బాలికను కిడ్నాప్ చేసి.. పదే పదే సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2021-01-17T22:53:51+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఉమారియాలో అత్యంత దారుణ ఘటన జరిగింది. 9 మంది కలిసి 13 ఏళ్ల బాలికను కిడ్నాప్

బాలికను కిడ్నాప్ చేసి.. పదే పదే సామూహిక అత్యాచారం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఉమారియాలో అత్యంత దారుణ ఘటన జరిగింది. 9 మంది కలిసి 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి రోజుల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శివరాజ్ సింగ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల ‘సమ్మాన్’ ప్రచారాన్ని ప్రారంభించిన తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.


ఈ నెల 4న బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు మరో ఆరుగురు స్నేహితులతో కలిసి రెండు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, అక్కడితో వారి పైశాచికత్వం ఆగలేదు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆ తర్వాతి రోజున బాలికను విడిచిపెట్టారు. ఆరు రోజుల తర్వాత బాధిత బాలిక మరోమారు కిడ్నాప్ అయింది. గతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఏడుగురిలో ఒకడు మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఓ అడవిలో ఆమెను బంధించి మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేశాడు. 


ఆ తర్వాత బాధిత బాలిక మళ్లీ కిడ్నాప్ అయింది. ఈసారి ముగ్గురు ట్రక్ డ్రైవర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. అయితే, ఈసారి బాలిక చాకచక్యంగా వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసు అధికార ప్రతినిధి అరవింద్ తివారీ పేర్కొన్నారు.


రాష్ట్రంలోని సిధి జిల్లాలో ఇటీవల 45 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమె రహస్య భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. నిందితులు నలుగురు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితుల్లో ఎవరినీ వదిలిపెట్టేది లేదని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.

Updated Date - 2021-01-17T22:53:51+05:30 IST