Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఆప్‌’ గెలుపుతో కదిలిన ఆశల తేనెతుట్టె

ఆప్‌ విజయం నుంచి నేర్చుకోవలసింది, ప్రత్యర్థి ఉచ్చులో పడకపోవడం, సొంత వ్యూహం రచించుకోవడం. దాన్నే జాతీయస్థాయికి అన్వయించుకోవాలి. వామపక్షాలు వాస్తవ స్థితిగతులను గుర్తించాలి. దేశప్రజలకు ప్రమాదం ఉన్నదో లేదో కానీ, సమస్త వామపక్షీయులకు, వారి సానుభూతి పరులకు, అభిమానులకు, రకరకాల సోషలిస్టు భావశ్రేణులకు ప్రతికూలమైన కాలం వచ్చింది. మనుగడే ప్రశ్నార్థకం అవుతున్నది. దీర్ఘకాలికమైన లక్ష్యాలను ఎవరూ వదులుకోనక్కరలేదు, కానీ, ఎదురవుతున్న గండాన్ని దాటగలగడం తక్షణ కర్తవ్యం.


ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ముందే ఊహించాయి, అయినా, మంగళవారం నాటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచాయి. జాతీయ అధికారపార్టీకి ఆశ్చర్యంతో పాటు, అదనంగా దిగ్ర్భాంతి కూడా ప్రాప్తించింది. అతిరథ, మహారథులనీ, సమస్త బలగాలనీ మోహరించి, చివరి నిమిషం దాకా శత విధాల ప్రయత్నించి, ఊహాగానాల గణాంకాలకు మించిన మాయాజాలం తమ వద్ద ఉన్నదని భ్రమించిన నాయకులు, మౌనంలోకి జారుకున్నారు. ఇక, ఈ ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం నుంచి తీవ్రమైన ఉత్తేజం, ఆశాభావం పొందినవారి సంఖ్యకు లెక్కలేదు. కాంగ్రెస్‌ పార్టీ నేతలయితే, తమకు ప్రాప్తించింది శూన్యం అని గ్రహించకుండా గెలిచింది తామేనన్న చిత్తభ్రాంతిలోకి వెళ్లిపోయారు. భారతీయ జనతాపార్టీ రాజకీయాలను ఇష్టపడనివారు, ఆ పార్టీ పాలనలో కష్టపడుతున్నవారు, ఆ పార్టీ తీరు ప్రమాదకరమైన కోవలోకి వెడుతున్నదని భయపడుతున్నవారు అందరికీ అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం నాడు అపరిమిత ఆనందాన్ని కలిగించారు.

వారందరూ ఆయన గెలుపులో తమ గెలుపును చూసుకున్నారు. కొందరు విజయాన్ని సాధ్యమైనంత హెచ్చవేసి, 2024 గురించి మాట్లాడసాగారు. భారతీయ జనతాపార్టీని ‘ఆప్‌’ ఓడించిన విధమెట్టిది? ఇతర పార్టీలు నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? ఢిల్లీ ప్రయోగం దేశవ్యాప్తంగా అమలుచేయగలమా లేదా? ‘ఆప్‌‘ను ఈ సారి ప్రశాంత్‌ కిశోర్‌ బిహార్‌లో గెలిపిస్తాడా? – మీడియాలో ఇవే చర్చలు, పత్రికల్లో ఇవే వ్యాసాలు. 

ఢిల్లీ గెలుపు సాధారణమైనదేమీ కాదు. దానికివ్వవలసిన ప్రాధాన్యం దానికివ్వవలసిందే. కానీ, ఇప్పుడు కనిపిస్తున్న హడావిడి మాత్రం దేశరాజకీయాలలో ఆవరించి ఉన్న శూన్యాన్ని మాత్రమే సూచిస్తున్నది. ఏ ఒక్క చిన్న ఆలంబన దొరికినా చాలు, వరదముప్పుకు ఎదురీదవచ్చుననే ఆశ, ఒక్క విజయం, ఒక్క ఊరట, ఒక్క సానుకూల సంకేతం లేని చీకటి కాలంలో ఏదన్నా ఒక్క వెలుతురు కిరణం దొరికినట్టు– సంబరపడిపోతున్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి, ఒకదాని తరువాత మరొకటి రాష్ట్రాలను కోల్పోతూ వస్తున్న భారతీయ జనతాపార్టీ, దాని శ్రేణులు ఢిల్లీ ఫలితం వల్ల నిస్త్రాణకు లోనవుతారా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయి ఎన్నిక ఫలితం గురించి మథనపడనవసరం లేదని సమాధానపడతారా, చూడాలి. ఢిల్లీ ఎన్నికల్లో అమిత్‌ షా చాణక్యం దారుణంగా, ఘోరంగా ఓడిపోయిందనేది మాత్రం నిజం. సమాజాన్ని ఏదో ఒక ప్రాతిపదికపై విడదీసి, ఆ విభజన నుంచి లబ్ధి పొందాలనే రాజకీయం అన్నిచోట్లా విజయం సాధించలేదని, ప్రతిసారీ అదే అస్త్రాన్ని ప్రయోగించడం భావదారిద్ర్యాన్ని సూచిస్తుంది తప్ప ఫలితాన్ని ఇవ్వదని బిజెపి మేధావి వర్గం గ్రహించి ఉండాలి. బిజెపి పాచికలను పారనివ్వని ఆప్‌ వ్యూహాన్ని చూసి, మొండిరోగానికి ఔషధం కనుకున్నంత ఆనందం ప్రత్యర్థులకు కలుగుతున్నది. వారిదీ భావ దారిద్య్రమే. ఆప్‌ నుంచి నేర్చుకోవాలని కాదు, దాన్ని అనుకరించాలని చూస్తారు. 

