ఆక్సిజన్‌ అవసరాలకు 309 కోట్లు

ABN , First Publish Date - 2021-05-10T09:22:59+05:30 IST

రాష్ట్రంలో కరోనా రోగులకు ఆక్సిజన్‌ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.309.87 కోట్లు కేటాయించింది. అనేక మంది ఆక్సిజన్‌ అందక చనిపోతుండడంతో ఇకపై ఆ పరిస్థితి తలెత్తకూడదన్న ఉద్దేశంతో పభుత్వం ఆక్సిజన్‌

ఆక్సిజన్‌ అవసరాలకు 309 కోట్లు

అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా రోగులకు ఆక్సిజన్‌ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.309.87 కోట్లు కేటాయించింది. అనేక మంది ఆక్సిజన్‌ అందక చనిపోతుండడంతో ఇకపై ఆ పరిస్థితి తలెత్తకూడదన్న ఉద్దేశంతో పభుత్వం ఆక్సిజన్‌ అవసరాల కోసం రూ.309.87 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తం నిధులతో 50 క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు కొనుగోలు చేయనున్నట్టు, 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లకు పైప్‌లైన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సివిల్‌, ఎలక్ర్టికల్‌ పనులకు, 10వేల ఆక్సిజన్‌ పైప్‌లైన్ల ఏర్పాటుకు, వాటితోపాటు ఆక్సిజన్‌ పైప్‌లైన్ల నిర్వహణకు ప్రతి జిల్లాకు నెలకు రూ.10 లక్షల చొప్పున కేటాయించనున్నట్లు జీవోలో వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఏపీకి సరఫరా అవుతున్న లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కరికల్‌ వలవన్‌ను నియమిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీచేశారు. 


‘కొవిడ్‌’ ఉద్యోగులకు 15 శాతం వెయిటేజీ

కొవిడ్‌-19 ఉపద్రవం సమయంలో గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం ప్రాతిపదికన సేవలందించిన ఉద్యోగులకు వైద్యశాఖలోని రెగ్యులర్‌ ఖాళీల భర్తీలో గరిష్ఠంగా 15 శాతం వెయిటేజీ కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో 6 నెలలు పనిచేసిన వారికి 2.5 శాతం వెయిటేజీ, గ్రామీణ ప్రాంతాల్లో 6 నెలలు సేవలందించిన వారికి 2 శాతం వెయిటేజీ, పట్టణ ప్రాంతాల్లో 6 నెలల పాటు సేవలందించిన వారికి 1 శాతం వెయిటేజీ కల్పిస్తున్నట్టు శనివారం వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక 6 నెలల పాటు కొవిడ్‌ విధులు నిర్వర్తించిన వారికి 5 మార్కుల వెయిటేజీ, ఏడాది పాటు నిర్వహించిన వారికి 10 మార్కుల వెయిటేజీ, ఏడాదిన్నర పాటు సేవలందించిన వారికి 15 శాతం వెయిటేజీ కల్పించినట్టు పేర్కొంది. అర్హత పరీక్ష పాసైన సంవత్సరం ఆధారంగా గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీ కల్పించింది. పాసైన ఏడాది నుంచి ఏడాదికి ఒక మార్కు వెయిటేజీ చొప్పున నిర్ణయించింది. కొవిడ్‌-19 సమయంలో జిల్లా కలెక్టర్‌ లేదా సంబంధిత వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ద్వారా విధుల్లోకి చేరిన వారికి మాత్రమే ఈ వెయిటేజీ వర్తిస్తుందని జీవోలో స్పష్టం చేసింది.

Updated Date - 2021-05-10T09:22:59+05:30 IST