బ్రిట‌న్ విమానాశ్ర‌యంలో చిక్కుకుపోయిన‌ 70 మంది తెలుగు విద్యార్థులు

ABN , First Publish Date - 2020-03-31T19:28:08+05:30 IST

బ్రిట‌న్‌లో క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 22,141 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,408 మంది చ‌నిపోయారు.

బ్రిట‌న్ విమానాశ్ర‌యంలో చిక్కుకుపోయిన‌ 70 మంది తెలుగు విద్యార్థులు

లండ‌న్‌: బ్రిట‌న్‌లో క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 22,141 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,408 మంది చ‌నిపోయారు. ఏకంగా యూకే ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ కూడా ఈ మ‌హ‌మ్మారి సోకింది. రోజురోజుకీ క‌రోనా కోర‌లు చాస్తుండ‌డంతో బ్రిట‌న్‌ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించింది. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. దీంతో వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌యాణికులు, విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. యూకేలోని హీత్రూ ఎయిర్ పోర్టులో 70 మంది తెలుగు విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. పది రోజుల క్రితం భారత్ వచ్చేందుకు విద్యార్థులు విమానాశ్ర‌యానికి వచ్చారు. కానీ, విమాన సర్వీసులు రద్దు కావ‌డంతో వారు అక్కడే చిక్కుకుపోయారు.


తొలి నాలుగు రోజులు భారత దౌత్య‌ కార్యాలయం అధికారులు విద్యార్థులకు వసతి, భోజ‌న‌ సౌకర్యాలు కల్పించారు. ఆ త‌ర్వాత నుంచి విద్యార్థులను ఎవరూ పట్టించుకోకపోవడంతో గ‌త ఐదు రోజుల నుంచి భోజ‌నం, వ‌స‌తి లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి విద్యార్థులు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు. త‌మ‌ను ఎలాగైనా స్వ‌దేశానికి తీసుకెళ్లాల‌ని వారు కోరుతున్నారు. 70 మంది తెలుగు విద్యార్థుల‌తో పాటు ఇత‌ర‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా భారీ సంఖ్య‌లో ఎయిర్‌పోర్టులో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక త‌మ పిల్ల‌లు విమానాశ్ర‌యంలో చిక్కుకుపోవ‌డంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స‌హాక‌రించి విద్యార్థుల‌ను భార‌త్‌కు ర‌ప్పించాల‌ని కోరుతున్నారు. 

Updated Date - 2020-03-31T19:28:08+05:30 IST