ముస్లింలను మతవిద్యకే పరిమితం చేసే కుట్ర

ABN , First Publish Date - 2022-02-18T06:10:02+05:30 IST

యూపీఅసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక ఆ రాష్ట్రంలో బీజేపీ చేపట్టే ఏ కార్యక్రమంలో చూసినా బురఖా ధరించిన ముస్లింలు ప్రచారానికి వచ్చే కీలక నాయకులకు హారతిపడుతూ...

ముస్లింలను మతవిద్యకే పరిమితం చేసే కుట్ర

యూపీఅసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక ఆ రాష్ట్రంలో బీజేపీ చేపట్టే ఏ కార్యక్రమంలో చూసినా బురఖా ధరించిన ముస్లింలు ప్రచారానికి వచ్చే కీలక నాయకులకు హారతిపడుతూ, వారిని స్వాగతిస్తూ కనిపిస్తున్నారు. ఈ దృశ్యాలు బీజేపీ అనుబంధ ప్రసార, ప్రచురణ మాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విరివిగా కనిపిస్తున్నాయి. అయితే ప్రచారానికి, ఓట్లు వేయడానికి బురఖాలో అనుమతిస్తూ, చదువుకోవడానికి మాత్రం వీల్లేదని బీజేపీ దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో నిషేధాజ్ఞలు విధిస్తోంది. పరమత ద్వేషంతో కూడిన కార్యక్రమాలు యూపీ కన్నా కర్ణాటకలో పెరుగుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ముస్లింలు హిజాబ్‌(ముఖం కనిపించకుండా ధరించే వస్త్రం) ధరించారనే కారణంతో కర్ణాటక ఉడిపిలోని పలు ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో ముస్లిం అమ్మాయిలను అనుమతించకుండా అధ్యాపకులు అడ్డుకుంటుండగా, దీనికి సమర్థనగా ఆ రాష్ట్ర మంత్రులు కూడా ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి పనికొచ్చే బురఖా, చదువుకోవడానికి మాత్రం ప్రతిబంధకంగా మారుతోంది. 


సామాజిక కట్టుబాట్లు కలిగిన ముస్లిం కుటుంబాల్లో అమ్మాయిలను విద్యాసంస్థలకు పంపి ఉన్నత చదువులు చదివించాలంటే ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతుంటాయి. ఎన్నో కట్టుబాట్లను అధిగమించి ముస్లిం అమ్మాయిలు ఆధునిక విద్య దిశగా అడుగులు వేస్తుంటే విద్వేష రాజకీయాలు వారి భవిష్యతును బలిపీఠంపైకి ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముస్లింలను మతవిద్య (మదర్సా)కే పరిమితం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. ప్రధానంగా మాతృస్వామ్య వ్యవస్థలోనే ఆర్థిక, సామాజిక అభివృద్ధి బాగా జరిగినట్లు చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలాంటి మాతృస్వామ్య వ్యవస్థకు తోడ్పడే చదువును ముస్లిం అమ్మాయిలకు దక్కకుండా అవరోధాలు సృష్టించడం బాధాకరం. 


బీజేపీ విధానాలు ద్వంద్వనీతిని చాటుతున్నాయి. ముస్లిం మహిళల కోసమే త్రిపుల్‌ తలాక్‌ను ఎత్తివేశామని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు దఫాల్లో ప్రకటనలు కూడా చేశారు. ‘బేటీ బచావో... బేటీ పడావో’ నినాదం కూడా ‘అమ్మాయిలను రక్షించుకోండి... చదివించండి’ అనే చెబుతుంది. అయినప్పటికీ కర్ణాటకలో దీనికి విరుద్ధంగా ఆ పార్టీ అనుబంధ శ్రేణుల, ఆ పార్టీ కార్యకర్తల తీరు కనిపిస్తున్నది. అవినీతి, అసమర్థత ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ప్రభుత్వం అసమ్మతిని అడ్డుకోవడానికి మత విద్వేష ఎజెండాకు ప్రాణం పోసి, అందులో భాగంగా ముస్లిం అమ్మాయిలను బలి పశువుగా చేస్తున్నట్టు తెలుస్తోంది. 


దేశంలో ముస్లింల అక్షరాస్యత మొదటే అంతంతమాత్రంగా ఉంది. ముస్లిం పురుషుల అక్షరాస్యత 81శాతం ఉండగా, ముస్లిం మహిళల అక్షరాస్యత 69 శాతం మాత్రమే. విద్యారంగంలో ఎస్సీ ఎస్టీల కన్నా ముస్లింలు వెనుకబాటులో ఉన్నారని జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ కమిటీ నివేదిక చాటి చెప్పింది. దేశంలో సగటున ప్రాథమిక పాఠశాలలకు 100కు వంద మంది ముస్లిం విద్యార్థులు వెళుతుండగా, ప్రాథమికోన్నత విద్యకు రాగానే ఆ సంఖ్య 89కి, ఇంటరుకు రాగానే 72కు, డిగ్రీకి రాగానే 48కి, పీజీ నుంచి పీహెచ్‌డీ దాకా వచ్చేసరికి 14కి పడిపోతున్నదని 2020లో నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) 75వ నివేదిక పేర్కొంది. పేదరికమే ముస్లింలు ఉన్నతవిద్యను అందుకోకుండా ప్రతిబంధకంగా మారుతున్నదని ఆ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముస్లిం కుటుంబాల్లో చదువుకుంటున్నవారంతా చాలా మటుకు తొలితరం వారే. వీరే ఆయా కుటుంబాలకు ఆశాదీపాలు. ఆ దీపాలనే ఆర్పివేసి ముస్లింలను ప్రధాన స్రవంతికి దూరం చేసే కుట్రలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. బీజేపీ విషప్రచారంలో అత్యంత కీలక భూమిక పోషించే ఓ ప్రసార మాధ్యమం అయితే యూపీఎస్సీలో ముస్లింలు ఉద్యోగాలు దక్కించుకోవడానికి ‘యూపీఎస్సీ జిహాద్‌’ నడుపుతున్నారని ఓ కార్యక్రమమే ప్రసారం చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఆ కార్యక్రమం ఆగినా కుట్రలు రోజురోజుకు బయటపడుతున్నాయి. మదర్సాలు ఉగ్రవాదులకు అడ్డాలుగా మారుతున్నాయని సంఘ్‌పరివార్‌ సంస్థలు అనాదిగా ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. కేవలం మతవిద్యను మాత్రమే బోధించే మదర్సాల్లో యూపీఏ–1, 2 హయాంలో ఆధునిక విద్యను అందించే ప్రయత్నాలు కొంతమేర జరిగాయి. రాజీవ్‌ విద్యా మిషన్‌ (సర్వ శిక్షా అభియాన్‌) ద్వారా ఈ విద్యాసంస్థల్లో ఆంగ్ల మాధ్యమం అందించడానికి కొంతమేర కృషి జరిగింది. మదర్సాల్లోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో క్రమంగా చేర్పిస్తే రాయితీలు కూడా ఇచ్చిన దాఖలాలున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం దాదాపుగా కనుమరుగైంది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా క్రమంగా మదర్సాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నవారిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మళ్లీ మదర్సాలకే పంపించే ప్రయత్నాలు చేస్తోంది. క్రమంగా ప్రధాన స్రవంతిలోకి అడుగులేస్తున్న సమాజాన్ని మళ్లీ వెనక్కి నెట్టే ప్రయత్నాలు చేయడం శోచనీయం. చదువు ఒక్కటే సమాజాన్ని, తమ జీవితాలను మార్చగలదని విశ్వసించి, కట్టుబాట్లను వీడి చదువుకోవడానికి వస్తున్న వారిని మత విద్వేషాలతో మళ్లీ వెనక్కితోయడం అనాగరికమే. కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం, ఓటర్లను మతపరంగా విభజించే సిద్ధాంతం కోసం చదువుకునే అమ్మాయిలను పావుగా వాడే నిర్ణయాన్ని ప్రగతిశీల శక్తులు అడ్డుకోవాలి.

సయ్యద్‌ మొహినుద్దీన్‌

Updated Date - 2022-02-18T06:10:02+05:30 IST