8 నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-06T08:51:52+05:30 IST

సోమవారం(8వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ షెడ్యూలును ప్రభుత్వం ఖరారు చేసింది.

8 నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

  • 22 వరకు నిర్వహణ, 21న అసెంబ్లీ ప్రత్యేక భేటీ
  • షెడ్యూలు ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం
  • 563 స్ర్కీన్‌లలో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సోమవారం(8వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ షెడ్యూలును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి.శేషాద్రి శుక్రవారం షెడ్యూలు జీవోను జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ షెడ్యూలును కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు సమావేశాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 15 వరకు రాష్ట్రంలోని వివిధ చారిత్రక కట్టడాలను ఉచితంగా సందర్శించవచ్చని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ) ప్రకటించింది. హైదరాబాద్‌లోని చార్మినార్‌, గోల్కొండ కోటతో పాటు హన్మకొండలోని వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట, రామప్ప ఆలయం, పిల్లలమర్రి ప్రాంతాలను ఉచితంగా తిలకించవచ్చని, ఎలాంటి టికెట్లు ఉండవని పేర్కొంది. 


ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ అధికారులతో తలసాని సమీక్ష 

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. విద్యార్ధుల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు ఆగస్టు 15న మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ఆదారంగా తెలుగు-హిందీ భాషల్లో  రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 563 స్ర్కీన్‌లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం మాసాబ్‌ ట్యాంక్‌ లోని తన కార్యాలయంలో ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌, ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, సినీరంగ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సుమారు 2.77 లక్షల మంది విద్యార్థులు తిలకించేందుకు అనువుగా అవసరమైన ప్రాంతాల నుంచి ప్రభుత్వం రవాణా ఏర్పాట్లు కూడా చేస్తుందన్నారు. 

Updated Date - 2022-08-06T08:51:52+05:30 IST