Kuwaitలో వారం రోజుల్లో 309 మంది వలసదారుల అరెస్ట్.. ఉల్లంఘనదారులకు వార్నింగ్!

ABN , First Publish Date - 2021-11-14T13:43:08+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది.

Kuwaitలో వారం రోజుల్లో 309 మంది వలసదారుల అరెస్ట్.. ఉల్లంఘనదారులకు వార్నింగ్!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని రోజులుగా వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు భారీ సంఖ్యలో ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 309 మంది నివాస అనుమతులను ఉల్లంఘించిన వలసదారులను అరెస్ట్ చేశారు. వీరిలో 250 మంది రెసిడెన్సీ గడువు ముగిసిన వారు ఉంటే.. 59 మంది పరారీ కేసులు ఉన్నవారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 6 నుంచి 12వ తేదీ వరకు ఆరు గవర్నరేట్ల పరిధిలో అధికారులు నిర్వహించిన సోదాల్లో 309 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 


వీరిలో 256 మందిని చెక్‌పాయింట్ల వద్ద అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారికి సంబంధించిన 80 వాహనాలను సైతం సీజ్ చేశారు. ఈ సందర్భంగా వలసదారులను సంబంధిత అధికారులు హెచ్చరించారు. ప్రవాసులు రెసిడెన్సీతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే అరెస్ట్ చేసి, వెంటనే దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే సెక్యూరిటీ, ట్రాఫిక్ విభాగాలు ఉల్లంఘనదారుల కోసం భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గవర్నరేట్ల పరిధిలలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. కాగా, రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు వారి స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు నాలుగు సార్లు గడువు ఇచ్చినా.. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని ఈ సందర్భంగా ఉల్లంఘనదారులపై మంత్రిత్వశాఖ మండిపడింది.    

Updated Date - 2021-11-14T13:43:08+05:30 IST