Abn logo
May 13 2021 @ 06:03AM

ఆచార్య నామానికి అమరిన వ్యక్తిత్వం

ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖలో గత పదిహేడేళ్ళుగా పనిచేస్తున్న ఆచార్య బండి బాలస్వామి (51) మరణవార్త అబద్ధమైతే బాగుండును! అనునిత్యం ముఖంపై చెదరని చిరునవ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారిని నొప్పించని మాటతీరు అలాగే మమ్మల్ని పలుకరిస్తే బాగుండును! మహమ్మారి కొవిడ్‌తో పోరాడి గెలిచారనే తీపి కబురు కోసం ఎదురు చూస్తున్న వేళ ఆ మృత్యుపిశాచానికి బలయ్యారనే చేదు నిజం వినాల్సి వస్తుందనుకోలేదు. జీవిత ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి చివరికి కరోనా వైరస్‌తో తలపడలేక ఆయన ఓడిపోవడం విషాదకరం. కరోనా వైరస్‌తో 20 రోజులపాటు హైదరరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పోరాడుతూ మే 7న ప్రొఫెసర్‌ బాలస్వామి తుదిశ్వాస విడిచారు.


ఆచార్య బాలస్వామిది అరుదైన వ్యక్తిత్వం. వ్యక్తిగతంగా ఎన్ని బాధలున్నా వాటిని ఏరకంగానూ ఎదుటి వారి మీద రుద్దకుండా చిరునవ్వుతో మాట్లాడే స్వభావం ఆయన సొంతం. అంతేకాదు అత్యంత సహనశీలి, సౌమ్యుడు, మృదు స్వభావి. యాభైఏళ్లకు పైబడినప్పటికీ పాతికేళ్ల కుర్రాడు కలిసినా, తన బిడ్డల వయసున్న విద్యార్థులతో మాట్లాడుతున్నా ‘ఏమండి’, ‘గారు’ అని మాత్రమే సంబోధించే ఏకైక ప్రొఫెసర్‌ బాలస్వామి. ఏనాడు తానో ప్రొఫెసర్‌ననే గర్వం ఆయనలో కనిపించకపోయేది. జర్నలిజం కోర్సులో సీటు సాధించాలనుకున్నా.. సబ్జెక్టులో ఏదైనా అనుమానం నివృత్తి చేసుకోవాలన్నా ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేవారు. కోర్సు పూర్తయిన తర్వాత బాలస్వామి దగ్గర కెరీర్‌ గైడెన్స్‌ తీసుకోని విద్యార్థులుండరంటే అతిశయోక్తి కాదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ, ఎవరైనా ఆచార్యులు అందుబాటులో లేని సమయంలోనూ డిపార్టుమెంటు మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించారు. ఓయూ క్యాంపస్‌ మొత్తంలో ఆయన అందరికీ తల్లో నాలుకలా ఉండేవారు. విభాగాలు, సబ్జెక్టులకు అతీతంగా ఉస్మానియా యూనివర్సిటీయే గాకుండా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అకడమీషియన్‌గా ఆయనకు మంచి పేరుంది. 


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలస్వామి.. అది తెలంగాణ అయినా, షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశమైనా, రైతు పోరాటాలైనా న్యాయం ఉందని భావించే ప్రతి డిమాండ్‌నూ బలపరిచేవారు. అందుకు సంబంధించి ఏ సమావేశం నిర్వహించినా హాజరై సంఘీభావం తెలిపేవారు. స్వతహాగా జర్నలిజం శాఖకు చెందినవారు కావడంతో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మంచి పట్టు కలిగి ఉండేవారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అనేక ప్రసంగాలు చేయడంతోపాటు గుర్తింపు పొందిన వివిధ జర్నళ్లల్లో అనేక వ్యాసాలు రాశారు. ఆయన పీహెచ్‌డీ గ్రంథం ‘సస్టెనేబుల్‌ డెవెలప్‌మెంట్‌’కు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి జర్నలిజంలో పీహెచ్‌డీ చేసిన తొలి దళితుడు బాలస్వామి. గ్రామీణ నేపథ్యముండి, ఇంగ్లిష్‌తో కుస్తీ పడుతూ పరిశోధన (పీహెచ్‌డీ) ఎలా చేయాలో తలలు పట్టుకునే విద్యార్థులకు ‘పీహెచ్‌డీ అంటే మరేమీ లేదు.. వివిధ రకాల పూలను ఒకే దారానికి ఎలాంటి అరమరికలు లేకుండా, అందంగా అల్లడంలాంటిదే’నని జీవభాషలో చెబుతూ ప్రోత్సహించేవారు.


