50,000 కొలువులు!

ABN , First Publish Date - 2022-03-09T08:09:03+05:30 IST

‘‘ఎవరు అడిగినా అడగకపోయినా ఎవరికి ఏమి చేయాలో నాకు తెలుసు. నిరుద్యోగుల కోసం బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేస్తాను.

50,000 కొలువులు!

  • వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం.. 
  • అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటన ఇదే
  • కొన్ని నోటిఫికేషన్లు, షెడ్యూళ్లు వెల్లడించే చాన్స్‌
  • జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించేందుకూ అవకాశం
  • నిరుద్యోగుల కోసం బుధవారం అసెంబ్లీలో ప్రకటన
  • రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి
  • నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారు
  • వనపర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటన
  • దాంతో నిరుద్యోగుల్లో మోసులెత్తిన ఆశలు
  • రాష్ట్రవ్యాప్త సంబురాలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధం
  • ఖాళీల భర్తీపై ఇటీవల శేషాద్రి కమిటీ నివేదిక
  • దానిని ముఖ్యమంత్రికి అందజేసిన సీఎస్‌ సోమేశ్‌
  • ఎక్కువ ఖాళీలు పోలీసు, వైద్య, విద్యా శాఖల్లో 
  • ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక?


‘‘వరు అడిగినా అడగకపోయినా ఎవరికి ఏమి చేయాలో నాకు తెలుసు. నిరుద్యోగుల కోసం బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేస్తాను. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారు’’ ...వనపర్తి బహిరంగ సభలో మంగళవారం సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ఇది. దాంతో, ఆ ప్రకటన ఏమై ఉంటుందా? అనే ఉత్కంఠ మొదలైంది. నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా!? కొలువుల తీపి కబురు వినిపిస్తారా!? అనే చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీసింది. అసెంబ్లీ సాక్షిగా బుధవారం  కేసీఆర్‌ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రకటన చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొదట వెలువరించే ఒకటి రెండు నోటిఫికేషన్లు, వాటి షెడ్యూల్‌ తదితర వివరాలను వెల్లడించే అవకాశం ఉందని వివరించాయి.  జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలిపాయి. నిజానికి, ఉద్యోగ ఖాళీలపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిన తర్వాత శాఖలు, విభాగాధిపతుల వారీగా ఖాళీలను ఖరారు చేసినట్లు తెలిసింది. మొదటి దశలో 50 వేలకుపైగా ఖాళీలను గుర్తించినట్లు సమాచారం. ఈ వివరాలను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. వాటి భర్తీపై బుధవారం అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


నివేదికలో ఏముంది!?

ఉద్యోగుల సర్దుబాటుతో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా, నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన నివేదికను అందించాలని నిర్దేశిస్తూ ఈ ఏడాది జనవరిలో నలుగురు ఐఏఎస్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ ఓ కమిటీని నియమించారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కమిషనర్‌ వి.శేషాద్రి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీతోపాటు ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖలు నివేదికను రూపొందించి ఇటీవల సీఎస్‌ సోమేశ్‌కు అందించాయి. దానిని ఆయన ముఖ్యమంత్రికి సమర్పించారు. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి? వేటిని అత్యవసరంగా భర్తీ చేయాల్సి ఉంది? వేటిని తర్వాత భర్తీ చేసినా ఇబ్బంది లేదు? తదితర వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే పోస్టుల గురించి కూడా వివరాలు సమర్పించింది. ఒక్కో శాఖ, విభాగంలో పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టులెన్ని? ప్రత్యక్ష ఎంపిక విధానం ద్వారా భర్తీ చేసేవి ఎన్ని? వంటి వివరాలు సమర్పించింది. జాబ్‌ క్యాలెండర్‌ను అందజేసింది. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్లు, షెడ్యూలు ఇవ్వాలన్న వివరాలను సమర్పించింది. వాటిలో ఎక్కువగా పోలీసు, వైద్య ఆరోగ్యం, విద్యా శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపింది.


టీచర్ల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని వివరించింది.బుధవారం కేసీఆర్‌ చేసే ప్రకటనలో మొదటి దశ ఉద్యోగ ఖాళీలను ప్రకటిస్తారని ఆ వర్గాలు వివరించాయి. బీసీలకు ఉద్యోగరిజర్వేషన్ల వయసు పెంపు నిబంధనను మరో పదేళ్లకాలానికి పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  అసెంబ్లీలో సీఎం నోటి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించడానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పార్టీ కార్యాలయాల వద్దకు రావాలని ఇప్పటికే సమాచారాన్ని చేరవేశాయి. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షల వరకు ఉంటుందని నిరుద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద 24 లక్షల మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారు.  కనీసం ఈసారైనా ప్రకటన వస్తుందా అన్న సందేహంలో ఉన్నారు. 


ఎప్పటి నుంచో నానుతున్న సమస్య

తెలంగాణలో కొలువుల భర్తీ అంశం ఏళ్ల తరబడి నానుతూనే ఉంది. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేయడం.. ఖాళీలను గుర్తిస్తున్నామని, త్వరలోనే ప్రకటన అంటూ సర్కారు చెప్పడం జరుగుతూనే ఉంది. కానీ, ఆ తర్వాత నోటిఫికేషన్ల విషయంలో ముందుకు అడుగు పడలేదు. వాస్తవానికి, 2021 జూలైలోనే పోస్టుల భర్తీపై ప్రభుత్వం హడావుడి చేసింది. జూలై 13న నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దాంతో, అధికారులు కసరత్తు చేసి రాష్ట్రంలో 56,979 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికను సమర్పించారు. దానిపై క్యాబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంత తక్కువ ఖాళీలను చూపడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. మరింత సమగ్రంగా వివరాలు సేకరించాలని, ఖాళీల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ రూపొందించాలని క్యాబినెట్‌ మరోసారి ఆదేశించింది.  మళ్లీ ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. మొత్తంమీద 67,128 ఉద్యోగ ఖాళీలను గుర్తించారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీలను సమగ్రంగా తేలుస్తామని, తర్వాత భర్తీ ప్రక్రియను చేపడతామని ప్రగతి భవన్‌లో తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు కూడా. ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో 70-80 వేల ఖాళీలను భర్తీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. నిజానికి, ఫిబ్రవరి 17న కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏదో ఒక ఉద్యోగ ప్రకటన వెలువడుతుందన్న చర్చ జరిగింది. 

- హైదరాబాద్‌,  మార్చి 8 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-03-09T08:09:03+05:30 IST