కరోనా కోరల్లో.. రాష్ట్రం

ABN , First Publish Date - 2020-07-04T08:16:55+05:30 IST

కరోనా కోరల్లో చిక్కి రాష్ట్రం విలవిల్లాడుతోంది. శుక్రవారం ఒక్కరోజే 837 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

కరోనా కోరల్లో.. రాష్ట్రం

రాష్ట్రంలో 837 కొత్త కేసులు 

మరో శాసనసభ్యుడికి వైరస్‌ 

మరో శాసనసభ్యుడికి వైరస్‌ 

16934కు చేరిన పాజిటివ్‌లు 

206కు పెరిగిన కరోనా మరణాలు 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : కరోనా కోరల్లో చిక్కి రాష్ట్రం విలవిల్లాడుతోంది. శుక్రవారం ఒక్కరోజే 837 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీరిలో 789మంది రాష్ట్రంలోని వారే కాగా, ఇతర రాష్ట్రల నుంచి వచ్చిన 46మంది, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు కొవిడ్‌ బారిన పడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 16,934కు చేరాయి. శుక్రవారం కర్నూలులో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 8మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 206కు పెరిగాయి. అనంతపురం జిల్లాలో 149 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో మరో 116మంది వైరస్‌ బారినపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో మరో 108 కేసులు నిర్ధారణ అయ్యాయి. కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం జరిగే హాల్లో కొవిడ్‌ కంట్రోల్‌ రూంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి, జీజీహెచ్‌లో నలుగురికి వ్యాధి సంక్రమించింది. జేఎన్‌టీయూ కలెక్షన్‌ పాయింట్‌లో 15 పాజిటివ్‌లు వచ్చాయి.


పశ్చిమగోదావరి జిల్లాలో మరో 14మందికి పాజిటివ్‌ వచ్చింది. ఓ తహసీల్దార్‌కు, ఎంపీడీవోకు వైరస్‌ సంక్రమించింది. శ్రీకాకుళంలో జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న 31మంది నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 80, గుంటూరు జిల్లాలో 68, నెల్లూరులో 32, కృష్ణాజిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణాజిల్లా నూజివీడులో గతంలో పాజిటివ్‌ వచ్చినవారికి చికిత్స అనంతరం పరీక్షలు నిర్వహించగా నలుగురికి రిపీట్‌ పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. 


మరో ఎమ్మెల్యేకు పాజిటివ్‌ 

గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసనసభ్యుడు ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన ఎంతకూ ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో వైద్యశాఖ అధికారులు కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఆయనే స్వయంగా మందీ మార్బలంతో కలెక్టరేట్‌కు వచ్చారు. నేరుగా ఉన్నతాధికారి వద్దకు వెళ్లి ఎదురుగా కుర్చీలో కూర్చొన్నారు.


తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఆ అధికారి ఆయన్ను బయటకు వెళ్లమని చెప్పడమే కాకుండా ఆయన కూర్చున్న కుర్చీని కూడా బయట వేయించారు. అప్పటివరకూ సదరు ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్నవారంతా శానిటైజర్ల కోసం ఎగబడ్డారు. హోం క్వారంటైన్‌కు వెళ్లిన ఆ ఎమ్మెల్యే... తనకు కరోనా సోకిన మాట వాస్తవమేనని, అయితే తను పూర్తిఆరోగ్యంగా ఉన్నానని సోషల్‌ మీడియా ద్వారా వీడియో సందేశం పంపారు. ఇదిలాఉండగా, మరో ఎమ్మెల్యే గన్‌మన్‌కు పాజిటివ్‌ రావడంతో సిబ్బందితో పాటు ఆయనకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-07-04T08:16:55+05:30 IST