Srihari Nataraj: శ్రీహరి బ్యాగ్‌లో బేస్‌బాల్ క్యాప్.. ఏంటి దాని ప్రత్యేకత?

ABN , First Publish Date - 2022-07-30T23:27:07+05:30 IST

బహుమతి.. ఇది ఎవరిచ్చినా దానికో ప్రత్యేకత ఉంటుంది. కొన్నింటిని జీవితాంతం మనతోనే ఉంచుకుంటాం. ఇంకొన్ని

Srihari Nataraj: శ్రీహరి బ్యాగ్‌లో బేస్‌బాల్ క్యాప్.. ఏంటి దాని ప్రత్యేకత?

బర్మింగ్‌హామ్: బహుమతి.. ఇది ఎవరిచ్చినా దానికో ప్రత్యేకత ఉంటుంది. కొన్నింటిని జీవితాంతం మనతోనే ఉంచుకుంటాం. ఇంకొన్ని గుండెల్లో మధురానుభూతులుగా మిగిలిపోతాయి. కామన్వెల్త్ గేమ్స్‌ స్విమ్మింగ్‌ సెమీస్‌లో విజయం సాధించి ఫైనల్‌ బెర్త్ సంపాదించుకున్న శ్రీహరి నటరాజ్‌ (Srihari Nataraj) వద్ద కూడా అలాంటి బహుమతే ఉంది. ఆ గిఫ్ట్‌కు చాలా విలువ ఉంది. అది అతడిని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటుంది. వెంటే ఉంటూ వెన్నుతడుతుంది. ప్రేరణ నింపుతుంది. 


ఆ గిఫ్ట్.. ఓ బేస్‌బాల్ క్యాప్ (baseball cap). దానిని అతడి తండ్రి చినప్పుడు అతడికి బహుమతిగా ఇచ్చారు. శ్రీహరి సాధిస్తున్న విజయాలు చూసేందుకు ఆయనిప్పుడు లేరు. అయితేనేం.. ఆయనిచ్చిన క్యాప్ మాత్రం అతడివెంటే ఉంటుంది. పోటీ ఎక్కడైనా? శ్రీహరి బ్యాగ్‌లో ఆ బేస్‌బాల్ క్యాప్ ఉండాల్సిందే.  ‘‘దానిని నా తండ్రి చిన్నప్పుడే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆయన జ్ఞాపకార్థం అది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నా విజయాలకు అదే ప్రేరణ’’ అని శ్రీహరి చెప్పుకొచ్చాడు. నేడు (శనివారం) జరిగిన సెమీఫైనల్ బ్యాక్‌స్ట్రోక్ 100 మీటర్ల విభాగంలో 54.55 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్‌కు చేరుకున్న 21 ఏళ్ల నటరాజ్ ఫైనల్‌లోనూ ఇదే ఊపు కొనసాగించి భారత్‌కు పతకం అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 


‘‘ఈ క్షణం కోసం నేను నాలుగేళ్లుగా.. బహుశా జీవితకాలంగా ఎదురుచూస్తున్నా’’ అని శ్రీహరి నటరాజ్ చెప్పుకొచ్చాడు. ఫైనల్‌లో విజయం అందకుండా పోవడానికి కారణమంటూ ఏమీ లేదని, పతకంపై ధీమా వ్యక్తం చేశాడు. పూల్‌లో తన పక్కనున్న వారి గురించి తాను ఆలోచించనని, వారి వేగం గురించి అసలే ఆలోచించనని పేర్కొన్నాడు. పూల్‌లో తన ఆలోచన ఎప్పుడూ లక్ష్యంపైనే ఉంటుందని వివరించాడు. తండ్రి ఇచ్చిన బేస్‌బాల్ క్యాప్ అతడిని ఇప్పుడు పతకం దిశగా పయనించేలా ప్రేరణ నింపుతోంది.

Updated Date - 2022-07-30T23:27:07+05:30 IST