ఐదేళ్లలో 7 లక్షల ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-09-17T08:34:42+05:30 IST

ఆధునిక టెక్నాలజీలను ప్రోత్సహించడం ద్వారా రానున్న ఐదేళ్లలో 7లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ వంటి

ఐదేళ్లలో 7 లక్షల ఉద్యోగాలు

విద్యార్థులకు కృత్రిమ మేధలో శిక్షణ..

తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కారిడార్‌ ఏర్పాటు

గ్రామాల్లో 12వేల డిజిటల్‌ తెలంగాణ కేంద్రాలు..

ఇంటి నుంచే వెయ్యి రకాల సేవలు

రూ.1300 కోట్లతో కొత్తగా స్టార్టప్‌ ఫండ్‌..

8వేల స్టార్టప్‌లకు ప్రభుత్వం చేయూత

ఐదేళ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్‌..

ఐటీ పాలసీని విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆధునిక టెక్నాలజీలను ప్రోత్సహించడం ద్వారా రానున్న ఐదేళ్లలో 7లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌ వంటి కొత్త ఆవిష్కరణల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంబంధిత నిపుణులకు డిమాండ్‌ ఏర్పడిందని మంత్రి అన్నారు. ఆయా రంగాల్లో యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రంలో ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు. దీనికోసం తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ (టెట్‌) కారిడార్‌ ఏర్పాటుచేస్తామని చెప్పారు. కోర్సులతో సంబంధం లేకుండా టెక్నాలజీ విద్యార్థులందరికీ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ)లో శిక్షణ అందిస్తామని తెలిపారు. 


2021-26 కాలంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ రంగాల అభివృద్ధికి సంబంధించి నూతన ఐటీ పాలసీని గురువారం కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో ఇప్పటికే 6.5 లక్షల మంది ఉపాఽధి పొందుతున్నారని, ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. ఎలక్ర్టానిక్స్‌ రంగంలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించడం ద్వారా మరో 50వేల మందికి ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తామన్నారు. టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ఈ విషయంలో వినూత్న కార్యక్రమాలతో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్‌ అన్నారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ నుంచి 12.98 శాతం ఎగుమతులు నమోదయ్యాయని, జాతీయ సగటుతో పోలిస్తే ఇది రెట్టింపుగా ఉందన్నారు. 2026 వరకు ఇదే వృద్ధిని నమోదు చేయడం ద్వారా రూ.3లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీసేవ కేంద్రాల ద్వారా ఇప్పటికే 500 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టి-యాప్‌ ఫోలియో మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా మరో 250 రకాల సేవలు ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు.


వచ్చే ఐదేళ్లలో మొత్తం వెయ్యి రకాల ప్రభుత్వ సేవలను ఇంటి నుంచే పొందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.  వాహన లైసెన్సు లాంటి వాటికోసం తప్ప ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవకాశమే లేకుండా ‘కాంటాక్ట్‌లెస్‌, పేపర్‌లెస్‌, ప్రెజెన్స్‌లెస్‌’ సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం నుంచి ఒకరిని డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్‌ చెప్పారు. దీనికోసం 12వేల డిజిటల్‌ తెలంగాణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ సందర్భంగా స్టార్టప్‌ తెలంగాణ పోర్టల్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. 


ఐటీ పాలసీలో విశేషాలు

రూ.1300కోట్లతో స్టార్టప్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 8వేల స్టార్ట్‌పలకు ఆర్థిక సహకారం అందించనున్నట్టు కొత్త ఐటీ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. దీనికోసం ప్రత్యేకంగా పెట్టుబడుల కమిటీని ఏర్పాటుచేస్తారు. స్కూలు స్థాయి నుంచే విద్యార్థులకు వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడానికి కృషి చేస్తారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఉచిత వైఫై పాయింట్లు ఏర్పాటు చేస్తారు. విద్యార్థులతోపాటు ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కూడా నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ ఇస్తారు. విదేశీ వర్సిటీలతో ఒప్పందాల ద్వారా ఫారిన్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. కొత్తగా 5 జిల్లాల్లో ఐటీ ప్రాంతీయ కేంద్రాలను నెలకొల్పుతారు. ‘‘రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్‌, ఈ-వేస్ట్‌ లాంటి పాలసీలను ప్రకటించాం. డిజిటల్‌ టెక్నాలజీ ఫలాలు ప్రజలకు అందాలన్న లక్ష్యంతో ఐటీ పాలసీని రూపొందించాం’’  అని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ అన్నారు.

Updated Date - 2021-09-17T08:34:42+05:30 IST