గుంటూరు జిల్లా అమరావతి దగ్గర పెదకూరపాడు మండలంలోని అబ్బరాజుపాలెంకు చెందిన బండి బాలస్వామిది నిరుపేద దళిత కుటుంబం. 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే కుటుంబానికి భారం కాకూడదని కూలీ పనులకు వెళ్లి తల్లి, అన్నకు అండగా నిలిచారు. సంక్షేమ హాస్టల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించారు. సమాజం నుంచి కుల వివక్ష ఎదుర్కొంటున్నా- దానితో బాధపడుతూ ఆత్మన్యూనతకు గురికాకుండా చదువొక్కటే తనకూ, తన సమాజ అభివృద్ధికీ మార్గమని చిన్ననాడే గ్రహించారు. సీనియర్ల సాయంతో, అందుబాటులో ఉండే గ్రామర్‌ పుస్తకాలను కొనుగోలు చేసి ఆంగ్లభాషపై పట్టుసాధించారు. దేశంలోనే పేరెన్నికగల యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌ సబ్జెక్టులో ఓపెన్‌ కేటగిరీలో సీటు సాధించి తన కుటుంబంలోనూ, బంధువర్గంలోనూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. చదువుల్లోనే కాదు స్టేజీ డ్రామాలు వేయడంలో, పాటలు పాడటంలో, వక్తృత్వ పోటీల్లోనూ తన సత్తా చాటారు. పీజీలో ఉండగానే యూజీసీ ఫెల్లోషిప్‌ సాధించి ఆర్థికంగా కుటుంబానికి ఆసరా అయ్యారు.


కులమనేది లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే సెలక్షన్లు జరిగితే 1999లో అసోంలోని తేజ్‌పూర్‌ యూనివర్సిటీ జర్నలిజం శాఖలో జరిగిన పోస్టుల భర్తీలో ఓపెన్‌ కేటగిరీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చేది. కానీ అలా జరగలేదు. రిజర్వుడ్‌ ఎస్సీ కోటాలో పోస్టు దక్కింది. అక్కడ పదేళ్లపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన అనంతరం 2004 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం డిపార్టుమెంటులో ప్రొఫెసర్‌గా, హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంటుగా, బీవోఎస్‌ చైర్మన్‌గా, పలు హాస్టళ్లకు వార్డెన్‌గా, నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసే ఎంప్లాయిమెంట్‌ సెల్‌ డైరెక్టర్‌గా అనేక సేవలందించారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం వార్డెన్లతో తరచూ గొడవలకు దిగేవారు. అలాంటి సందర్భాల్లో ఆ బాధ్యతలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోయేవారు. బాలస్వామి ఆ బాధ్యతలను నిర్వహించి అటు అధికారులనూ, ఇటు విద్యార్థులనూ సమన్వయపరుస్తూ ఆ బాధ్యతల్లో కొనసాగినంతకాలం హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అకడమిక్స్‌ పరంగా అనేక క్రెడిట్స్‌ పొందినప్పటికీ.. తాను చదివిన యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆచార్యుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువడితే రెండుమూడుసార్లు అప్లై చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. విచిత్రంగా అన్నింట్లోనూ ప్రతిభ కనబరిచినా ఆయనకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది. కారణం ఆయన సామాజిక నేపథ్యమే. రిటైరయ్యేలోపు అక్కడ పని చేయాలనుకున్న ఆయన కల కలలాగే మిగిలిపోయింది.


బాలస్వామి అసలైన అంబేడ్కర్ వాది. బుద్ధుని బోధనలు ఆయన ఆచరణ మార్గం. ఏ మతాన్నీ, కులాన్నీ కించపరచడం, నెత్తిన పెట్టుకోవడం చేయొద్దని, మనుషులందరినీ సమానంగా గౌరవించాలని విద్యార్థులతోపాటు తన ఇద్దరు పిల్లలకు తరచూ చెబుతుండేవారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే తనవంతుగా సాయమందించేవారు. మరీముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వీలైనప్పుడల్లా ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలుస్తూ అంబేద్కర్‌ బోధించిన ‘పే బ్యాక్‌ టు సొసైటీ’ని చివరికంటా అనుసరించిన బాలస్వామి నేటి తరానికి ఎంతో ఆదర్శం!

మహేష్‌ కొంగర

Advertisement
Advertisement
Advertisement