3,307 పాజిటివ్‌లు!

ABN , First Publish Date - 2021-04-16T09:22:09+05:30 IST

రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం కొత్తగా 3,307 మంది వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులివే.

3,307 పాజిటివ్‌లు!

రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం కొత్తగా 3,307 మంది వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులివే. బుధవారం 1,06,627 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,307 మందికి పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 446 పాజిటివ్‌లు వచ్చాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,38,045కు చేరింది. గడిచిన 24 గంటల్లో  వైరస్‌ నుంచి 897 మంది కోలుకున్నారు. వైర్‌సతో మరో 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,788కి చేరింది. కాగా, ఏపీలో గత 24 గంటలో.. 5,086 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 9,42,135కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 835 మందికి వైరస్‌ సోకగా.. కర్నూలులో 626, గుంటూరులో 611, శ్రీకాకుళంలో 568, తూర్పుగోదావరిలో 450, విశాఖపట్నంలో 432, కృష్ణాలో 396, అనంతపురంలో 334 కేసులు వెలుగుచూశాయి. ఇక 24 గంటల్లో 14 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 


ఒక్క రోజులో 1.35 లక్షల మందికి టీకా

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్క రోజే 1,35,421 మందికి కరోనా టీకా వేశారు. ఇందులో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ 1,25,383 ఉండగా, రెండో డోస్‌ 10,038 మందికి వేశారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో 24,58,372 మందికి టీకా వేశారు. 


ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి మళ్లీ పాజిటివ్‌

వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. బుధవారం ఆయన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం నలతగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లారు. కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆరు నెలల క్రితం ఆయనకు పాజిటివ్‌ రాగా చికిత్స పొందారు. 


గాంధీలో కరోనాతో 25 మంది మృతి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): గాంధీలో కరోనా వార్డులో చికిత్స పొందుతున్న 25 మంది చనిపోయారు. కరోనా సోకి చివరి స్టేజ్‌లో గాంధీలో చేరిన 25 మంది కరోనాతో పోరాడుతూ గురువారం మృతి చెందారు. ప్రతిరోజుతో పోల్చితే ఈ రోజు మృతుల్లో 45 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవారి సంఖ్య పెరిగింది. 

Updated Date - 2021-04-16T09:22:09+05:30 IST