Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 23 Sep 2020 03:53:44 IST

రాజధాని రైతుల్లో 32% ఎస్సీ, ఎస్టీలే!

twitter-iconwatsapp-iconfb-icon
రాజధాని రైతుల్లో 32% ఎస్సీ, ఎస్టీలే!

రెడ్లు 23 శాతం... కమ్మ 18 శాతం

25వేల మంది రెండెకరాల్లోపు రైతులే

‘ఒక్కరి కోసమే అమరావతి’ అసత్యం

వైసీపీ స్వార్థం కోసమే దుష్ప్రచారం

రాజధానిని మార్చడం మోసమే

సీఆర్డీయే రద్దు కుదరదు.. తరలింపు వద్దు

హైకోర్టులో ‘దళిత బహుజన ఫ్రంట్‌’ పిల్‌


అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల బిల్లును రద్దు చేసి... అమరావతి నుంచి రాజధాని తరలింపునకు  సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలంటూ హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. గుంటూరుకు చెందిన ‘దళిత బహుజన ఫ్రంట్‌’ సొసైటీ కార్యదర్శి ఎం.భాగ్యారావుతోపాటు మరో ఆరుగురు ఈ పిల్‌ దాఖలు చేశారు. రాజధాని కోసం భూ సమీకరణ పథకం కింద 34,323 ఎకరాలు అందజేసిన రైతులను నష్టపరిచేలా ఉన్న పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల చట్టంలోని సెక్షన్‌ 7, 8లను  రద్దు చేయాలని అభ్యర్థించారు. ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వాదనలో నిజం లేదని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన వారిలో ఎస్సీ రైతులే అధికులని గణాంకాలతో సహా వివరించారు. ‘‘సంపన్న రైతులు మాత్రమే భూములిచ్చారని, అందులోనూ ఎక్కువమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారున్నారని, వారికి లాభం చేకూర్చి పెట్టడానికే టీడీపీ అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని, అమరావతి ప్రాంతంలో బలహీన వర్గాలకు స్థలం లేదని వైసీపీ నేతలు ప్రచారానికి దిగారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీ రైతులే. రెడ్లు 23 శాతం, కమ్మ కులానికి చెందిన వారు 18 శాతం ఉన్నారు. ఇక... బీసీలు 14 శాతం, కాపులు 9 శాతం, మైనారిటీలు 3 శాతం, ఇతరులు ఒక శాతం ఉన్నారు.  భూసమీకరణ కింద రాష్ట్ర ప్రభుత్వం 29,881 మంది నుంచి 34,323 ఎకరాలు తీసుకుంది. ఇందులో... సన్నకారు రైతులే 25,771 మంది!’’ అని వివరించారు.  ఇంకా ఈ పిటిషన్‌లో ఏముందంటే... 


ఇలా అన్యాయం... 

రాజధాని కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు అరెకరా నుంచి 5 ఎకరాల వరకు భూములప్పగించారు. రాజధాని ఏర్పాటు చేసి,  ప్లాట్లు అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ ఏకైక హామీతో ఎలాంటి పరిహారం పొందకుండానే భూములిచ్చారు. ఆ భూముల్లో ఇప్పటికే వివిధ భవనాలు నిర్మించడంతో పాటు రోడ్లు వేశారు. ఆ భూములు తిరిగిచ్చినా సాగు చేయడం కష్టం. రైతుల సారవంతమైన భూములన్నీ ఎందుకూ పనికి రాకుండాపోయాయి. అభివృద్ధి చేయకపోవడమంటే సీఆర్‌డీఏ చట్టం ద్వారా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేయడమంటే భూములిచ్చిన రైతులను, ఏపీ ప్రజల్ని ప్రభుత్వం మోసం చేయడమే. పాలనా వికేంద్రీకరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టం రూపొందించే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సన్నకారు రైతులు, ఎస్సీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, వ్యవసాయ కూలీలే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఎంతోమంది వ్యవసాయ కూలీలు వలసవెళ్లిపోయారు. రైతుకు ఆర్థిక సాయం అందించడంలోనూ ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. రాజధాని నిర్మాణం కోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇప్పటికే అధికభాగం భవనాలు పూర్తి కాగా, ఇంకొన్ని నిర్మాణ దశలో వున్నాయి. రాష్ట్రానికి నడిమధ్యలో రాజధాని అమరావతి ఉంది. 


ఆరోపణలు... అబద్ధాలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... అమరావతిపై ఆరోపణలు చేయడం మొదలైంది. చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, అందులో ఎక్కువ భాగం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారివని, మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధాని అమరావతి అభివృద్ధి చెంది, నిర్మాణాలు పూర్తయితే టీడీపీ మాత్రమే లబ్ధిపొందుతుందని, ఆర్థికంగా వారు కోట్లకు పడగలెత్తుతారని వైసీపీ నేతలు ఆరోపించారు. కేవలం... వైసీపీ నేతలు తమ  స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ కక్షతో టీడీపీ నేతలను దెబ్బ తీసేందుకు హఠాత్తుగా మూడు రాజధానుల ప్రకటన చేశారు.  నిజానికి రాష్ట్ర ప్రజల్లో అలాంటి డిమాండ్‌ ఏదీ లేదు.  రాజధానిని ముక్కలు చేయడం కోసం జగన్‌ తన రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రైవేటు ఏజెన్సీ నుంచి నివేదిక  తెప్పించుకున్నారు. ఆ నివేదిక రాక ముందే  తన ఉద్దేశాన్ని అసెంబ్లీలో వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కనీసం అమరావతి ప్రాంతంలోని రైతులు, కార్మికుల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం కూడా ఈ విషయంలో రాజకీయ క్రీడకు దిగింది. 


నమ్మించి... గెలిచారు 

విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును విపక్ష నేతగా ఉన్న జగన్‌ స్వాగతించారు. ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ మూడు రాజధానుల గురించి వైసీపీ ఏమీ చెప్పలేదు. పైగా... వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి ఎక్కడికీ పోదని చెప్పారు. ప్రస్తుతం మంత్రులుగా, ఇతర పదవుల్లో ఉన్న ఆ పార్టీ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో రాజధానిని తరలించాల్సిన అవసరం లేదని బహిరంగ ప్రకటనలు చేశారు. జగన్‌ తాడేపల్లిలో నివాస భవనం నిర్మించుకోవడం ద్వారా అమరావతి నుంచి రాజధాని తరలింపు ఉండదన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించారు. ఆ పార్టీ నేతలు ఇచ్చిన ప్రకటనల్ని ప్రజలు నమ్మి  వైసీపీకి భారీ మెజారిటీని కట్టబెట్టారు. దాంతో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.