5జీ.. వాహ్‌జీ!

ABN , First Publish Date - 2022-08-02T08:38:33+05:30 IST

ఐదో తరం టెలికాం తరంగాల (5జీ స్పెక్ట్రమ్‌) వేలం ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన ఈ వేలంలో మొత్తం రూ.1,50,173 కోట్ల విలువైన.

5జీ.. వాహ్‌జీ!

స్పెక్ట్రమ్‌ వేలంలో సరికొత్త రికార్డు

మొత్తం రూ.1.50 లక్షల కోట్ల బిడ్లు

రిలయన్స్‌ జియో టాప్‌ బిడ్డర్‌ 

రూ.88,078 కోట్ల స్పెక్ట్రమ్‌ కొనుగోలు 

అదానీ చేతికి రూ.212 కోట్ల తరంగాలు 

భారతీ ఎయిర్‌టెల్‌ రూ.43,084 కోట్లు..

వొడా ఐడియా రూ.18,784 కోట్ల బిడ్లు 


న్యూఢిల్లీ: ఐదో తరం టెలికాం తరంగాల (5జీ స్పెక్ట్రమ్‌) వేలం ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన ఈ వేలంలో మొత్తం రూ.1,50,173 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు బిడ్లు లభించాయని టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. వేలంలో మొత్తం 10 బ్యాండ్లకు చెందిన 72,098 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టగా.. అందులో 71 శాతానికి సమానమైన 51,236 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను కంపెనీలు కొనుగోలు చేశాయన్నారు. మరిన్ని వివరాలు.. 

 

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. పలు బ్యాండ్లకు చెందిన 24,740 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.88,078 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అమ్ముడైన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు సగం అంబానీయే కొనుగోలు చేయటం విశేషం. 

 

వేలంలో 700, 800, 1,800, 3,300 మెగాహెట్జ్‌తోపాటు 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నట్లు రిలయన్స్‌ జియో తెలిపింది. ముఖ్యంగా దేశంలోని 22 సర్కిళ్లలో 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలు కంపెనీకి 5జీ సేవల్లోనూ ఆధిపత్యానికి దోహదపడనుంది. ఎందుకంటే, 700 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌తో 6-10 కిలోమీటర్ల వరకు సిగ్నల్‌ అందించవచ్చు. మిగతా బ్యాండ్‌విడ్త్‌లతో పోలిస్తే, ఒక్కో టవర్‌తో అధిక ప్రాంతానికి కనెక్టివిటీ కల్పించేందుకు వీలుపడుతుంది. 


 గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్‌.. 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌కు చెందిన 400 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన మొత్తం స్పెక్ట్రమ్‌లో అదానీ దక్కించుకుంది ఒక శాతం కన్నా తక్కువే. అదికూడా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ కోసం ఉపయోగించే 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌ స్పెక్ట్రమ్‌ను గుజరాత్‌, ముంబై, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ సర్కిళ్లలో కొనుగోలు చేశారు.


 సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్‌ ఐదు బ్యాండ్లకు చెందిన 19,867.8 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లకు దక్కించుకుంది. 900, 1800, 2100, 3300 మెగాహెట్జ్‌తో పాటు 26 గిగాహెట్జ్‌ బ్యాండ్లలో స్పెకా్ట్రన్ని కొనుగోలు చేసింది. జియోకు ప్రధాన పోటీదారైన ఈ కంపెనీ 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను మాత్రం కొనుగోలు చేయలేదు. కాగా, వొడాఫోన్‌ ఐడియా (ప్రస్తుతం వి) కూడా పలు బ్యాండ్లకు చెందిన 6,228 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.18,784 కోట్లకు కొనుగోలు చేసింది. 


అక్టోబరులో 5జీ సేవలు షురూ 

ఈనెల 10కల్లా స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరుపుతామని, అక్టోబరులో 5జీ వాణిజ్య సేవలు కావచ్చని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఆ తర్వాత ఏడాది కాలంలోనే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి రావచ్చని, మిగతా దేశాలతో పోలిస్తే, భారత్‌లోనే సేవలు త్వరగా ప్రారంభం కానున్నాయని గతవారం టెలికాం ఇన్వెస్టర్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 


గత వేలంతో పోలిస్తే రెట్టింపు రెవెన్యూ

గత ఏడాదిలో నిర్వహించిన 4జీ వేలంలో అమ్ముడైన రూ.77,815 కోట్ల స్పెక్ట్రమ్‌తో పోలిస్తే తాజాగా ముగిసిన 5జీ వేలంలో ప్రభుత్వానికి దాదాపు రెట్టింపు (రూ.1,50,173) ఆదాయం లభించనుంది. 2010లో నిర్వహించిన 3జీ వేలం ద్వారా సమకూరిన రూ.50,968 కోట్ల రాబడితో పోలిస్తే దాదాపు మూడింతలకు సమానం. 


ఎవరికి ఏ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌? 

ఈసారి వేలంలో 600, 700, 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెట్జ్‌తో పాటు 26 గిగాహెట్జ్‌ బ్యాండ్ల స్పెకా్ట్రన్ని ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. 1800 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కోసం రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ తీవ్రంగా పోటీపడ్డాయని, మిగతా అన్ని బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ మాత్రం రిజర్వ్‌ ధరకే అమ్ముడుపోయిందని మంత్రి తెలిపారు. కాగా, తొలిసారిగా ఆఫర్‌ చేసిన 600 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు కంపెనీలు ఆసక్తి చూపలేదన్నారు. మూడింట రెండొంతుల బిడ్లు 3,300 మెగాహెట్జ్‌, 26 గిగాహెట్జ్‌ బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ కోసమే దాఖలయ్యాయి. పాతిక శాతానికి పైగా బిడ్లు 700 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ కోసం లభించాయి. 2016, 2021లో నిర్వహించిన వేలంలో ఈ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ, ఈసారి దేశంలోని 22 సర్కిళ్లలో అమ్ముడుపోయింది. ఈ బ్యాండ్‌లో అందుబాటులో ఉన్న మొత్తం స్పెక్ట్రమ్‌లో 40 శాతం కొనుగోలు చేశారు. 


కేంద్రానికి 13,365 కోట్ల ఆదాయం 

ఈ వేలం ద్వారా తొలి ఏడాదిలో కేంద్ర ప్రభుత్వానికి రూ.13,365 కోట్ల ఆదాయం లభించనుందని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ఎందుకంటే, వేలంలో దక్కించుకున్న స్పెకా్ట్రన్ని కంపెనీలకు 20 ఏళ్ల కాలానికి కేటాయిస్తారు. ఈసారి స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిన కంపెనీలు అప్‌ఫ్రంట్‌ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. రుసుమును 20 వార్షిక వాయిదాల్లో చెల్లించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.


రెండేళ్లలో రూ.2-3 లక్షల కోట్ల పెట్టుబడులు 

4జీ, 5జీ టెక్నాలజీల కోసం టెలికాం కంపెనీలు వచ్చే రెండేళ్లలో రూ.2-3 లక్షల కోట్ల మేర పెట్టుడులు పెట్టే అవకాశం ఉందని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. టెలికాం రంగ ఇన్వెస్టర్లతో భేటీ కావడం జరిగిందని, వారి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. గత ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ద్వారా టెలికాం ఇండస్ట్రీలో అనిశ్చితి, రిస్క్‌ తొలిగిపోయాయని.. స్థిరమైన పెట్టుబడులకు బాటలు వేశాయని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో 4జీ లాగే 5జీ సేవలు కూడా అత్యంత అందుబాటు ధరల్లో లభ్యం కాగలవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-02T08:38:33+05:30 IST