2,500కే 5జీ స్మార్ట్‌ఫోన్‌!

ABN , First Publish Date - 2020-10-19T05:58:22+05:30 IST

టెలికాం రంగంలో మరో సంచలనానికి ముకేశ్‌ అంబానీ నిర్వహణలోని రిలయన్స్‌ జియో సిద్ధమవుతోంది. రూ. 5,000

2,500కే 5జీ స్మార్ట్‌ఫోన్‌!

రంగం సిద్ధం చేస్తున్న జియో


న్యూఢిల్లీ: టెలికాం రంగంలో మరో సంచలనానికి ముకేశ్‌ అంబానీ  నిర్వహణలోని రిలయన్స్‌ జియో సిద్ధమవుతోంది. రూ. 5,000 కంటే తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రారంభంలో 5జీ ఫోన్‌ ధర రూ.5,000 వరకు పెట్టి నా ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ ధర రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య ఉం టుందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని కంపెనీ అధికార వర్గా లు చెప్పాయి.


ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5జీ టెలికాం సేవలను సపోర్ట్‌ చేసే స్మార్ట్‌ఫోన్ల కనీస ధర రూ.27,000 నుంచి ప్రారంభమవుతోంది. 4జీ సేవలు ప్రారంభమైనా దేశంలో ఇంకా దాదాపు 35 కోట్ల మంది 2జీ ఫీచర్‌ ఫోన్లే వినియోగిస్తున్నారు. తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వీరిలో కనీసం 20 నుంచి 30 కోట్ల మందిని ఆకర్షించవచ్చని జియో భావిస్తోంది. 


   అదే వ్యూహం

4జీ సేవల కోసమూ రిలయన్స్‌ జియో ఇదే వ్యూహాన్ని అనుసరించింది. మిగతా కంపెనీలన్నీ 2జీ సేవల నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి పెడితే, జియో మాత్రం రిఫండబుల్‌ డిపాజిట్‌తో రూ.1,500కే 4జీ  ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసి కోట్ల మంది ఖాతాదారుల్ని సంపాదించింది. ఇపుడు 5జీ స్మార్ట్‌ఫోన్‌ విషయంలోనూ ఇదే వ్మూహం అనుసరించాలని కంపెనీ భావిస్తోంది.


భారత్‌ను త్వరలోనే 2జీ విముక్త దేశంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నట్టు ముకేశ్‌ అంబానీ గత ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో ప్రకటించారు. దీనికి తోడు ఇటీవల ఫేస్‌బుక్‌, గూగుల్‌, అనేక పీఈ సంస్థలు రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫాంలో దాదాపు రూ.1.54 లక్షల కోట్లు పెట్టుబడులు కుమ్మరించాయి. ఈ నిధుల్లో కొంత భాగాన్ని 5జీ ఫోన్ల కోసం వినియోగించాలని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 


25 లక్షల కొత్త కస్టమర్లు


కొత్త ఖాతాదారుల సంపాదనలోనూ జియో హవా  కొనసాగుతోంది. జూలైలో కంపెనీ కొత్తగా 25 లక్షల మంది కొత్త ఖాతాదారుల్ని సంపాదించింది. ఇదే కాలంలో ఎయిర్‌టెల్‌ నాలుగు లక్షలు, వొడాఫోన్‌ ఐడియా 38 లక్షల మంది ఖాతాదారుల్ని కోల్పోయాయి. ట్రాయ్‌ ఆదివారం ఈ వివరాలు విడుదల చేసింది.

జూలై నెల మొత్తం మీద దేశంలోని టెలికాం సంస్థలన్నీ కొత్తగా 35 లక్షల మంది కొత్త ఖాతాదారుల్ని సంపాదిస్తే అందులో రిలయన్స్‌ జియో ఒక్కటే 25 లక్షల మంది ఖాతాదారుల్ని సంపాదించడం విశేషం.


Updated Date - 2020-10-19T05:58:22+05:30 IST