35% వృద్ధులు పొగరాయుళ్లు

ABN , First Publish Date - 2021-01-13T09:04:32+05:30 IST

రాష్ట్రంలోని వృద్ధులు వ్యసనపరులవుతున్నారు. విపరీతంగా ధూమపానం చేస్తూ.. మద్యం సేవిస్తున్నారు. తెలంగాణ జనాభాలో 13.4 శాతం మంది వృద్ధులుండగా..

35% వృద్ధులు పొగరాయుళ్లు

25 శాతం రోజూ మద్యం సేవిస్తున్నారు

ఒంటరిగా జీవిస్తున్న 10 శాతం వృద్ధులు

లాసీ నివేదిక వెల్లడి


హైదరాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వృద్ధులు వ్యసనపరులవుతున్నారు. విపరీతంగా ధూమపానం చేస్తూ..   మద్యం సేవిస్తున్నారు. తెలంగాణ జనాభాలో 13.4 శాతం మంది వృద్ధులుండగా.. అందులో 35 శాతం మందికి పొగతాగడం అలవాటుగా ఉంది. 25 శాతం వృద్ధులు రోజూ మద్యపానం సేవిస్తున్నారు. 8.6 శాతం మంది పీకలదాకా తాగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘లాంగిట్యూడినల్‌ ఏజింగ్‌ స్టడీ ఇన్‌ ఇండియా (లాసీ) 2017-18’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 


66 శాతం వృద్ధులు నిరాక్షరాస్యులే!

రాష్ట్రంలోని వృద్ధుల్లో 66 శాతం నిరాక్షరాస్యులే. 9.7 శాతం మందే పదో తరగతి వరకు విద్యను అభ్యసించారు. రాష్ట్రంలో 82 శాతం కుటుంబాలకు సొంతగృహాలున్నాయి. అందులో 7 శాతం కుటుంబాలు ఇళ్లను కొనుగోలు చేయగా.. 68 శాతం సొంతంగా నిర్మించుకున్నాయి. భారతదేశంలో 46 శాతం కుటుంబాలకు సొంతభూమిలేదు. తెలంగాణలో మాత్రం 52.7 శాతానికి లేదు. 37.9 శాతానికే వ్యవసాయభూమి ఉండగా.. 42 శాతానికి వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి.


అప్పుల్లో 39 శాతం కుటుంబాలు!

రాష్ట్రంలోని 39 శాతం కుటుంబాలు రుణాలు తీసుకుని అప్పుల్లో చిక్కుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 48 శాతం కుటుంబాలకు అప్పులుండగా.. పట్టణ ప్రాంతాల్లో 22.8 శాతం కుటుంబాలకు ఉన్నాయి. అప్పుల్లో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. 52.5 శాతంతో పొరుగురాష్ట్రం కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌(44ు), బిహార్‌(41.1), ఒడిశా(40.7) రాష్ట్రాలున్నాయి. వ్యవసాయ పనిముట్లు, పెళ్లిఖర్చులు, వైద్యం కోసం ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లు లాసీ నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 32 శాతం కుటుంబాలు ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన చేస్తున్నాయని పేర్కొంది. 17.3 శాతం కుటుంబాలకు మహిళలే ప్రధాన ఆధారమని వివరించింది.


నివేదికలోని ప్రధానాంశాలు..!

  • తెలంగాణలో 83.3ు హిందువులుండగా.. ముస్లింలు 12, క్రైస్తవులు 3.8, సిక్కులు 0.4%, బౌద్దులు, జైనులు, పార్శీలు 0.5%మంది ఉన్నారు. ఓబీసీలు 58.5%, ఎస్సీలు 19.9%, ఎస్టీలు 6.4% ఉన్నారు. 
  • 10% వృద్ధులు ఒంటరిగా జీవనం కొనసాగిస్తున్నారు. భార్య, భర్తలతో 31%, పిల్లలతో 53%, ఇతరులతో 4.87%మంది ఉంటున్నారు. తమకు కల్పిస్తున్న సౌకర్యాలతో 65ు సంతృప్తిగా ఉన్నారు. 
  • రాష్ట్రంలో 85% కుటుంబాలకు రేషన్‌ కార్డులున్నాయి. అందులో 80% కుటుంబాలే వాటిని ఉపయోగిస్తున్నాయి. 

Updated Date - 2021-01-13T09:04:32+05:30 IST