యూపీలో పిస్తోలు, గుల్బర్గాలో కత్తి!

ABN , First Publish Date - 2022-08-06T08:57:15+05:30 IST

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు.

యూపీలో పిస్తోలు, గుల్బర్గాలో కత్తి!

  • కొనుగోలు చేసిన నిందితుడు ప్రసాద్‌
  • ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం

బంజారాహిల్స్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. నిందితుడు పెద్దసాని ప్రసాద్‌ గౌడ్‌ ఉత్తరప్రదేశ్‌లో పిస్తోలును, గుల్బర్గాలో కత్తిని కొనుగోలు చేసినట్లు వారి దర్యాప్తులో తేలింది. గడచిన రెండు నెలలుగా పిస్తోలు కొనుగోలు కోసం ప్రసాద్‌ యత్నిస్తున్నట్లు సమాచారం. చివరకు ఓ మధ్యవర్తి ద్వారా యూపీలో రూ. 50వేలకు పిస్తోలు కొనుగోలుకు బేరం కుదుర్చుకున్నాడు. రూ.32 వేలను ఆన్‌లైన్‌లోనే చెల్లించి, ఆయుధాన్ని తెచ్చుకున్నాడు. అయితే.. తూటాలు లేకపోవడంతో.. వాటి కోసం ఢిల్లీ, కర్ణాటక తిరిగినా అతడికి లభ్యం కాలేదని తెలుస్తోంది. బుల్లెట్లు లేని పిస్తోల్‌తోనే ప్రసాద్‌ ఎమ్మెల్యేను బెదిరించాడా అనేది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఇక కత్తిని గుల్బర్గాలో రూ. 1800కు ప్రసాద్‌ కొనుగోలు చేశాడు. కోఠిలో బొమ్మ తుపాకీని కొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేను అంతం చేసేందుకే ప్రసాద్‌ పిస్తోలును కొనుగోలు చేశాడా? వంటి ప్రశ్నలకు పోలీసులు సమాధానాలను అన్వేషిస్తున్నారని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-06T08:57:15+05:30 IST