ఫలించిన చర్చలు.. స్వదేశానికి చేరనున్న 367 మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-07-12T23:26:40+05:30 IST

మలేషియా ప్రభుత్వంతో కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో భద్రతా దళాల అదుపులో ఉన్న సుమారు 367 మంది భారతీ

ఫలించిన చర్చలు.. స్వదేశానికి చేరనున్న 367 మంది భారతీయులు!

కౌలాలంపూర్: మలేషియా ప్రభుత్వంతో కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో భద్రతా దళాల అదుపులో ఉన్న సుమారు 367 మంది భారతీయులను ఇండియాకు తరలించేందకు మలేషియా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేయడానికి మలేషియా ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఆర్థిక వ్యవస్థను దృష్టి‌లో ఉంచుకుని చాలా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించాయి. ఇతర దేశాల మాదిరిగానే మలేషియా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ.. మలేషియాలో అక్రమంగా నివసిస్తున్న వలస కార్మికులు, శరణార్థులను అదుపులోకి తీసుకోవాల్సిందిగా మే నెలలో భద్రతా దళాలను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు.. అక్రమ వలసదారులు, శరణార్థులను అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా వీసా గడువు ముగిసిపోయి అక్కడే చిక్కుకున్న భారతీయులను కూడా భద్రతా దళాలు బంధించాయి. దీంతో రంగంలోకి దిగిన కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్.. మలేషియా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. చర్చలు ఫలించడంతో భద్రతా దళాల అదుపులో ఉన్న సుమారు 367 మంది భారతీయులను.. విడతల వారీగా ఇండియాకు తరలించేందుకు మలేషియా ప్రభుత్వం  అంగీకరించింది. ఇందులో భాగంగా శనివారం రోజు కొంతమందిని విడుదల చేసిన మలేషియా ప్రభుత్వం.. అమృత్‌సర్‌, చెన్నైకి రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది.


Updated Date - 2020-07-12T23:26:40+05:30 IST