బడ్జెట్‌లో భారీ కోత?

ABN , First Publish Date - 2022-07-07T08:09:14+05:30 IST

అక్షరాలా రెండు లక్షల యాభైఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టిన ప్రభుత్వం.

బడ్జెట్‌లో భారీ కోత?

  • ఈసారి రూ.50 వేల కోట్ల మేర తగ్గే అవకాశం
  • రూ.2.56 లక్షల కోట్లలో 20 శాతం మేర హుళక్కే!
  • అప్పుల కింద రూ.19 వేల కోట్లకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట
  • రూ.41 వేల కోట్ల గ్రాంట్లలో రూ.30 వేల కోట్లు రాకపోవచ్చు
  • కార్పొరేషన్ల ద్వారా ఆశించిన అప్పులపైనా లేని ‘గ్యారంటీ’!
  • భూవిక్రయం ద్వారా రూ.15,500 కోట్లు వస్తాయని అంచనా
  • అనుకున్నంత రాబడి రాకపోతేమరింత కోత పడే చాన్స్‌


(హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి) : అక్షరాలా రెండు లక్షల యాభైఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అందులో దాదాపు రూ.93 వేల కోట్ల మేర అప్పులు, గ్రాంట్ల మీదే ఆశపెట్టుకుంది. కానీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ ఆశ నిరాశే అయ్యేలా కనిపిస్తోంది!! కేంద్ర ప్రభుత్వం అప్పులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆశించిన రూ.52,167 కోట్ల అప్పుల్లో.. రూ.19 వేల కోట్ల మేర కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు గ్రాంట్ల అంచనా రూ.41,007 కోట్లలో నికరంగా వచ్చేది దాదాపు రూ.10 వేల కోట్లేనని, ఈ పద్దు కింద రూ.31 వేల కోట్ల మేర కోత పడే అవకాశం ఉందని అర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు పద్దులపై కోలుకోలేని దెబ్బ పడుతుండడంతో బడ్జెట్‌లో దాదాపు రూ.50 వేల కోట్ల (20ు) మేర కోత పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అంటే... రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌లో రూ.50 వేల కోట్లు హుళక్కేనని.. ఈ ఏడాది రూ.2 లక్షల కోట్ల వ్యయ అంచనాలను అందుకుంటే సర్కారు ఘనత సాధించినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిరుటితో పోలిస్తే ఈ సారి ప్రభుత్వం రూ.26 వేల కోట్లు పెంచి పెద్ద పద్దునే ప్రవేశపెట్టిందిగానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌ వ్యయాలు సర్కారు చెప్పుకొన్నంత  ఘనంగా ఉంటాయా? ప్రతిష్ఠాత్మక పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతాయా? ‘దళితబంధు’ పథకం కోసం కేటాయించిన రూ.17,700 కోట్ల మేర ఖర్చు చేయగలుగుతుందా? అన్న చర్చ ప్రారంభమైంది. ఒకవేళ భూముల అమ్మకం ద్వారా ఆశించిన రూ.15,500 కోట్లు కూడా పూర్తిస్థాయిలో రాకపోతే.. బడ్జెట్‌లో మరింత కోత తప్పకపోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అదృష్టం బాగుండి, ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించి భూముల అమ్మకం ద్వారా రూ.20-30 వేల కోట్ల వరకు సమకూరితే.. కోతలు కొంత మేర తగ్గే అవకాశముంటుందని చెబుతున్నారు.


భారీ అంచనాలు..

