500 కోట్ల భూ వివాదం.. కిడ్నాప్‌.. అఖిలప్రియ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-01-07T07:55:41+05:30 IST

కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకురాలు అఖిల ప్రియను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

500 కోట్ల భూ వివాదం.. కిడ్నాప్‌.. అఖిలప్రియ అరెస్ట్‌

  • 14 రోజులు రిమాండ్‌
  • బేగంపేటలో మూడు గంటల పాటు విచారణ
  • గాంధీలో వైద్య పరీక్షలు.. జడ్జి ఎదుట హాజరు
  • ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డి అదుపులోకి
  • అఖిల భర్త.. మరో నలుగురి కోసం గాలింపు
  • కిడ్నాప్‌ కేసును కొన్ని గంటల వ్యవధిలోనే
  • ఛేదించిన పోలీసులు.. బాధితులు సురక్షితం
  • వివరాలు వెల్లడించిన హైదరాబాద్‌ సీపీ 
  • హఫీజ్‌పేటలో ఎప్పటి నుంచో భూ వివాదం
  • గతంలోనూ బాధితుల ఫిర్యాదు, కేసు
  • కిడ్నా్‌పతో సంబంధం లేదు:  ఏవీ సుబ్బారెడ్డి


హైదరాబాద్‌ సిటీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకురాలు అఖిల ప్రియను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూవివాదం నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నా్‌పను పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు! కిడ్నా్‌పకు గురైన ముగ్గురినీ సురక్షితంగా ఇళ్లకు తరలించారు. కేసులో ప్రధాన నిందితులుగా.. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ,  కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని (భూమా నాగిరెడ్డి సన్నిహితుడు) అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కిడ్నాప్‌ కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ బుధవారం మీడియాకు వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బంధువులైన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు అనే ముగ్గురు సోదరులు బోయిన్‌పల్లిలో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి 7.20 గంటలకు..  10 నుంచి 15 మంది ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వారిలో ఒకరు పోలీస్‌ యూనిఫామ్‌లో ఉండగా.. మిగతా అందరూ సాధారణ దుస్తులు ధరించి ఉన్నారు.  తమను తాము ఆదాయపన్ను అధికారులుగా పేర్కొంటూ ఐడీ కార్డులు చూపారు. ఇంట్లో సోదాలు చేయాలంటూ ముగ్గురు సోదరుల పేర్లతో ఉన్న వారంట్‌ కూడా చూపించారు.


ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను విచారించాల్సి ఉందని చెబుతూ.. మిగతా కుటుంబసభ్యులను ఓ పడగ్గదిలో పెట్టి బయట నుంచి గొళ్లెం పెట్టారు. రాత్రి 8.20 గంటలకు బయట నుంచి ఇంట్లోకి వచ్చిన సునీల్‌ భార్య సరిత.. వారంతా పడగ్గదిలో బందీలుగా ఉన్నట్టు గుర్తించారు.  సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఐటీ అధికారులుగా వచ్చిన వారు ముగ్గురు సోదరులనూ మూడు వేర్వేరు వాహనాల్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లినట్లు గుర్తించారు. వారు  ఐటీ అధికారులు కాకపోవచ్చని.. ముగ్గురినీ కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి ఉంటారని అనుమానించారు. పాత భూ వివాదాల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌ల అనుచరులే కిడ్నాప్‌ చేసి ఉంటారని అనుమానించారు.    కిడ్నాప్‌ అయిన వారిని కాపాడేందుకు పోలీసులు అప్పటికప్పుడు 15 బృందాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ, కర్నూలు ఎస్పీలతో కూడా కమిషనర్‌ అర్ధరాత్రే మాట్లాడారు. బాధితుల ఫోన్‌ నంబర్ల లొకేషన్‌తో పాటు... వివిధ రూట్లలో వాహనాలు వెళ్లిన సీసీ ఫుటేజీలు పరిశీలించి తదనుగుణంగా వ్యూహాలను మార్చుకున్నారు. ముగ్గురిని కిడ్నాప్‌ చేసిన నిందితులు బోయిన్‌పల్లి నుంచి నేరుగా మొయినాబాద్‌ మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి 3.30 సమయంలో బాధితులను గుర్తించారు. నిందితులు తప్పించుకునట్లు సీపీ వెల్లడించారు.  


మూడు గంటలు అఖిలప్రియ విచారణ

పోలీసులకు లభించిన ప్రాథమిక ఆధారాల మేరకు కూకట్‌పల్లి, లోధా అపార్టుమెంట్‌లో నివాసముంటున్న అఖిలప్రియ (32)ను పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. అఖిలప్రియను బేగంపేటలోని పోలీస్‌ క్వార్టర్స్‌లో మూడు గంటల పాటు విచారించారు. అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె గర్భవతి కావడంతో లేబర్‌ వార్డులో బీపీ, ఇతర వైద్య పరీక్షలు జరిపి, భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య సికింద్రాబాద్‌ కోర్టు న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్ళారు. ఆమెను 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు.  ఈ కేసులో ఏ-1గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ-2గా భూమా అఖిలప్రియను, ఆ తర్వాత ఆమె భర్త భార్గవరామ్‌ను, శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్‌లను నిందితులుగా చేర్చారు.  


నాకు సంబంధం లేదు: సుబ్బారెడ్డి

నంద్యాల:  కిడ్నాప్‌ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని  ఏవీ సుబ్బారెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  సుపారీ ఇచ్చి తనను చంపేందుకు ప్రయత్నించిన ఆమెతో కలిసి కిడ్నాప్‌ ఘటనకు ఎలా పాల్పడతానని ఆయన ప్రశ్నించారు.


భూవివాదమే కారణం..

హఫీజ్‌పేటలో ఉన్న 25ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్‌ వ్యవహారానికి కారణమని విచారణలో వెల్లడైనట్లు సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు. 2016లో ఈ స్థలాన్ని ప్రవీణ్‌ కొనుగోలు చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో ఏవీ సుబ్బారెడ్డికి, ప్రవీణ్‌కు మధ్య స్థలానికి సంబంధించి వివాదం ఉన్నప్పటికీ... భూమా నాగిరెడ్డి ప్రమేయంతో వివాదం సద్దుమణిగింది. భూమా నాగిరెడ్డి మృతి తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియ ఆ స్థలంలో తమ వాటాకు సంబంధించి ప్రవీణ్‌ను సంప్రదించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 21న ఏవీ సుబ్బారెడ్డి, అతని అనుచరులు కలిసి స్థలంలో అక్రమంగా ప్రవేశించారని అప్పట్లో వాచ్‌మన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పీఎ్‌సలో కేసు కూడా నమోదై ఉంది. హఫీజ్‌పేట్‌ భూమికి సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు అఖిలప్రియ నుంచి ఎదురైన గత వివాదాల నేపథ్యంలో.. వారే కిడ్నాప్‌ చేసి ఉంటారని కుటుంబీకులు అనుమానించడంతో పోలీసులు నిందితులను సునాయాసంగా గుర్తించగలిగారు.

Updated Date - 2021-01-07T07:55:41+05:30 IST