వంకర చెట్ల అడవి

ABN , First Publish Date - 2022-05-02T05:58:45+05:30 IST

ఇవ్వాలనేం లేదు ఇప్పుడు ఇవ్వను పొమ్మన్నా కుదిరేలా కూడా లేదు ఏమిస్తారా అని ఐదేళ్లూ ఎదురుచూసే వాళ్ళదో కథ...

వంకర చెట్ల అడవి

ఇవ్వాలనేం లేదు

ఇప్పుడు ఇవ్వను పొమ్మన్నా 

కుదిరేలా కూడా లేదు

ఏమిస్తారా అని 

ఐదేళ్లూ ఎదురుచూసే వాళ్ళదో కథ

అస్సలేమాత్రం ఓపికలేని వాళ్ళదే

మొత్తం కథంతా!


అసలు

ఈ ఇచ్చి పుచ్చుకోవడమనే

వ్యూహాన్ని రచించిందెవరు?

ఈ కేరెట్‌ ముక్కలను

నోటి ముందు వేలాడగట్టిందెవరు?

ఈ స్టెరాయిడ్లకు

బానిసలను చేసిందెవరు?


నిన్నటి మాట

ఇవ్వాళ ఉంటుందనేం లేదు

ఈ రోజు మాట

రేపటికి ఉండాలనీ లేదు

అలాంటప్పుడు..

ఇవాళ కుదిరిన బేరం 

ఇవాళే తీరిపోతే తప్పేంటి?


రేపటి రోజు

ఒక బుగ్గకారై నిన్ను వరిస్తుంది

మరి జనానికి?

నిన్నటి నల్లటి ముఖమే 

రేపూ పలకరిస్తుంది


అసలు 

ఈ వ్యాపారసూత్రాన్ని నేర్పిందెవరు?

కాళ్ళూ చేతుల్ని విరిచేసి

దేహీ అనే స్థాయికి అభివృద్ధి చేసిందెవరు?

రాజ్యాంగాన్ని

ఈ అంగడిలో నిలబెట్టిందెవరు?


విత్తనంలో లోపం లేదు

నల్లమేఘం అడ్డుపడితే

సూరీడైనా తలవంచాల్సిందే

ఆశలు మురిగిపోతున్నాయి

అడవంతా వెతికినా

ఒక్క తిన్నటి మొక్కా లేదు

అన్నీ వంకరటింకర చెట్లే

ఇక్కడొక 

నిటారు వృక్షాన్నెలా ఆశిస్తావు?

ఇప్పుడొక

నికార్సైన అరణ్యాన్నెలా ఊహిస్తావు?


ఏం చేయాలన్నా

ముందీ చీడపట్టిన బేరసారాల కొమ్మల్ని

నరికి పారేయాల్సి వుంటుంది

పాతుకుపోయిన విషపు వేళ్ళను

తవ్వి తీసి

కాల్చి బూడిద చేయాల్సి వుంటుంది

పచ్చని నేల నీ కల అయినప్పుడు

ఖాళీపేగులతోనే

మెరకను దున్నాల్సి వుంటుంది 

సాంబమూర్తి లండ

96427 32008


Updated Date - 2022-05-02T05:58:45+05:30 IST