మళ్లీ పెరిగిన బాలకార్మిక సంక్షోభం

ABN , First Publish Date - 2022-07-29T06:04:09+05:30 IST

కొవిడ్‌ దేశంలో బాలకార్మిక సమస్యను పెంచింది. బాలకార్మిక నిరోధ చట్టాలు, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం వంటి చర్యల కారణంగా కొవిడ్‌కు ముందు...

మళ్లీ పెరిగిన బాలకార్మిక సంక్షోభం

కొవిడ్‌ దేశంలో బాలకార్మిక సమస్యను పెంచింది. బాలకార్మిక నిరోధ చట్టాలు, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య, మధ్యాహ్న భోజన పథకం వంటి చర్యల కారణంగా కొవిడ్‌కు ముందు కాస్త తగ్గుముఖం పట్టిన బాలకార్మిక సమస్య మళ్లీ విజృంభించింది. తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడం, మళ్లీ వలసలు పెరగడం, సమీప పాఠశాలలు మూతబడటంతో ఈ సమస్య జటిలమైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో పదికోట్ల మంది వలస కార్మికులుండగా, ఇందులో 25శాతం మంది బాలబాలికలే. యూనిసెఫ్‌ అంచనా ప్రకారం దేశంలో లక్షన్నర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతబడ్డాయి. ఫలితంగా బాలకార్మిక సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని గుర్తించలేదని, తక్షణం చొరవ తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే వీరంతా భవిష్యత్తులో అనుత్పాదక, అవాంఛనీయ శక్తులుగా, సమాజానికి బెడదగా పరిణమిస్తారని బాలకార్మిక నిరోధ ఉద్యమకారిణి డా. శాంతాసిన్హా అభిప్రాయపడుతున్నారు.


డా. శాంతాసిన్హా వ్యవస్థాపకురాలిగా ఉన్న ఎం.వి. ఫౌండేషన్‌ హైదరాబాద్‌లోని 180 బస్తీలు(మురికివాడల్లో) ప్రస్తుతం బాలకార్మికులను గుర్తించి వారిని బయటకు తీసుకువచ్చేందుకు కృషిచేస్తోంది. ఈ బస్తీలలో మూడు వేల మంది వరకు బాలకార్మికులుగా వేర్వేరు పనుల్లో మగ్గుతున్నట్టు గుర్తించారు. చిత్తుకాగితాలు, ప్లాస్టిక్‌ వస్తువులు ఏరడం, డంపింగ్‌ యార్డుల్లో వీటిని వేరుచేసే రోజువారీ పనుల్లో ఉన్నారు. ఇంకా హోటల్స్‌లో క్లీనర్స్‌గా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సున్న బాల కార్మికులే కావడం గమనార్హం. తల్లిదండ్రులు, పనికి పెట్టుకున్న యజమానులు, ప్రభుత్వ అధికారులతో ఎం.వి. ఫౌండేషన్‌ కార్యకర్తలు, నిత్యం సంప్రదింపులు జరుపుతూ వీరికి విముక్తి కలిగించి సమీప పాఠశాలల్లో చేర్పించేందుకు కృషిచేస్తున్నారు. అయితే భారీస్థాయిలో పాఠశాలలు మూతపడటం, తెరచి ఉన్నా మౌలిక సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమించిందని డా. శాంతాసిన్హా అన్నారు. 


