నిర్మాణాత్మక వైఖరే విజయ రహస్యం

ABN , First Publish Date - 2021-06-15T09:57:37+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకర్షణ, ఆయన పట్ల గౌరవ భావం, ప్రపంచ దేశాలపై ఆయన చూపే ప్రభావం ఏ మాత్రం చెక్కుచెదరలేదని ఇటీవల...

నిర్మాణాత్మక వైఖరే విజయ రహస్యం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకర్షణ, ఆయన పట్ల గౌరవ భావం, ప్రపంచ దేశాలపై ఆయన చూపే ప్రభావం ఏ మాత్రం చెక్కుచెదరలేదని ఇటీవల మూడురోజులపాటు జరిగిన జీ-7 దేశాల సమావేశంలో స్పష్టమైంది. ప్రపంచంలోని అతి సంపన్న దేశాలతో కూడిన ఈ సమావేశం కొవిడ్ మూలంగా వర్చువల్‌గా జరిగినప్పటికీ మన ప్రధాన మంత్రికి మూడు సార్లు మాట్లాడే అవకాశం లభించింది. మూడు సార్లూ నరేంద్ర మోదీ అత్యద్భుత ప్రసంగాలు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి మహమ్మారి సంభవించకుండా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా పనిచేయాలని, అన్ని దేశాలు ఏకత్రాటిపై నిలిచి సంఘీభావంతో నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలని ఆయన పిలుపు నిచ్చిన తీరు ఈ సమావేశంలో అగ్రనేతలను విశేషంగా ఆకట్టుకుంది. ఇంతటి అద్భుత సమావేశానికి నరేంద్ర మోదీ స్వయంగా హాజరైతే తాను వ్యక్తిగతంగా ఆయనను ఆహ్వానించే వాడినని, వర్చువల్ గా సమావేశం జరగడంతో తాను ఆ అవకాశాన్ని కోల్పోయానని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆవేదన వ్యక్తపరిచారు. నిజానికి ఈ సమావేశానికి రావలిసిందిగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా అధినేతలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. 2019లో ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా మోదీని ఫ్రాన్స్ లోని బైడ్స్ లో జరిపిన సమావేశానికి ఆహ్వానించారు. 2020లో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికాలో జరగాల్సిన జీ-7 సమావేశానికి మోదీ హాజరయ్యేవారే కాని కరోనా మహమ్మారి మూలంగా సమావేశం రద్దయింది. తాజా సమావేశంలో మంత్రిత్వ స్థాయి, వర్కింగ్ గ్రూప్ స్థాయి చర్చల్లో కూడా భారత్ కీలక పాత్ర పోషించింది.


ఇంతకీ నరేంద్ర మోదీ ప్రసంగాలు ఎందుకు ప్రపంచ నేతలను ఆకట్టుకున్నాయి? ఈ ధరిత్రి పై సకల దేశాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ అవి ఒకే నేలనూ, సముద్రాల్ని పంచుకుంటున్నాయి. అయితే అన్ని దేశాల్లో ఆరోగ్య, వైద్య వసతులు మాత్రం సమానంగా లేవు. సంపన్న దేశాల్లో అత్యంతాధునిక ఆరోగ్య, వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఉంటే పేద దేశాల్లో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేకుండా జనం అనేక రోగాలకు, జబ్బులకు గురై మరణిస్తున్నారు. కరోనా మహమ్మారి ధనిక, పేద దేశాల మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా బయటపెట్టింది. కొన్ని అగ్రదేశాలు మహమ్మారి నుంచి బయటపడితే మరికొన్ని దేశాలు ఇంకా కరోనా వాతపడి కుదేలైపోతున్నాయి. అనేక దేశాల్లో మందులు, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు సరిగా లేవు. ఎందుకింత వ్యత్యాసం? కనీసం ఆరోగ్య వైద్య సౌకర్యాల విషయంలోనైనా ప్రపంచంలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా మనం చూసుకోలేమా? మోదీ మనసులో ఈ అద్భుతమైన ఆలోచన మెరిసినందువల్లే ఆయన గత శనివారం జీ-7 దేశాల సమావేశంలో బలమైన ఆరోగ్య వ్యవస్థ నిర్మాణంపై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ‘ఒకే భూగోళం- ఒకే ఆరోగ్యం’ ఉండాలనే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో మొత్తం సమాజమంతా ఒకటే అన్న వైఖరిని అవలంభించినందువల్లే మోదీ ప్రభుత్వాలను, పరిశ్రమలను, పౌర సమాజాన్నీ కలిసికట్టుగా నడిపించే ప్రయత్నం చేశారు. అందువల్ల మనం కరోనా మొదటి ప్రభంజనం కంటే రెండో ప్రభంజనాన్ని అతివేగంగా అరికట్టగలిగాం. జీ-7కు చెందిన దేశాలతో పాటు అనేక ఇతర దేశాలు భారత్‌కు మద్దతు కూడా నిచ్చాయి. అందుకు మోదీ కృతజ్ఞతలు చెబుతూనే అంతర్జాతీయ ఆరోగ్య పరిపాలనా విధానాన్ని మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో కూడా భారత్ తన అనుభవాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. కొవిడ్ సంబంధిత టెక్నాలజీ విషయంలో మేధా సంపత్తి హక్కులు, ఆంక్షలు ఎత్తి వేయాలని మోదీ చేసిన విజ్ఞప్తికి అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మద్దతునిచ్చారు. మోదీ ఇచ్చిన ఈ పిలుపు నేపథ్యంలో వ్యాక్సిన్ టెక్నాలజీపై మేధా సంపత్తి హక్కులను ఎత్తివేసే విషయంలో అమెరికా తన మద్దతును ప్రకటించడం కీలక పరిణామం. ప్రపంచ వర్తక సంస్థ, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా ఈ అంశం అతి ముఖ్యమైనదని గుర్తించాయి.


ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం జీ-7 దేశాలకు సహజ మిత్రపక్షం. నియంతృత్వం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మొదలైన అంశాలపై మనందరి అభిప్రాయాలు ఒక్కటే అని నరేంద్ర మోదీ ఈ సమావేశంలో ప్రకటించారు. మనం బహిరంగమైన, పారదర్శకమైన సమాజాలు ఉండాలనుకున్నప్పుడు సురక్షితమైన సైబర్ వాతావరణం కూడా ఉండాలని ఆయన ఈ సమావేశంలో టెక్ కంపెనీలను ఉద్దేశించి విస్పష్టంగా చెప్పడం గమనార్హం. అసలు ప్రపంచంలో ఏదైనా తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పుడు భారత దేశం లేకుండా ఆ సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యమా? అని మోదీ వేసిన ప్రశ్న సాహసోపేతమైన ఆయన నాయకత్వ శైలిని ప్రతిఫలించింది. 


అంతర్జాతీయ వేదికలపై భారత్ స్థాయిని ఎలా పెంచాలన్న విషయంలో మోదీ ఎవరినుంచీ పాఠాలు నేర్చుకోనక్కర్లేదు. ఆయన ఏ వేదికపై అడుగుపెట్టినా భారత్ వినూత్నమైన ఆలోచనలతో తనదైన విశిష్టతను ప్రదర్శించింది. ఇటీవలి జీ-7 సమావేశాలు అందుకు భిన్నంగా లేవు. నిజానికి కరోనా మహమ్మారి రెండో ప్రభంజనం అతలాకుతలం చేస్తున్న సమయంలో మోదీ అంతర్జాతీయ నేతలతో తన సంబంధాలను ఉపయోగించుకుని భారత్ ను గట్టెక్కించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. విదేశాంగమంత్రి జయశంకర్ అమెరికాతో పాటు పలు దేశాల్లో పర్యటించడమే కాదు, జీ-7 దేశాల మంత్రుల సమావేశాల్లో కీలక చర్చల్లో పాల్గొన్నారు. వీటి ఫలితాలను తక్కువ అంచనా వేయలేము.


ప్రధానమంత్రిపై విమర్శలు చేయడం మినహా వేరే పనిలేనట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. మరి మోదీయేమో బాధల్లో ఉన్న ప్రజలతో సాధ్యమైనంత మేరకు స్వయంగా సంభాషించాలని తపన పడుతుంటారు. అయినా ఆయనకు ప్రతి ఒక్కరికీ వాక్సినేషన్ అందాలని, ఆసుపత్రుల్లో తగిన వైద్య సౌకర్యాలు ఉండాలన్న ఆకాంక్ష లేదని, అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదని ఎవరైనా విమర్శిస్తే అంతకంటే దారుణం ఏముంటుంది? కరోనా మహమ్మారి విలయతాండవం చేసినప్పుడు మోదీ నిద్రలేని రాత్రుళ్లు ఎన్ని గడిపారో ప్రధానమంత్రి కార్యాలయంలో ఎవర్ని అడిగినా తెలుస్తుంది.


సరే, మోదీ – యోగీల మధ్య విభేదాలున్నాయని, భారతీయ జనతా పార్టీలో అంతఃకలహాలున్నాయని ప్రచారం చేసే వారికి అసలు ఆ పార్టీ ఎలా నడుస్తుందో తెలియదనే అనుకోవాలి. దాదాపు గంటన్నర సేపు మోదీ -యోగీ ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించడంపైనే ఎక్కువ సమయం గడిపారు. ఇలాంటి నిర్మాణాత్మకమైన వైఖరి అవలంబిస్తున్నందువల్లే ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షాలు, కుహనా మేధావులు ఆశ్చర్యపడే విధంగా మోదీ-యోగీల సారథ్యంలో బిజెపి ఘన విజయం సాధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2021-06-15T09:57:37+05:30 IST