ఆస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ!
ABN , First Publish Date - 2021-05-02T08:59:59+05:30 IST
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని సర్కారు నిర్ణయించింది.
- వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతిలో నియామకాలు
- కొవిడ్ పరిస్థితులపై పర్యవేక్షణకు 4 బృందాలు
- ఐసొలేషన్‌లో ఉన్నవారికి 7.5 లక్షల కిట్లు
- కొవిడ్ రోగుల కోసం జిల్లాల్లో కాల్‌సెంటర్లు
- కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర సర్కారు
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని సర్కారు నిర్ణయించింది. రోగులకు మెరుగైన సేవలందించేందుకు గాను అన్ని ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్‌సీల్లో ఖాళీలన్నింటినీ యుద్ధ్దప్రాతిపదికన భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటన్నింటినీ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వేగంగా భర్తీ చేయడానికి ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఖాళీలను వాకిన్ ఇంటర్వ్యూల పద్ధతిలో భర్తీ చేయనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రఘనందన్‌రావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. అలాగే మందులు, వైద్య సేవలను మెరుగుపర్చేందుకు ఐఏఎస్ అఽధికారులతో ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నుంచి ఆ శాఖను తప్పించిన వెంటనే కొవిడ్ పరిస్థితిపై సీఎం కార్యాలయం రంగంలోకి దిగింది. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్; సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి శనివారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి..
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం ఉన్న 10 వేల ఆక్సిజన్ పడకలను 20వేలకు పెంచడం.
49133 కొవిడ్ పడకలను 60 వేలకు పెంచడంపై ప్రత్యేక దృష్టి.
కొవిడ్ రోగుల కోసం అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు.
గ్రేటర్ హైదరాబాద్‌లో కొవిడ్ రోగుల కోసం కాల్ సెంటరు 040-21111111 ఏర్పాటు.
హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారి కోసం 7.5 లక్షల మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడం, అవసరమైతే ఇంటికే ఆ కిట్లను పంపడం.
గ్రేటర్ పరిఽధిలో ప్రస్తుతమున్న కొవిడ్ ఆస్పత్రుల్లో అదనంగా 1500 పడకల పెంపు. నిమ్స్‌లో 500, సరోజినీదేవీ కంటి ఆస్పత్రిలో 200, ఛాతీ ఆస్పత్రిలో 50, గాంధీలో 200, టిమ్స్‌లో 200, గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో 100, మలక్‌పేట్‌లో 100, వనస్థలిపురంలో 100, అమీర్‌పేట్‌లో 50 అదనపు పడకలను వారంలోగా ఏర్పాటు.
సీనియర్ ఐఏఎస్ సందీప్ సుల్తానియా ఆధ్వర్యంలో మందుల కొరత రాకుండా సమీకరించుకునేందుకు బృందం.
అన్ని ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశాలు. వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా వాటి భర్తీ. పంచాయతీరాజ్ కమిషన్ రఘునందన్‌రావుకు ఈ బాధ్యతను అప్పగించారు. జిల్లాస్థాయిలో కలెక్టర్లు ఈ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది.
సీనియర్ ఐఏఎస్ జయేశ్ రంజన్ ఆధ్వర్యంలోని ఓ బృందం రెమ్‌డెసివిర్ లాంటి అత్యవసర మందుల కొనుగోలు బాధ్యత చూసుకుంటుంది.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు సీనియర్ ఐఏఎస్ ను ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు.
జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యసేవల మెరుగు కోసం కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా, ఇతర ఆస్పత్రులకు జిల్లా సీనియర్ అధికారులు ప్రత్యేక అధికారులుగా నియామకం.
18-45 ఏళ్ల వారికి 4.4 లక్షల డోసులే
రాష్ట్రంలో 18-45 ఏళ్ల వారికి టీకా ఇచ్చేందుకు మే నెలకు కేంద్రం 4.4 లక్షల డోసులనే కేటాయించింది. మరిన్ని ఎక్కువ డోసులు కేటాయించాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సమీక్షలో నిర్ణయించారు. ఇక 45 ఏళ్లు పైబడిన వారికి 15 నాటికి కేవలం 8.35 లక్షల డోసులనే కేంద్రం కేటాయించిందని.. కానీ, 30.45 లక్షల డోసులు అవసరమని, దీనిపై మరో లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఆక్సిజన్ అవసరాల నేపథ్యం లో 600 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నారు. కేంద్రం రోజుకు ఇచ్చే 430 మెట్రిక్ టన్నులు సరిపోదని, కేటాయింపులు పెంచాలని మోదీ సర్కారుకు మరో లేఖ రాయాలని నిర్ణయించారు.