లక్నో: ఆమె నిండుగర్భిణి. పురిటినొప్పులు రావడంతో తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకొని ముద్దాడాల్సిన ఆ తల్లి.. మాతృత్వాన్ని మరిచి నీచంగా ప్రవర్తించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..
భాగ్యనగర్ బ్లాక్‌లోని బంజారా కులానికి చెందిన ఓ మహిళకు గతంలో వివాహమైంది. అయితే భర్తతో గొడవలు జరగడంతో ఆమె రెండు సంవత్సరాల క్రితమే పుట్టింటికి వచ్చి తల్లితో కలిసి ఉంటుంది. కూలీ పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో కొద్దిరోజుల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. తల్లితో కలిసి స్థానిక ఆసుపత్రికి వెళ్లగా.. ఉదయం ఆరున్నరకు సాధారణ కాన్పు ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఇవి కూడా చదవండి
అయితే బిడ్డ పుట్టి రెండు గంటలు కూడా కాకముందే ఆ తల్లి మాతృత్వాన్ని మరిచి కర్కశంగా ప్రవర్తించింది. ఉదయం సుమారు ఎనిమిది గంటలకు బిడ్డతోపాటు బాత్రూంలోకి వెళ్లిన ఆ తల్లి తిరిగి ఒంటరిగా బయటకి వచ్చింది. అది గమనించి నర్సు ఆమెను ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పింది. తండ్రి లేని బిడ్డని లోకం ఎలా చూస్తుందోనని భయపడి కిటికీలోంచి కిందపడేసినట్లు తెలిపింది. అపుడు హుటాహుటిన ఆసుపత్రి సిబ్బంది కొన ఊపిరితో ఉన్న నవజాత శిశువును పిల్లల ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.