Abn logo
Apr 9 2020 @ 00:17AM

ఓ మనిషీ...

ఆ దేవుడు... ఈ దేవుడు!

మా దేవుడు... మీ దేవుడు

కొట్టుకు చచ్చే మనుజుడు

మతం మత్తులో మునుగుడు


ఎవరు ఘనం... ఏది బలం

ఎంతకు తెగనిది వాదం

కొరుకుడు పడనిది శాస్త్రం

ఎందుకింక ఉత్తి వ్యర్థం


కనిపించని సూక్ష్మక్రిమికి

కుదేలై అణిగి మణిగి

నిలువెల్లా వణికి వణికి

ఉన్నచోటే నసిగి నలిగి!


వెలవెల బోయెను తిరుమల

వాటికన్‌లో ఏదీ కళ!

మర్కజ్‌లో ముప్పు ఎలా!

దర్శనమివ్వని దైవము

బోధనలకు లేని జనము


ఏ దైవము కరుణించెను

ఎవరి వాక్కు ఫలియించెను

‘మోక్షమిచ్చు’ సూక్ష్మక్రిమికి

మనుషులెల్ల మోకరిల్లెను


హిందు ముస్లిం క్రైస్తవ సిక్కు

వైద్యుడొక్కడె దిక్కు... ఆస్పత్రికె మొక్కు

శుభ్రతే ప్రార్థన.. స్వచ్ఛత ఆరాధన

ప్రకృతిలోనే మర్మం, మానవ సేవే ధర్మం


ఇకనైనా మేలుకుని... 

హితమేదో తెలుసుకుని

సాటి మనిషిలోనె మనం 

పరమాత్మను వెతుక్కుని

మనుషుల్లా మెలగుదాం... 

మనసుల్లా బతుకుదాం!

టి. సురేష్‌

Advertisement
Advertisement
Advertisement