విద్యుత్‌ ఉద్యోగులకు తెలంగాణలో ఎదురుచూపులే!

ABN , First Publish Date - 2020-07-14T08:24:12+05:30 IST

దేవుడు అనుగ్రహించినా.. పూజారి కరుణించలేదన్న సామెత విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశంలో నిజమవుతోందని అంటున్నారు ఉద్యోగులు.

విద్యుత్‌ ఉద్యోగులకు తెలంగాణలో ఎదురుచూపులే!

  • పోస్టింగ్‌ కోసం 584 మంది నిరీక్షణ

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): దేవుడు అనుగ్రహించినా.. పూజారి కరుణించలేదన్న సామెత విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశంలో నిజమవుతోందని అంటున్నారు ఉద్యోగులు. విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి ధర్మాధికారి కమిషన్‌ ఉత్తర్వులే ఫైనల్‌ అని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను ఇక్కడి విద్యుత్‌ సంస్థలు విధుల్లోకి తీసుకున్నాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఆ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులను ఇంకా విధుల్లోకి చేర్చుకోలేదు. దీంతో విద్యుత్‌ ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఈ అంశంపై మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నాయని ఆ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. 


ఆరేళ్లుగా నలుగుతున్న సమస్య

విద్యుత్‌ ఉద్యోగుల విభజన అంశం ఇరు రాష్ట్రాల మధ్య ఆరేళ్లుగా నలుగుతోంది. దీనిని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిషన్‌ను నియమించింది. ఇరు రాష్ట్రాల సంస్థలు, ఉద్యోగులతో కమిషన్‌ సుదీర్ఘంగా చర్చించి జూన్‌ 20న తుది తీర్పును వెలువరించింది. ఈ కమిషన్‌ ఏం చెబితే అదే తుది నిర్ణయమని, దీనిపై తమ వద్దకు మరోసారి రావద్దని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఏపీ విద్యుత్‌ సంస్థలు పాటించాయి. కానీ, తెలంగాణ 71 మందిని తీసుకొని 584 మందిని విధుల్లోకి తీసుకోలేదు. 


సుప్రీం వద్దన్నా.. ముందుకే

ధర్మాధికారి కమిషన్‌ ఉత్తర్వులే అంతిమమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా.. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకొంటామని చెబుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2020-07-14T08:24:12+05:30 IST