దేశం ఇప్పుడున్న స్థితిగతులనుంచి చూసినప్పుడు, ‘ఆప్‌’ విజయం కీలకమయినది, ఎంతో ఆవశ్యకమైనది. పార్టీ సానుభూతిపరులకు కూడా రుచించని రీతిలో సాగుతున్న విద్వేషరాజకీయాల వేగానికి ఈ పరిణామం కనీసం కళ్లెం వేస్తుంది. తీవ్రజాతీయవాదం, మనోభావాల జూదం– వీటి ద్వారా ప్రజలను మభ్యపెట్టడం అన్ని వేళలా సాధ్యపడదని గ్రహిస్తే, దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను, నిజమైన పద్ధతుల ద్వారా ఎదుర్కొనడానికి ప్రయత్నించవచ్చు.

ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రదర్శించిన వైఖరి కూడా, ఆర్థిక సంక్షోభం విషయంలో అసమర్థతను, క్రియాశూన్యతను మాత్రమే ప్రతిఫలించింది. అంటే, అటువంటి సమస్యల పర్యవసానం సమాజంపై పడకుండా, ప్రజలను తీవ్రజాతీయవాదం మైకంలో ఉంచవచ్చునన్న ధీమా వల్లనే అంతటి నిర్లక్ష్యమని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఆప్‌ నాయకత్వం, తీవ్ర జాతీయ వాద ఎజెండాను, విభజన రాజకీయాలను తన ఆచరణరంగం నుంచి మినహాయించి, కొన్ని కీలక అభివృద్ధి అంశాల మీద కేంద్రీకరించింది. ఆ అంశాలు, సంక్షేమానికి సదుపాయాలకు సంబంధించినవి, స్థూలంగా ఆర్థికమైనవి. మనోభావాలను మనోభావాలతోనే ఎదిరించాలన్న వాదనని గానీ, ఎదుటివాడు ఆరంభించే సంచలనాత్మక వివాదంలో భాగస్వామి అయ్యే ఆత్మహత్యాసదృశ సరళిని గానీ కేజ్రీవాల్‌ ఆమోదించలేదు. 

కేజ్రీవాల్‌ కూడా రాజీపడ్డాడు. భక్తిని ఆసరాచేసుకున్నాడు. చాలీసాను వల్లించాడు. తానూ హిందువేనని పదే పదే ప్రదర్శించుకున్నాడు. గెలుపు సిద్ధించగానే మంగళవారం మహిమ అన్నాడు, హనుమంతుడికి మొక్కాడు, 370 రద్దుని సమర్ధించాడు, రామాలయం తీర్పుని హర్షించాడు, సిఏఏ విషయంలో గుంభనంగా ఉన్నాడు–– ఇక అతనిదేం గొప్ప? అతను చేసిన పోరాటం ఏముంది? అనేవారూ తయారయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యదర్శి ఒకాయన, సురేశ్‌ భయ్యా జోషి, ఏమన్నారంటే, హిందూ మతస్థులు, భారతీయ జనతాపార్టీ– ఈ రెండూ పర్యాయపదాలేమీ కాదు, బిజెపిని వ్యతిరేకిస్తే హిందువులను వ్యతిరేకించినట్టు కాదు, హిందువుల మధ్య కూడా రాజకీయపోరాటం ఉంటుంది– అని. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు హిందూమతచిహ్నాలు ధరించడానికి సంకోచిస్తున్నారు, ఆ సంకోచాన్ని వీడాలి అని కోరుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు బొట్టు పెట్టుకుని మొక్కులు తీర్చుకుంటున్న కేజ్రీవాల్‌ మీద ఎందుకు అభ్యంతరం ఉంటుంది?– అని కొందరి ప్రశ్న.

