జాతిస్మృతిలో నిలిచిన శౌర్యశిఖరం

ABN , First Publish Date - 2022-07-03T06:02:10+05:30 IST

మానవులు పుడతారు ... చనిపోతారు. కొంతమంది మాత్రమే సమాజానికి ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు....

జాతిస్మృతిలో నిలిచిన శౌర్యశిఖరం

మానవులు పుడతారు ... చనిపోతారు. కొంతమంది మాత్రమే సమాజానికి ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇటువంటి ఉదాత్తులనే ‘మృతంజీవులు’ అంటారు. కోటానుకోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. అటువంటి అరుదైన మహానుభావులలో అగ్రగణ్యుడు మన్యందొరగా, విప్లవజ్యోతిగా గణుతికెక్కిన తెలుగు జాతి మణిపూస అల్లూరి సీతారామరాజు. భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి. ఆయన నిర్వహించిన సాయుధ పోరాటం మన స్వాతంత్ర్యోద్యమంలో నిత్య స్మరణీయమైన శౌర్యచరిత్ర.


చరిత్రను తరచి చూస్తే రక్తపాతం లేని ఉద్యమాల్లేవు. అంతేకాదు రక్తపాతం సంభవించకుండా ఉద్యమాన్ని నడిపించేందుకు ప్రయత్నించిన నాయకులూ ఎంతోమంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు విప్లవ నాయకుడు. స్వాతంత్ర్య స్ఫూర్తిప్రదాత. సాయుధ పోరాటం ద్వారానే దాస్య బంధనాల నుంచి దేశం విముక్తమవుతుందని విశ్వసించి ప్రాణాలర్పించిన యోధుడు. ఆయన పోరాట పటిమ, ధైర్యసాహసాలు అందరికీ తెలిసినవే. అయినా సీతారామరాజును మనం మరొక కోణంలో దర్శించుకుందాం. 


అల్లూరి సీతారామరాజు 4 జూలై 1897న ప్రస్తుత విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు ఒక తమ్ముడు సత్యనారాయణరాజు, ఒక చెల్లెలు సీతమ్మ ఉన్నారు. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీ కొన్నాడు. సీతారామరాజు తెలుగునేలపై జన్మించిన స్వాతంత్ర్య సమరయోధుడు. పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాల వాసులు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడం వలన అప్పనపల్లి, అంతర్వేదిపాలెం, గుడిమాలలంక, దిరుసుమర్రు, మౌందపురం ప్రాంతాలకు వలస వెళ్ళారు. 


అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన మన్యం వీరుని అసలు పేరు ‘శ్రీరామరాజు’. తాత (మాతామహుడు) మందపాటి రామరాజు పేరే అతనికి పెట్టారు. ఎన్నో ఉత్తరాలలోను, మనుచరిత్ర కావ్యం అట్టపైన కూడా ‘శ్రీరామరాజు’, ‘అల్లూరి శ్రీరామరాజు’ అని ఆయన వ్రాసుకొన్నారు. కాలాంతరంలో ‘సీతారామరాజు’ అనే పేరు ఆయనకు స్థిరపడింది. తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయిక విద్యావతి. తండ్రి వెంకట రామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివారు. చిత్రకళ, ఫొటోగ్రఫీ పట్ల ఆయనకు మంచి అభిరుచి ఉండేది. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరావ్యాధికి గురై ఆయన మరణించారు. తండ్రి మృతి రాజు జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. స్థిర ఆదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. ఒకచోట ఉండలేక తరచు వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు. తండ్రి లేకపోవడం రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే సాగింది. 


చిన్నప్పటి నుంచి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం ఉండేవి. నిత్యం దైవపూజ చేసేవారు. తుని సమీపంలో గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశారు. మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించారు. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. అప్పుడే ధారకొండ, కృష్ణదేవిపేట మొదలైన ప్రాంతాలు చూశారు. ఆ వయసులోనే జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నారు. యుద్ధవిద్యలు, ఆయుర్వేద వైద్యంలో ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ఆయన ప్రయత్నించేవారు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవారు. 


మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని సీతారామ రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేశాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరం చేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సంసిద్ధపరిచాడు. అప్పటికే గిరిజనుల్లో పెల్లుబుకుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ఒక విధంగా ప్రవాస శిక్ష.


1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యారు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాష నేర్చుకున్నారు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్ హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూశారు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చారు. గృహవైద్య గ్రంథం, అశ్వశాస్త్రం, గజశాస్త్రం, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నారు. 


మన్యం ప్రాంతానికి వెళ్ళి అక్కడివాళ్ళకి స్వాతంత్ర్యం ప్రాముఖ్యతని నూరిపోసి, దళాన్ని కూడగట్టుకొన్నాడు. కాకపోతే పాతకాలపు విల్లంబులు లాంటి ఆయుధాలు తెల్లవాళ్ళ తుపాకీ గుళ్ళముందు దిగదుడుపే! కాబట్టి, పోలీస్‌ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాడు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌ స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి సఫలమయ్యాడు. ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలనీ, ఆయుధాలనీ, ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలనీ రప్పించవలసి వచ్చింది. 1922 నుంచి 1924 వరకూ కేవలం రెండు సంవత్సరాలే అయినా, పరాయి పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. 1924 మే 7న కొయ్యూరులో బ్రిటిష్ తూటాలకు సీతారామరాజు నేలకొరిగారు. అప్పుడు ఆయన వయస్సు 27 సంవత్సరాలు. 

నందిరాజు రాధాకృష్ణ

విశ్రాంత పాత్రికేయుడు

(జూలై 4: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా భీమవరంలో విగ్రహావిష్కరణ) 

Updated Date - 2022-07-03T06:02:10+05:30 IST