'Google'పై అమెరికాలోని 36 రాష్ట్రాలు దావా!

ABN , First Publish Date - 2021-07-09T17:54:11+05:30 IST

టెక్ దిగ్గజం గూగుల్‌పై అమెరికాలోని వాషింగ్టన్ డీసీతో పాటు 36 రాష్ట్రాలు కోర్టులో కేసు వేశాయి.

'Google'పై అమెరికాలోని 36 రాష్ట్రాలు దావా!

వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్‌పై అమెరికాలోని వాషింగ్టన్ డీసీతో పాటు 36 రాష్ట్రాలు కోర్టులో కేసు వేశాయి. ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్‌‌లో ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’ యాంటీ-ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ దావా వేశాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌ పోటీతత్వ వాతావరణాన్ని తట్టుకోలేక వ్యాపారంలో పోటీని వ్యతిరేకించే ఒప్పందాలు చేసుకోవడం, విధానాలను అనుసరిస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. తద్వారా యాండ్రాయిడ్‌ వినియోగదారులకు చౌకగా మొబైల్ యాప్స్ దొరకకుండా చేస్తుందని పేర్కొన్నాయి. ఇదే విషయమై న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా ఆన్ జేమ్స్.. ఉటా, నార్త్ కరోలినా, టేనస్సీ తదితర రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌తో కలిసి కోర్టులో దావా వేశారు.   


యాప్‌ డెవలపర్లు వారి డిజిటల్‌ కంటెంట్‌ను గూగుల్‌ ప్లే సోర్ట్‌లో కొనుగోలు చేసిన యాప్‌ల ద్వారా, గూగుల్‌ మధ్యవర్తిగా మాత్రమే విక్రయించాలని నిర్దేశిస్తోందని జేమ్స్ పేర్కొన్నారు. తద్వారా వారి నుంచి కమిషన్‌ రూపంలో 30 శాతం వరకు గూగుల్‌ అర్జిస్తోందని ఆరోపించారు. చాలా ఏళ్లుగా ఇంటర్నెట్‌కు గేట్‌కీపర్‌గా వ్యవహరిస్తూ వచ్చిన గూగుల్‌.. ఇప్పుడు డిజిటల్ పరికరాలకు సైతం గేట్‌ కీపర్‌గా మారిందని మండిపడ్డారు. దీని ఫలితంగా మనం రోజూ వాడే సాఫ్ట్‌వేర్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని జేమ్స్ తెలిపారు. ఈ క్రమంలో తనకు పోటీగా వచ్చే థర్డ్‌ పార్టీ యాప్‌ డెవలపర్ల ఉత్పత్తులను అణిచివేసేందుకు సాంకేతిక అడ్డంకులను గూగుల్ విధిస్తుందని అటార్నీ ఆరోపించారు. పోటీతత్వ వాతావరణాన్ని తట్టుకోలేక గూగుల్ ఇలా యాంట్రీ-ట్రస్ట్ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. 

Updated Date - 2021-07-09T17:54:11+05:30 IST