కాబట్టి, బిజెపి ఓడిపోయినా, హిందూత్వ గెలిచినట్టేనని, కాకపోతే, ఇది కాస్త మెత్తటి హిందూత్వ–అని వారి భావం. అటువంటి విమర్శకులు మరచిపోతున్నదేమిటంటే, హిందూమతం వేరు, హిందూత్వ వేరు. ఆ రెండూ ఒకటి కావు, రెంటి మధ్యా ఎంతో వైరుధ్యం ఉన్నదనే వారూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో హిందూత్వ రాజకీయవాదాన్ని గట్టిగా నిలదీయగలిగిందీ, నిలువరించగలిగిందీ హిందూ రాజకీయవాదులే తప్ప, నాస్తికులో, వామపక్షీయులో కాదు. కనీసం కాంగ్రెస్‌ వంటి మధ్యేవాదులకు కూడా ఆ శక్తి లేదు. కేజ్రీవాల్‌ హిందువుగా తనను తాను ప్రదర్శించుకున్నాడు కానీ, ముస్లిమ్‌ వ్యతిరేకిగా కాదు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ ఎదుర్కొన్నది ముస్లిమ్‌ వ్యతిరేకతనే ప్రధానాయుధంగా చేసుకున్న బలశాలితో. అతను ముస్లిమ్‌ వ్యతిరేకి కాకపోబట్టే, ఢిల్లీలోని మైనారిటీల ఓట్లన్నీ అతనికే పడ్డాయి. ఈ ఎన్నికల వేదికమీద విభజన అంశాలజోలికి వెళ్లకుండా మరో వైపు దృష్టి మళ్లించినందువల్లనే, హిందువులలో అధికులు అతనికి ఓటు చేశారు. 

ముస్లిమ్‌లకు లేదా మైనారిటీలకు వ్యతిరేకి కాకపోవడం (అనుకూలుడు కూడ కానక్కరలేదు) ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్ప సుగుణం. మతతత్వ రాజకీయాలపై పోరాటానికి కనీస ప్రమాణం అది చాలు. అక్కడినుంచి బలం కూడగట్టుకోవాలి. ఇంత జరిగాక కూడా, ఫలితాలు వచ్చిన మరునాడు కూడా కేజ్రీవాల్‌ ముమ్మాటికీ ఉగ్రవాదే అని బిజెపి అంటున్నదంటే, అది ఉక్రోషం మాత్రమే కాదు, బహుశా తన భావజాలంలో తానే విలవిల కొట్టుకోవడంగా భావించాలి. వచ్చే సాధారణ ఎన్నికలలో భిన్న ఫలితం తేవాలనుకునేవారికి, ఆ లోగా, మతతత్వ రథచక్రాల వేగాన్ని అదుపుచేయాలనుకునేవారికి బిజెపి మనస్థితి ఒక సానుకూల వాతావరణం కల్పిస్తుంది. అదొక్కటే చాలదు, కేజ్రీవాల్‌ లాగా, దేశవ్యాప్తంగా ఒక పరిణతిని, ప్రాప్తకాలజ్ఞతని ప్రదర్శించగల నాయకత్వం కావాలి.

కేజ్రీవాల్‌ గెలుపునకు దోహదం చేసిన అనేక అంశాల్లో, అతనికి దీటైన ప్రత్యర్థి నేత లేకపోవడం కూడా ఒకకారణం. బిజెపి అధికారికంగా పరిగణించిన ముఖ్యమంత్రి అభ్యర్థి మనోజ్‌ తివారీ ఏ రకంగానూ సమవుజ్జీ కాలేకపోయాడు. దేశవ్యాప్తంగా మోదీని ఎదుర్కొనగలిగిన సమవుజ్జీ లేకపోతే అనుకూల వాతావరణం ఉన్నా, అది సానుకూల ఫలితంగా అనువదితం కాదు. ఈ అంశాన్ని ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా గుర్తిస్తుందో, లేక, కూటములుగా ఏర్పడి అవగాహన చేసుకుంటారో చూడాలి. ఆప్‌ విజయం నుంచి నేర్చుకోవలసింది, ప్రత్యర్థి ఉచ్చులో పడకపోవడం, సొంత వ్యూహం రచించుకోవడం.

దాన్నే జాతీయస్థాయికి అన్వయించుకోవాలి. వామపక్షాలు వాస్తవస్థితిగతులను గుర్తించాలి. దేశప్రజలకు ప్రమాదం ఉన్నదో లేదో కానీ, సమస్త వామపక్షీయులకు, వారి సానుభూతిపరులకు, అభిమానులకు, రకరకాల సోషలిస్టు భావశ్రేణులకు ప్రతికూలమైన కాలం వచ్చింది. మనుగడే ప్రశ్నార్థకం అవుతున్నది. దీర్ఘకాలికమైన లక్ష్యాలను ఎవరూ వదులుకోనక్కరలేదు, కానీ, ఎదురవుతున్న గండాన్ని దాటగలగడం తక్షణ కర్తవ్యం.


కె. శ్రీనివాస్

Advertisement
Advertisement