ఆ కేటగిరీ ప్రవాసుల Work permits రెన్యువల్, ఆరోగ్య బీమాతో.. కువైత్‌కు రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం!

ABN , First Publish Date - 2022-02-04T14:57:44+05:30 IST

ఇటీవల గల్ఫ్ దేశం కువైత్ 60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు ఆరోగ్య బీమాకు వీలు కల్పించిన విషయం తెలిసిందే.

ఆ కేటగిరీ ప్రవాసుల Work permits రెన్యువల్, ఆరోగ్య బీమాతో.. కువైత్‌కు రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం!

కువైత్ సిటీ: ఇటీవల గల్ఫ్ దేశం కువైత్ 60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు ఆరోగ్య బీమాకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(రూ.61వేలు) నిర్ణయించింది. అలాగే ఈ కేటగిరీ ప్రవాసుల బీమా రుసుమును ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ 500 కువైటీ దినార్లుగా(రూ.1.23లక్షలు), ఇతర చార్జీల రూపంలో మరో 3.5 కేడీలు(రూ.864) కలిపి మొత్తం 503.5 కువైటీ దినార్లుగా(రూ.1.24లక్షలు) నిర్ణయించింది. ఇలా వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు, బీమా పాలసీ రుసుముతో కువైత్‌కు ఈ ఏడాది ఏకంగా 42.2 మిలియన్ కువైటీ దినార్ల(రూ.1,041కోట్లు) ఆదాయం సమకూరనుంది. వీటిలో వర్క్ పర్మిట్ రెన్యూవల్ ఫీజు రూపంలో 14 మిలియన్ దినార్లు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రుసుముల రూపం 28.2 మిలియన్ దినార్లు రానున్నాయి. కాగా, ప్రస్తుతం దేశంలో ఈ కేటగిరీకి చెందిన ప్రవాసులు సుమారు 56వేల మంది వరకు ఉన్నట్లు పీఏఎం వెల్లడించింది. 


ఇదిలాఉంటే.. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లేదా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగిన ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు ఆరోగ్య బీమా పాలసీని జారీ చేయడానికి అర్హత ఉన్న ఆరోగ్య బీమా కంపెనీల జాబితాను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఆదివారం నుంచి వర్క్‌ పర్మిట్‌ రెన్యూవల్‌ ప్రారంభమవుతుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ ఆమోదం పొందిన 11 బీమా కంపెనీల జాబితా ఇదే..

* కువైట్ ఇన్సూరెన్స్

* గల్ఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్

* అల్ అహ్లియా ఇన్సూరెన్స్

* వార్బా ఇన్సూరెన్స్

* గల్ఫ్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్

* ఇంటర్నెషనల్ తకాఫుల్ ఇన్సూరెన్స్

* ఎలాఫ్ తకాఫుల్ ఇన్సూరెన్స్

* బౌబియన్ తకాఫుల్ ఇన్సూరెన్స్

* బైటక్ తకాఫుల్ ఇన్సూరెన్స్

* ఇస్లామిక్ అరబ్ తకాఫుల్ ఇన్సూరెన్స్

* ఎనయా ఇన్సూరెన్స్ కంపెనీ 

Updated Date - 2022-02-04T14:57:44+05:30 IST