Abn logo
May 14 2021 @ 17:53PM

వైరల్ వీడియో: భారతీయుల అరెస్ట్‌కు యత్నం.. అడ్డుకున్న ప్రజలు

లండన్: ఇద్దరు భారతీయులకు పాకిస్థాన్‌కు చెందిన లాయర్ సహా వేలాది మంది అండగా నిలిచారు. అరెస్ట్ చేయొద్దంటూ నినదించారు. దీంతో అధికారులు, పోలీసులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సుమిత్ సహదేవ్ (చెఫ్), లఖ్వీర్ సింగ్ (మెకానిక్) ఇద్దరూ దాదాపు 10ఏళ్లుగా యూకేలో నివసిస్తున్నారు. కాగా.. వీరిద్దరూ అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణతో యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు, స్కాట్లాండ్ పోలీసులు గురువారం రోజు గ్లాస్గోలోని పోలోక్‌షీల్డ్స్ ప్రాంతానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నిర్భంధ కేంద్రానికి తరలించేందుకు పోలీస్ వ్యాన్‌లోకి ఎక్కించారు. 


ఈ క్రమంలో సుమిత్, లఖ్వీర్ సింగ్‌ల అరెస్ట్‌ను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన లాయర్ అమీర్ అన్వర్ సైతం భారతీయుల అరెస్ట్‌ను వ్యతిరేకించారు. దాదాపు 8 గంటలపాటు ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో యూకే ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు వెనక్కి తగ్గారు. సుమిత్, లఖ్వీర్ సింగ్‌లను వదిలేశారు. అమీర్ అన్వర్ మాట్లాడుతూ ‘శరణార్థుల రక్తం, స్వేదంతోనే ఈ నగరం నిర్మితమైంది. అందుకే వారికి అండగా నిలిచాం’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుమిత్, లఖ్వీర్ సింగ్ స్పందిస్తూ తమకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.