సెప్టెంబరుకల్లా 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌

ABN , First Publish Date - 2021-02-25T08:26:48+05:30 IST

కోల్‌బెల్ట్‌లో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి వచ్చే సెప్టెంబరుకల్లా అందుబాటులోకి రానుందని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు.

సెప్టెంబరుకల్లా 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌

సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌

హైదరాబాద్‌/కొత్తగూడెం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కోల్‌బెల్ట్‌లో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి వచ్చే సెప్టెంబరుకల్లా అందుబాటులోకి రానుందని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. ఇందులో మొదటి, రెండో దశలోని 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణాలు ఏప్రిల్‌కల్లా పూర్తవుతాయని, మిగతా 81 మెగావాట్ల ప్లాంట్లను సెప్టెంబరునాటికి సిద్ధం చేసి మొత్తం 300 మెగావాట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) డి.సత్యనారాయణతోపాటు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) ప్రతినిధులతో శ్రీధర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ సమీపంలోని మానేరు డ్యామ్‌పై నిర్మించతలపెట్టిన 350 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)పై చర్చించారు. 


దేశంలో ఏ ప్రభుత్వ బొగ్గు సంస్థ చేపట్టని విధంగా సింగరేణి 300 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను కోల్‌బెల్ట్‌లో నిర్మిస్తోందన్నారు. తొలి దశలో మిగిలిన ఇల్లెందులోని 24 మెగావాట్లను వారంలోపు, రామగుండంలోని 20 మెగావాట్లను మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేసి విద్యుత్‌ను అనుసంధానం చేయాలన్నారు. రెండో దశలో చేపట్టిన 90 మెగావాట్ల  ప్లాంట్లను ఏప్రిల్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని అదానీ గ్రూప్‌ ప్రతినిధులకు సూచించారు. మూడో దశలో 81 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లలో నీటిపై తేలియాడే 15 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా చేయాలని నోవస్‌ గ్రీన్‌ ఎనర్జీ సిస్టమ్స్‌కు సూచించారు. రామగుండం-3లోని ఓబీ డంపులపై నిర్మించే 22 మెగావాట్లు, డోర్లీ ఓబీ డంపులపై 10 మెగావాట్లు, చెన్నూరులో 11 మెగావాట్లు, కొత్తగూడెం ఏరియాలో 23 మెగావాట్ల నిర్మాణాలను సెప్టెంబరునెలాఖరుకు పూర్తి చేయాలని అదానీ గ్రూప్‌నకు సూచించారు. 

Updated Date - 2021-02-25T08:26:48+05:30 IST