తెలంగాణలో 2 లక్షల టీకాల వృథా

ABN , First Publish Date - 2021-06-07T09:07:05+05:30 IST

నిర్వహణలో వైఫల్యం కారణంగా తెలంగాణలో 2.21 లక్షల కరోనా టీకా డోసులు వృథా అయ్యాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.

తెలంగాణలో 2 లక్షల టీకాల వృథా

కొరత నేపథ్యంలో ఇలా చేయడం మానవత్వానికే నష్టం

వ్యాక్సిన్‌ వృథాను నిరోధించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత

జనవరి-మార్చిలో 41లక్షల టీకాలు.. 13లక్షలే వాడకం

నిర్వహణ వైఫల్యమే కారణం.. తప్పుబట్టిన కేంద్ర ప్రభుత్వం


న్యూఢిల్లీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): నిర్వహణలో వైఫల్యం కారణంగా తెలంగాణలో 2.21 లక్షల కరోనా టీకా డోసులు వృఽథా అయ్యాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. దేశమంతా వ్యాక్సిన్‌ కొరత ఎదుర్కొంటుంటే.. ఇలా చేయడం మానవత్వానికే నష్టమని పేర్కొంది. వృథాను అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. అందుబాటులో ఉన్న టీకాలనూ సరిగా వినియోగించుకోలేయారని తప్పుబట్టింది. జనవరి-మార్చి మధ్య 41.4 లక్షల డోసుల లభ్యత ఉంటే 13 లక్షల డోసులే పంపిణీ చేశారని వివరించింది. జనవరిలో 8.9 లక్షల డోసులుంటే 1.7 లక్షలు, ఫిబ్రవరిలో 13.8 లక్షల డోసులకు 2.5 లక్షలు, మార్చిలో 18.7 లక్షల డోసులకు 8.8 లక్షలు మాత్రమే పంపిణీ చేయగలిగారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణకు 69.23 లక్షల డోసులు ఉచితంగా ఇస్తే 2.21 లక్షల డోసులను నేలపాలు చేశారంటే అర్థమేమిటని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.


ఈ నెల 4 నాటికి తెలంగాణ ఆరోగ్య సిబ్బందిలో 64 శాతం మందికే టీకా ఇచ్చారని కేంద్రం పేర్కొంది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ సైతం సరఫరా చేసిన కోటాను పూర్తిగా పంపిణీ చేయలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంబంధిత గణాంకాలు విడుదల చేశాయి. తగినంత సౌకర్యాలు ఉన్నా.. రాష్ట్రాలు ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వడంలో విఫలమయ్యాయని ఆరోపించింది.


కేరళలో వృథా అత్యధికం

అన్ని రాష్ట్రాల కంటే కేరళలో అత్యధికంగా 6.33 లక్షల డోసులు (6.15 శాతం) వృథా చేశారని కేంద్రం తెలిపింది. రాజస్థాన్‌లో 2.5 శాతం, పంజాబ్‌ లో 2.5 శాతం, ఛత్తీ్‌సగఢ్‌లో 1.73 శాతం టీకాలు నిరుపయోగమైనట్లు పేర్కొంది.

Updated Date - 2021-06-07T09:07:05+05:30 IST