అవతరించాల్సింది సామాజిక శక్తే!

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవరించినప్పుడు వారిని కాపాడుతున్నది ఈ శ్లోకమే! భగవంతుడు ధర్మాన్ని రక్షించడం కోసం పుడుతూనే ఉంటాడు. భగవద్గీత నాలుగో అధ్యాయం ఏడో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు...

అవతరించాల్సింది సామాజిక శక్తే!

జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవరించినప్పుడు వారిని కాపాడుతున్నది ఈ శ్లోకమే! భగవంతుడు ధర్మాన్ని రక్షించడం కోసం పుడుతూనే ఉంటాడు. భగవద్గీత నాలుగో అధ్యాయం ఏడో శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఈ శ్లోకం అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని చూద్దాం! 


  • యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
  • అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌!

‘‘ధర్మానికి నష్టం జరుగుతున్నప్పుడు, అధర్మానికి లాభం జరుగుతున్నప్పుడు, ధర్మం దెబ్బతింటున్నప్పుడు, అధర్మం అభ్యుదయం చెందుతున్నప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను’’ అని ఈ శ్లోకం అర్థం. లోకంలో ఇప్పుడు అనేక ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. పత్రికల్లో వచ్చే వార్తలు చదువుతున్నాం. మరి ఈ సమయంలో వెంటనే భగవంతుడు దిగి రావద్దా? అంటే... రాడు. మరి ఎప్పుడు వస్తాడు? ‘‘తదాత్మానం సృజామ్యహమ్‌’’... ‘నన్ను నేను సృష్టించుకుంటాను’! సమిష్టి భావనే భగవంతుడు. అంటే సమాజం తనను తాను వ్యక్తిగా సృష్టించుకుంటుంది. ఆ వ్యక్తి భగవంతుని అవతారం! అలాంటి అవతారాలు ఇప్పటి వరకు తొమ్మిది జరిగాయి. పదో అవతారం వస్తుందని మన ఆశ. ఆ పదోది మనం ఎందుకు కాకూడదు? రాముడు తనకు తానుగా కయ్యానికి కాలు దువ్వలేదు. లోకంలో మహత్తర శక్తులు, సజ్జన శక్తులు కొన్ని ఓపిక పడతాయి. చివరకు ధర్మానికి నష్టం చేస్తున్న వాడి పని పడతాయి. ఆ సామాజిక శక్తే అవతారం. ఇప్పుడు అవతరించవలసింది ఎవరు? మనమే! మన సమాజమే! మన సమాజంలో ఉండే మేధావులే! ధర్మపరాయణులే! వీళ్లు ఒక సామూహిక శక్తిగా ఏర్పడి రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ ఎదిరిస్తే తప్ప అన్యాయాలు పోవు.



దాన్నే నమ్ముకోవాలి!

కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యం ద్వారా తెలుసుకుందాం!


  • శిథిలత లేని భక్తి నతి సేయుదు వేల్పుల కాసుపర్వులున్‌
  • విధివశ్వర్తు, లావిధియు విశ్రుత కర్మఫల ప్రదాత, య
  • య్యధిక ఫలంబు కర్మవశ మట్లగుటం బనియేమి వారిచే 
  • విధి కధికంబు కకర్మమని వేమఱు మ్రొక్కి భజించు కర్మమున్‌

‘కర్మ’ అంటే పని. కర్మ గొప్పది అంటే నువ్వు చేసే పని గొప్పది. మనం ఎంత పనిచేసినా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకోకూడదు. ‘కర్మ’ అంటే ఏమిటో ఆలోచించాలి. ‘కర్మ’ అంటే పని అనుకున్నప్పుడు మన కర్మ అంటే మనం చేసిన పనే కదా! పూర్వ జన్మలో చేసిన పని కావచ్చు లేదా ఈ జన్మదైనా కావచ్చు. మన కర్మయే ప్రధానం. ‘‘దేవతలందరికీ భక్తితో నమస్కారం చేస్తున్నా! కానీ ఆ దేవతలు కూడా విధికి వశవర్తులే కదా! దేవతలను కూడా విధి ఏడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారంతా బ్రహ్మదేవుడి దగ్గరకు పరుగెడుతుంటారు. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చే కర్మఫలం అంతా మనం చేసిన పనిని బట్టే ఉంటుంది! అలాంటప్పుడు దేవతలకు భక్తితో నమస్కారం చేయాల్సిన అవసరం ఏమిటి? అందుకే నేను దేవతల కంటే ఆ కర్మను నమ్ముకుంటున్నా! నా పనిని నమ్ముకుంటున్నా!’’ అని దానర్థం.


- గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST