అంబరాన్నంటిన సద్దుల సంబురం

ABN , First Publish Date - 2022-10-04T09:48:23+05:30 IST

తంగేడు తళుకులీనింది.. ముద్ద బంతి గుబాళించింది.. గునుగు హొయలుపోయింది...

అంబరాన్నంటిన సద్దుల సంబురం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తంగేడు తళుకులీనింది.. ముద్ద బంతి గుబాళించింది.. గునుగు హొయలుపోయింది... తీరొక్క పూలు తుళ్లిపడ్డాయి.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు శిఖరాయమానమైన సద్దుల బతుకమ్మ పర్వం సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభంగా జరిగింది. హైదరాబాద్‌లోని కాలనీలు, బస్తీల్లో బతుకమ్మ పాటలు మార్మోగాయి. పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన గౌరీపూజలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా బతుకమ్మ ఘాట్‌ వరకు భారీ ఊరేగింపు నిర్వహించగా.. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై ఆడి పాడిన మహిళలు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్‌ వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బాగ్‌లింగంపల్లిలో అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ పాల్గొన్నారు. కూకట్‌పల్లిలో ఎమ్మెల్సీ కవిత మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు. హనుమకొండలోని పద్మాక్షిగుండం వద్ద 50వేల మందికిపైగా మహిళలు బతుకమ్మ ఆడారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత పాల్గొనగా, వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో జరిగిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి మహిళలతో కలిసి కోలాటం ఆడారు.


లండన్‌లో బతుకమ్మ..

తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సంబురాలకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశాల్లోనూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా చేయడం గర్వకారణమని ఆయన అన్నారు.


నీట మునిగి నలుగురి మృతి

సద్దుల బతుకమ్మ పండుగ వేళ.. విషాదం నెలకొంది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నీట మునిగి నలుగురు మృతి చెందగా.. ఒక బాలుడు గల్లంతయ్యాడు. వరంగల్‌లోని గోవిందరాజుల గుట్ట ప్రాంతానికి చెందిన మాటూరి రాంచరణ్‌ (11), రిశ్విక్‌, యశ్వంత్‌కుమార్‌ ఈత కొట్టేందుకు ఉర్సు రంగ సముద్రం చెరువు మత్తడి వద్దకు వెళ్లారు. చెరువు పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో మాటూరి రాంచరణ్‌, రిశ్విక్‌ నీటిలో మునిగిపోయారు. రాంచరణ్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికితీయగా, రిశ్విక్‌ ఆచూకీ లభ్యం కాలేదు. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మామిడిపల్లిలో కోతులు వెంబడించడంతో ఐదుగురు చెరువులో దూకగా.. వారిలో ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన బొల్లి రాజేష్‌ (14), పత్తేవార్‌ అఖిల్‌ (14), దీపక్‌, అభిలాష్‌, హన్మాండ్లు.. స్నేహితులు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా గ్రామంలో బాణసంచా కాల్చడంతో.. ఆ శబ్దానికి కోతులన్నీ చెరువు వద్దకు పారిపోయాయి. అక్కడే ఉన్న ఈ ఐదుగురు భయపడి చెరువులోకి దూకారు. ఈత రాకపోవడంతో.. బొల్లి రాజేష్‌, అఖిల్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఘటనలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడకు చెందిన ఆకుల వివేక్‌ అలియాస్‌ నందు(19) కలువ పూలు కోసే క్రమంలో చెరువులో పడి మృతి చెందాడు.

Updated Date - 2022-10-04T09:48:23+05:30 IST