్నెషనల్' ద్వారా అవసరమైన వారికి పంచిపెట్టాలని కోరినట్లు ఏఏపీఐ తెలిపింది. అంతేగాక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్‌కు సాయం చేసేందుకు వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఏకంగా రెండు మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించినట్లు ఏఏపీఐ అధ్యక్షుడు డా. జోన్నలగడ్డ వెల్లడించారు. aapiusa.org ద్వారా విరాళాలు ఇవ్వొచ్చని తెలిజేశారు.  

ఈ సందర్భంగా కరోనాతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు మెడిసిన్స్ తయారీకి వాడే ముడిపదార్థాలు, ఔషధాలు, పీపీఈ కీట్లు, ఇతర అత్యవసర వైద్య సామాగ్రిని పంపించి ఆదుకోవాలని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌‌కు ఆయన అభ్యర్థించారు. అలాగే వచ్చే వారం వాషింగ్టన్ డీసీలో ఏఏపీఐ సభ్యులు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను కలిసి, భారత్‌కు సాయం చేయాలని కోరనున్నట్లు జోన్నలగడ్డ తెలిపారు. ప్రస్తుతం తాము ప్రధానంగా ఆక్సిజన్ జనరేటర్లు, BiPAP, CPAP, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు సాధ్యమైనంత అధిక మొత్తంలో భారత్‌కు తరలించే విషయంపై దృష్టిసారించినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే భారత ఆరోగ్యశాఖ మంత్రితో వర్చువల్ మీటింగ్ ద్వారా ప్రస్తుతం దేశానికి కావాల్సిన అత్యవసర వైద్య సామాగ్రి గురించి కూడా తెలుసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే కొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఉత్తమమని జోన్నలగడ్డ అభిప్రాయపడ్డారు. 


ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇక తాము భారత్‌కు పంపించే ప్రతి సామాగ్రిని 'సేవా ఇంటర్నెషనల్' ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా అవసరం ఉన్న వారికి సాయాన్ని చేరవేయడంలో సేవా ఇంటర్నెషనల్ ముందు ఉంటుందని డా. కొల్లి చెప్పారు. సంక్షోభంలో ఉన్న మాతృదేశ ప్రజలకు సాయం చేసేందుకు వందలాది మంది భారతీయ అమెరికన్ వైద్యులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి భారత ప్రభుత్వం నుంచి తమకు అనుమతి లభిస్తే తప్పకుండా తమ నుంచి భారీ సాయం అందుతుందని స్పష్టం చేశారు. అలాగే ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌కు పంపించే విషయమై కూడా అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థించనున్నట్లు డా. కొల్లి తెలిపారు. 


కాగా, టెలికమ్యూనికేషన్ ద్వారా భారత్‌లోని కరోనా రోగులకు సేవలు అందించేందుకు http://Mdtok.com/dr/Covid మరియు www.eGlobalDoctors.com ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసినట్లు డా. గంగాసాని చెప్పారు. వీటి ద్వారా అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని భారతీయ వైద్యుల సేవలను కూడా పొందవచ్చని తెలియజేశారు. మే 3వ తేదీ నుంచే ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు(భారత కాలమానం ప్రకారం) కరోనా రోగులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఏఏపీఐ స్పష్టం చేసింది.        


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement