నా భర్తను చూసి ఆరు నెలలైంది.. రాగానే లాంగ్ హాలీడే: శ్రీజేశ్ భార్య

ABN , First Publish Date - 2021-08-05T21:50:03+05:30 IST

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించడం వెనక వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర ఎంతో ఉంది.

నా భర్తను చూసి ఆరు నెలలైంది.. రాగానే లాంగ్ హాలీడే: శ్రీజేశ్ భార్య

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించడం వెనక వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర ఎంతో ఉంది. ప్రత్యర్థికి గోల్ చిక్కకుండా నెట్ ముందు గోడలా నిలబడిపోయాడు. ఆట చివరి ఆరు సెకన్లలో జర్మనీకి దక్కిన పెనాల్టీ కార్నర్‌ను కూడా గోల్ కాకుండా విజయవంతంగా అడ్డుకున్నాడు. ఫలితంగా భారత జట్టుకు అపూర్వ విజయాన్ని అందించిపెట్టాడు. 


టీమిండియా విజయం సాధించిన అనంతరం శ్రీజేశ్ భార్య అనీషా మాట్లాడుతూ.. తన భర్తను కలిసి ఆరు నెలలు అయిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు విజయం సాధించడంతో శ్రీజేష్‌తో కలిసి లాంగ్ టూర్‌కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. భారత జట్టు పతకంతోనే తిరిగి భారత్‌లో అడుగుపెడుతుందని తొలి నుంచి అనుకున్నానని, కాంస్య పతకం గెలిచినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. తమ జీవితంలో ఇది చాలా సంతోషకరమైన రోజని అన్నారు. 


‘‘నిజంగా చాలా గర్వంగా, ఉద్వేగంగా ఉంది. మన హాకీ జట్టు చాలా గొప్ప విజయాన్ని సాధించింది. భారతీయుల స్వప్నాన్ని నిజం చేసినందుకు జట్టులోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలపానుకుంటున్నా’’ అని అనీషా తెలిపారు. ఇంతటి గొప్ప సంతోషాన్ని ఎలా జరుపుకోవాలో అర్ధం కావడం లేదన్నారు. 


‘‘తొలుత అతడితో కొన్ని రోజులు గడపాలనుకుంటున్నా. ఆరు నెలలుగా అతడిని కలవనేలేదు. ముందు అతడిని చూడాలి. ఈ ఒలింపిక్స్ అతడికి గొప్ప కల. కరోనా మన జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. దీంతో శ్రీజేశ్ ఇంటికి రాలేకపోయాడు. అయితే, ఈ సమయాన్ని అతడు తెలివిగా ఉపయోగించుకున్నాడు. తాజా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మేం లాంగ్ హాలీడేకు వెళ్లాలనుకుంటున్నాం. ఇది మా జీవితంలో గొప్ప రోజు’’ అని అనీషా వివరించారు.

Updated Date - 2021-08-05T21:50:03+05:30 IST