బాలకార్మిక సమస్యపై నాలుగు దశాబ్దాలుగా డా. శాంతాసిన్హా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పాఠాలు చెబుతూ ప్రత్యక్ష అనుభవం కోసం తెలంగాణ ప్రాంత మారుమూల గ్రామాలకు వెళ్లి, దళితుల ఇళ్లల్లో ఉండి అనేక సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాలకు వెళ్లాల్సిన బడిఈడు పిల్లలు పనిలో, గనిలో, కార్ఖానాలో ఉండటం చూసి వికల మనస్కులయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎం.వి. ఫౌండేషన్‌ 1200 గ్రామాల్లో పన్నెండేళ్ల పాటు చేసిన నిరంతర కృషి కారణంగా బాలకార్మిక సమస్య తొలగిపోయింది. ఇప్పుడా గ్రామాల్లో పిల్లలంతా చక్కగా చదువుకుంటున్నారు. బాలకార్మిక సమస్య ఇప్పుడు ఆ గ్రామాలలో చరిత్రే. తల్లిదండ్రులు, వెట్టి చేయించే యజమానుల దృక్పథంలో మార్పు తీసుకురావడం వల్లనే మళ్లీ ఆ సమస్య ఉత్పన్నం కాలేదని శాంతాసిన్హా చెప్పారు. ఆమె చేసిన కృషికి 1998లో పద్మశ్రీ, 2003లో రామన్‌ మెగసెసే పురస్కారాలు లభించాయి. ప్రస్తుతం ఎం.వి. ఫౌండేషన్‌ బీహారులోని జుమల్‌, రోతాక్‌, సహర్సా, తూర్పు చంపారన్‌, వైశాలి జిల్లాల్లోని బాలకార్మికులకు విముక్తి కలిగించేందుకు పనిచేస్తోంది. అక్కడి పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని శాంతాసిన్హా వ్యాఖ్యానించారు. బాలకార్మిక సమస్య నిర్మూలనలో డా. శాంతాసిన్హా బృందానికి ఉన్న లోతైన అవగాహన, అనుభవం దృష్ట్యా ఉగాండా, కెన్యా, జింబాబ్వే, మొరాకో దేశాలు ఫౌండేషన్‌ సాంకేతిక సహకారాన్ని తీసుకున్నాయి.


ఇప్పటివరకు పదిలక్షల మంది బాలకార్మికులకు విముక్తి కలిగించి, వారికి కొత్త జీవితం ప్రసాదించిన డా. శాంతాసిన్హా ‘‘ఏ తల్లిదండ్రీ తమ పిల్లలు చదువుసంధ్యలు లేకుండా పనుల్లో మగ్గాలని కోరుకోరు. అలాగే వారిని పనిలో పెట్టుకున్నవారు కర్కశులు కారు. సహనంతో వారిలో మార్పు కోసం పనిచేస్తే తప్పక పరివర్తన వస్తుంద’’ని ఆమె నమ్ముతారు. అలాగే చట్టాలను సంక్షేమ పథకాలను, అమలుచేసే ప్రభుత్వ వ్యవస్థల్లోనూ మానవతా దృక్పథంతో పనిచేసే అధికారులకు కొదవలేదు. మేం కేవలం వారధిగా నిలిచేందుకు కృషిచేస్తామని ఆమె చెప్పారు.


ఎం.వి. ఫౌండేషన్‌ను సుశిక్షితులైన నాయకులు, కార్యకర్తలకు అప్పగించిన డా.శాంతాసిన్హా నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సిపిసిఆర్‌)కు రెండు పర్యాయాలు ఛైర్‌పర్సన్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఏడు పదుల వయస్సు దాటినా కౌమారదశ బాలికల సమస్యలపై పనిచేస్తున్నారు. సూర్యాపేటలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో బాలికల స్థితిగతులు మెరుగుపరచేందుకు కృషిచేస్తున్నారు. జూమ్‌ సమావేశాలు, బ్లాగ్‌లు, వాట్సాప్‌ వంటి టెక్నాలజీ సహాయంతో ఇప్పటికీ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. నిస్సత్తువగా పనికివెళ్లే పిల్లలు... బడిబాట పట్టి కేరింతలు కొడుతూ పాఠశాలలకు వెళుతుంటే అదే ఆమెకు విశ్రాంతి.

యస్‌.వి. సురేష్‌

(శాంతాసిన్హాకు రేపు గీతం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం)

Updated Date - 2022-07-29T06:04:09+05:30 IST