21న మునుగోడుకు అమిత్‌ షా

ABN , First Publish Date - 2022-08-18T09:04:54+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆగస్టు 21న ఆయన నల్గొండ జిల్లా మునుగోడుకు రానున్నారు.

21న మునుగోడుకు అమిత్‌ షా

సాయంత్రం 4 గంటలకు భారీ బహింగ సభ

 బహిరంగసభకు ఇన్‌చార్జ్‌ల నియామకం

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆగస్టు 21న ఆయన నల్గొండ జిల్లా మునుగోడుకు రానున్నారు. ఆరోజు సాయంత్రం 4  గంటలకు అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌ వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తు రణనీతిని కూడా అమిత్‌ షా మునుగోడు సభలో వివరిస్తారని.. ఆ సభ తర్వాత ఎన్నికల ముఖచిత్రం మారిపోతుందని చెప్పారు. అంతేకాదు.. కేసీఆర్‌  ప్రభుత్వం నుంచి ముక్తి పొందే మార్గాన్ని ఆ సభ నిర్దేశిస్తుందని పేరొన్నారు. అదే రోజు.. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా అమిత్‌ షా సమక్షంలో పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరబోతున్నట్టు తరుణ్‌ ఛుగ్‌ తెలిపారు. బీజేపీకి ప్రజల ఆశీర్వాదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణకు అతిపెద్ద శత్రువు అవినీతి, కుటుంబ పాలనే. వీటి పేరు చెప్పగానే కొందరు వణికిపోతున్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ ధమాకా ఇంకా మరిచిపోలేదు. మునుగోడు ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. అహంకారపూరితమైన, అవినీతిమయమైన, కుటుంబ, నియంత పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. 21వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభ తరువాత కేసీఆర్‌ కౌంట్‌ డౌన్‌ వేగం మరింత పెరుగుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ  చేస్తోందని ఛుగ్‌ మండిపడ్డారు. రాజ్యాంగం ప్రతి పార్టీకి రాజకీయం చేసుకునే హక్కు కల్పించిందని.. వాక్‌ స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని.. అలాంటి అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంపై కూడా కేసీఆర్‌కు విశ్వాసం లేదని ధ్వజమెత్తారు. కొత్త రాజ్యాంగం లిఖించాలని చాలా సందర్భాల్లో బహిరంగంగా ఆయన చెప్పారని గుర్తుచేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేయడాన్ని ఛుగ్‌ ఖండించారు. ‘‘ఈ పాదయాత్ర ద్వారా కేసీఆర్‌ మీద ప్రజలకున్న ఆక్రోశం వెలుగులోకి వస్తోంది. కేసీఆర్‌ అధికారం చేజారిపోతుందన్న భయంతోనే యాత్రపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేశారు. 2024లో బీజేపీదే విజయం, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. కేసీఆర్‌ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఈ దాడులే నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, అధికారులపై ఉంది. తెలంగాణ అభివృద్ధి పఽథంలో కొనసాగడం వెనుక ప్రధాని మోదీ సహకారం ఉంది’’ అని తెలిపారు. కాగా.. ఈ సభకు సంబంధించి జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్‌ నేతల చొప్పున ఇన్‌చార్జులను నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్‌ మండలం సహా నియోజకవర్గంలోని మొత్తం 9 మండలాలకు 18 మంది సీనియర్‌ నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.

Updated Date - 2022-08-18T09:04:54+05:30 IST