ఆసరా కోసం.. 2400 కోట్ల ఓడీ

ABN , First Publish Date - 2020-09-13T07:09:14+05:30 IST

‘ఓవర్‌డ్రాఫ్టుకు వెళ్లడమంటే తప్పు చేసినట్టే..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టంగానే చెప్పారు. రాష్ట్రాన్ని దివాలా తీయించినందునే ఓడీ కోసం గత ప్రభుత్వం వెళ్లిందని కూడా విమర్శించారు. కానీ, ఏ మేజర్‌ సంక్షేమ పథకానికి

ఆసరా కోసం.. 2400 కోట్ల ఓడీ

  • ఆదాయం లేక, అప్పులు పుట్టక ఓవర్‌డ్రాఫ్ట్‌ బాట
  • పథకానికి సొమ్ము సర్దడానికి అవస్థలు
  • కార్పొరేషన్లను ఊడ్చినా ఇంకా తరుగే
  • 21 రోజుల్లోగా తిరిగి చెల్లించేలా
  • ఆర్‌బీఐ నుంచి ఓడీ నిధులు
  • కట్టలేకపోతే రాష్ట్ర ఖజానా ‘దివాలా’
  • ఓడీ తప్పు అని నాడు గొప్పగా ప్రకటన
  • కానీ పథకాల కోసం ఇప్పటికే పలుమార్లు 

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఓవర్‌డ్రాఫ్టుకు వెళ్లడమంటే తప్పు చేసినట్టే..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టంగానే చెప్పారు. రాష్ట్రాన్ని దివాలా తీయించినందునే ఓడీ కోసం గత ప్రభుత్వం వెళ్లిందని కూడా విమర్శించారు. కానీ, ఏ మేజర్‌ సంక్షేమ పథకానికి నిధులను సమీకరించాల్సి వచ్చినా.. కొత్త ప్రభుత్వం ‘ఓడీ’ బాట పడుతూనే ఉంది! తాజాగా తెచ్చిన ‘ఆసరా’ పథకం కోసమూ ఈ నిధులే వాడుకోవడం గమనార్హం! ఆదాయం లేకపోయినా, అప్పులు పుట్టకపోయినా, సంక్షేమ పథకాల ఉరవడి మాత్రం కొనసాగాల్సిందేనన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో నిధులు తేలేక ఆర్థిక శాఖ ముప్పుతిప్పలు పడుతోంది. ‘ఆసరా’ విషయమే తీసుకొంటే.. ఈ పథకం కోసం కార్పొరేషన్ల నుంచి దాదాపు రూ.1300 కోట్ల నిధులను లాగేశారు. దీనికోసం  భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు రూ.450 కోట్లను కార్మిక శాఖ నుంచి పీఎ్‌ఫసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించిన సంగతి తెలిసిందే. అలాగే ఇతర కార్పొరేషన్లలో ఉన్న అర కొర నిధులు రూ.850 కోట్లను కూడా ఉపయోగించుకున్నారు. అయినా, చాలలేదు. అటుచూస్తే పథకం అమలు గడువు దగ్గరపడుతోంది. దీంతో ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ)కు వెళ్లి రూ.2,400 కోట్లను తీసుకొచ్చారు. అంతకుముందు మంగళవారం ఆర్‌బీఐ రాష్ట్ర సెక్యూరిటీల వేలం ద్వారా రూ.2,000 కోట్లు తెచ్చారు.  మిగిలిన నిధులను వేజ్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా సమకూర్చి..  ఆసరా తొలివిడత పంపిణీకి అవసరమైన మొత్తం రూ.6,700 కోట్లు పోగు చేశారు. 


ఓడీగా ప్రకటిస్తే  దివాలే..

ఓవర్‌ డ్రాఫ్ట్‌కి వెళ్లి ఆర్‌బీఐ నుంచి నిధులు తెచ్చుకుంటే వాటిని 14 పని దినాల్లో చెల్లించాలి. కానీ, కరోనా సంక్షోభం కారణంగా చెల్లింపు గడువును 21 రోజులకు ఆర్‌బీఐ పెంచింది. ఈ 21 రోజుల్లోగా ఆర్థిక శాఖ ఆ మొత్తం నిధులు ఆర్‌బీఐకి తిరిగి చెల్లించాలి. లేనిపక్షంలో రాష్ట్రం దివాలా తీసినట్టు ఆర్‌బీఐ ప్రకటిస్తుంది. రాష్ట్రం ఓడీలో ఉందంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు ఖాళీ అయినట్టే లెక్క. ఒ క్కసారి రాష్ట్రం ఓడీలోకి వెళ్లిందంటే ఆ ఓడీ నిధులు తిరిగి ఆర్‌బీఐ వద్ద జమ చేసేవరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి పైసా కూడా రాదు. ప్రభుత్వఖజానాలో జమ అయ్యే నిధులు ఆటోమేటిక్‌గా ఓడీ కింద జమ అవుతూ ఉంటాయి. ఆర్‌బీఐ వద్ద ఓడీ బకాయి తీరేవరకు ఖజానాకు రూపాయి కూడా రాదు.


పరపతి సరే.. ఇచ్చే బ్యాంకు ఏది?

తాను వచ్చిన 15 నెలల్లో వైసీపీ ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల అప్పులను చేసింది. దీంతో ఎక్కడా ఇప్పుడు రూపాయి అప్పు దొరకడం లేదు. మళ్లీ కేంద్రం నుంచి అనుమతి వచ్చేవరకు ఆర్‌బీఐ నుంచి అప్పులు తెచ్చుకునే చాన్స్‌ రాష్ట్రానికి లేదు. కాబట్టి అనుమతులు వచ్చేవరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నా కూడా ఓడీకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లర్లకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా ఆర్‌బీఐ నుంచి అప్పులు తెస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు కాబట్టి ఓడీకి వెళ్లక తప్పదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌ ద్వారా రూ.11,000 కోట్ల అప్పులు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు రాష్ట్రానికి పరపతి ఉంది. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి అప్పులివ్వడానికి ఏ బ్యాంకూ ముందుకురావడం లేదని తెలుస్తోంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఓడీకి వెళ్లి, కార్పొరేషన్ల నుంచి నిధులు ఊడ్చి ‘ఆసరా’కు ఉపయోగించారు. 

Updated Date - 2020-09-13T07:09:14+05:30 IST