Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 11 Aug 2022 03:40:00 IST

28 లక్షలు ఇస్తే సెటిల్‌మెంట్‌

twitter-iconwatsapp-iconfb-icon
28 లక్షలు ఇస్తే సెటిల్‌మెంట్‌

భూ వివాదంలో భారీగా లంచం డిమాండ్‌ 

సింహాచలం పూర్వ ఈవోపై ఏసీబీకి ఫిర్యాదు 

అధికార పార్టీ పెద్దల దృష్టికి వ్యవహారం 

మీ పని మీరు చేసుకోండంటూ అభయం 

తర్వాత 7 నెలల పాటు ఈవోగా విధులు 

వారం క్రితం సిక్కోలు ఆర్‌డీవోగా బదిలీ 

ఆరోపణలపై దేవదాయ శాఖలో కదలిక 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

సింహాచలం దేవస్థానం పూర్వ ఈవోపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దేవదాయ శాఖ తాజాగా విచారణకు ఆదేశించింది. వారం క్రితం వరకు ఇక్కడ ఈవోగా పనిచేసిన ఎం.సూర్యకళపై ఆరేడు నెలల క్రితమే ఏసీబీకి ఫిర్యాదు అందింది. భూ వివాదంలో ఒక సొసైటీకి అనుకూలంగా నివేదిక రాయడానికి రూ.28 లక్షలు లంచం అడుగుతున్నారంటూ రెవెన్యూలో ఆమె సహోద్యోగే ఏసీబీకి, దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం విశాఖ వైసీసీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఆమెను పిలిపించి మాట్లాడారు. ‘తప్పు అయిపోయిందని, ఈవో పోస్టు నుంచి తప్పిస్తే రెవెన్యూకి వెళ్లిపోతాన’ంటూ ఆమె వేడుకున్నారు. ‘ఏమీ కాదు. మీ పని మీరు చేసుకోండి’ అంటూ వారు అభయం ఇచ్చారు. తరువాత దాదాపు ఏడు నెలలు ఈవోగా కొనసాగిన ఆమె... వారం క్రితమే విజయనగరం ఆర్‌డీఓగా బదిలీపై వెళ్లారు. ఇప్పుడు దేవదాయ శాఖ మేల్కొని గతంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేయాలని రాజమహేంద్రవరం రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ సురేశ్‌బాబును, ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఆఫీసర్‌ విజయరాజును, మరికొందరు అధికారులను ఇటీవల విశాఖపట్నం పంపించింది. 


ఇదీ నేపథ్యం... 

విశాఖపట్నంలోని సాలిగ్రామపురం సమీపాన మధుసూదననగర్‌ సర్వే నంబర్లు 289/పి, 290/పి, 291/పిలో 13.5 ఎకరాల భూమిని 160 మంది వ్యక్తులు వేర్వేరుగా కొనుగోలు చేశారు. ఆ భూమి తమదంటూ సింహాచలం దేవస్థానం కోర్టుకు వెళ్లింది. దాంతో ఆ 160మంది కలసి మాధవ్‌ హిల్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌గా ఏర్పడి కోర్టులో కేసు వేశారు. దానిపై కోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సొసైటీకి సెక్రటరీ ఆర్‌.వెంకటేశ్వరరావు గతం లో సూర్యకళ తహసీల్దారుగా ఉన్న సమయం లో ఆమె వద్ద ఆర్‌ఐగా పనిచేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విచారణలో వెంకటేశ్వరరావు ఏం చెప్పారంటే... ‘సూర్యకళ సింహాచలం ఈవోగా రాగానే వెళ్లి.. మాధవ్‌ సొసైటీ భూములకు ఎన్‌వోసీ ఇవ్వాలని కోరాను. ‘మీకు పని ఎలా చేయించుకోవాలో తెలియదు. అందుకే ఇన్నాళ్లూ ఫైల్‌ ఆగిపోయింది’ అని ఆమె అన్నారు. ఆ తరువాత చాలాసార్లు కలవగా... అనుకూలంగా నివేదిక రాయడానికి రూ.28 లక్షలు అవుతుందని, అందులో ఓ స్వామీజీ సహా పలువురికి వాటాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దాంతో ఆమెపై ఏసీబీకి, దేవదాయ శాఖకు ఫిర్యాదు చేశాను. కేసు నమోదుకు అవసరమైన ఆధారాలు, సాక్ష్యాల కోసం ఏసీబీ అధికారులు ప్రణాళిక రచించారు. ఆడియో, వీడియోను రికార్డు చేసే పెన్‌ కెమెరా నా జేబులో పెట్టి ఈవో వద్దకు పంపించారు. ఒకరోజు ఆమె అడిగిన దాంట్లో కొంత మొత్తం ఇచ్చి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నారు.  అయితే, ఆమెతో గతంలో కలిసి పనిచేసి ఉండడం, ఏసీబీ కేసు నమోదైతే కెరియర్‌ మొత్తం నాశనమైపోతుందనే ఉద్దేశంతో నేనే వెనక్కి వచ్చేశాను’ అంటూ వివరించారు. 


మరో అవకాశం 

లంచం అడిగారని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించాలని తాజాగా విచారణ అధికారులు వెంకటేశ్వరరావును కోరారు. తనవద్ద ఆధారాలు ఏమీ లేవని, అన్నీ ఏసీబీ వద్దే ఉన్నాయని ఆయన సమాధానం చెప్పారు. విచారణలో ఆయన చెప్పిన ఈ వివరాలను అధికారులు కనీసం రికార్డు చేసుకోకపోవడం గమనార్హం. లంచం అడిగారని చెప్పడానికి సరైన ఆధారాలు తీసుకురావాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని చెప్పి పంపించేశారు. విశాఖ దేవదాయ శాఖలో ఒక్క సూర్యకళే కా దు.. మరో అధికారిణి కూడా లంచాలు డిమాం డ్‌ చేస్తున్నారని, ఇవ్వకపోతే వేధిస్తున్నారని  ఆరోపణలు వచ్చినా అధికార పార్టీ పెద్దలు వారిపై చర్యలు లేకుండా అడ్డంపడ్డారు. ఇప్పుడవన్నీ చర్చనీయాంశంగా మారాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.