రెండో రోజు ముగిసిన ఆట.. వందకు చేరువగా భారత్ ఆధిక్యం

ABN , First Publish Date - 2021-03-05T22:57:14+05:30 IST

ఇంగ్లండ్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి

రెండో రోజు ముగిసిన ఆట.. వందకు చేరువగా భారత్ ఆధిక్యం

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ కంటే 89 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నేటి ఆటలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆట ఆకట్టుకుంది. పర్యాటక జట్టుపై ఆధిక్యం సాధించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు బంతితో విరుచుకుపడుతున్న వేళ పంత్, సుందర్ ఇద్దరూ సవాలు విసిరారు. 


పంత్ టెస్టుల్లో మూడో సెంచరీ (101) చేసి అవుటవగా, సుందర్ 60 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 49 పరుగులు చేసి అవుటవగా, పుజారా 17, రహానే 27, అశ్వన్ 13 పరుగులు చేసి అవుటయ్యారు. గిల్, కెప్టెన్ కోహ్లీ ఇద్దరూ డకౌట్ అయ్యారు. అక్షర్ పటేల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు తీసుకోగా, స్టోక్స్, జాక్ లీచ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయింది.

Updated Date - 2021-03-05T22:57:14+05:30 IST