దళితబంధు, రైతుబంధు, ఆసరా పెన్షన్లు, రెండు పడకల ఇళ్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాల ద్వారా ఆయా వర్గాల మనసులను చూ రగొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం గడిచిపోయినా ఇప్పటివరకు ఆర్థిక పరిపుష్టిపై ప్రభుత్వం అవగాహనకు రాలేకపోతోంది. ఖజానా చూస్తే వట్టిపోతోంది. భారీగా అంచనా వేసిన రాబడి మార్గాలు దెబ్బకొడుతున్నాయి. అప్పులపై అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణకూ కేంద్రం ఆంక్షలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర కేంద్ర గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల ద్వారా నిధులు సమకూరే పరిస్థితులూ కనిపించడం లేదు. నిజానికి, ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడే.. సర్కారు అంచనాలు చూసి ఆర్థిక నిపుణులు పెదవి విరిచారు. అలవికాని మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో అంచనాలు వేసిందని.. అప్పుల ద్వారా గట్టెక్కాలని యోచిస్తోందని అభిప్రాయపడ్డారు. వారి ఆందోళనలే ఇప్పుడు నిజమవుతున్నాయి. ముఖ్యంగా.. ఈ ఏడాది రూ.52,167 కోట్ల అప్పును రాష్ట్ర సర్కారు అంచనా వేయగా ఆంక్షలతో కేంద్రం మోకాలడ్డింది. గత రెండేళ్ల అప్పులు, గ్యారంటీ అప్పులను లెక్కించి, అప్పట్లో పరిమితికి మించి ఎంత అప్పు చేస్తే అంత మేర ఈసారి కోత పెడతామని చెప్పింది. దీంతో రూ.52,167 కోట్ల అప్పులో రూ.19 వేల కోట్ల అప్పు రాకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది.


 అంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకునే అప్పు దాదాపు రూ.34 వేల కోట్ల మేరకే ఉంటుంది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు కూడా సర్కారు ముప్పుతిప్పలు పెట్టనున్నాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌  కాకతీయ కోసం నీతి అయోగ్‌ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్ల గ్రాంటును కూడా కలుపుకొంటే.. ఈ పద్దు కింద ఏకంగా రూ.41,007 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ.. అంత భారీ మొత్తంలో కేంద్రం నిధులను విడుదల చేస్తుందా అన్నది సందేహంగా మారింది.  ఉదాహరణకు కిందటి సంవత్సరం లెక్కలే చూస్తే.. రూ.38,669.46 కోట్లు గ్రాంట్ల కింద వస్తాయని ఆశిస్తే కేంద్రం రూ.8,619.26 కోట్లను మాత్రమే విడుదల చేసింది. అందునా ఇటీవలికాలంలో రాజకీయంగా కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎ్‌సకు మధ్య వైరం పెరిగిపోవడంతో ఏ అవకాశాన్నీ వదులుకోకుండా రాష్ట్రాన్ని కేంద్రం తిప్పలు పెడుతోంది. అప్పులపై కఠినంగా ఉన్న కేంద్రం.. గ్రాంట్లను మాత్రం రాష్ట్రం ఆశించిన స్థాయిలో విడుదల చేస్తుందా అన్నదే ఇపుడు చర్చనీయాంశమైంది.


భూముల విక్రయం ద్వారా..

పన్నేతర రాబడిలో భాగమైన భూముల అమ్మకం ద్వారా రూ.15,500 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ... భూముల అమ్మకం సాఫీగా సాగడం లేదు. ఇప్పటివరకూ జిల్లాల్లో గుర్తించిన భూముల ద్వారా ఎంత ఆదాయం వస్తుందన్నదీ తేలడం లేదు. ఒకవేళ ఈ పద్దు కింద ఆశించిన రాబడి రాకపోతే... బడ్జెట్‌లో మరింత కోత పడుతుంది. నిరుడు రూ.2,30,826 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.1.77 లక్షల కోట్లను మాత్రమే ఖర్చు చేయగలింది. కార్పొరేషన్ల అప్పుల్లోనూ పెద్ద ఎత్తున (దాదాపు రూ.22 వేల కోట్ల మేర) కోత పడే ప్రమాదం కనిపిస్తున్న నేపథ్యంలో.. బడ్జెట్‌ కోత ఈసారి భారీగా ఉండడం తథ్యమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2022-07-07T08:09:14+05:30 IST